విద్య ద్వారానే ప్రపంచంతో పోటీ పడగలం: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

  • రాబోయే 50 ఏళ్ళను దృష్టిలో పెట్టుకొని విద్యారంగ అభివృద్ధికి కృషి చేస్తున్నాం

విద్యతోనే సమాజం అభివృద్ధి చెందుతుంది, రాష్ట్రాలు దాటి ప్రపంచంతో పోటీ పడాలంటే కేవలం విద్య ద్వారానే సాధ్యమవుతుంది అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. సోమవారం జూబ్లీహిల్స్ లో ఓ ప్రైవేట్ సంస్థ విద్యారంగంపై రూపొందించిన కాఫీ టేబుల్ ఆవిష్కరణ అనంతరం ఆయన ప్రసంగించారు. సామాజిక మార్పు, వెనుకబాటు తనాన్ని రూపుమాపాలన్న, సమ సమాజ స్థాపనకు విద్య ఒక్కటే మార్గం అని డిప్యూటీ సీఎం తెలిపారు.
మన పూర్వీకులు పండిట్ జవహర్లాల్ నెహ్రూ మొదలుకొని నేటి వరకు అనేకమంది ప్రధానులు, ముఖ్యమంత్రులు తీసుకువచ్చిన విద్యాసంస్థల మూలంగా ఈ దేశం వేగంగా అభివృద్ధి సాధించింది అన్నారు. ఐఐఐటి, REC, యు జి సి ఆధ్వర్యంలో పలు యూనివర్సిటీల ఏర్పాటు మూలంగా మన తెలుగు వాళ్ళు ప్రముఖ కంపెనీలకు సీఈఓ ల స్థాయికి ఎదిగారని వివరించారు.

వ్యక్తులు స్థాపించిన విద్యాసంస్థలు యూనివర్సిటీల స్థాయికి ఎదిగి అడ్వాన్సుడ్ టెక్నాలజీని బోధించే స్థాయికి చేరాయి అని తెలిపారు. మారుతున్న సామాజిక అవసరాలకు అనుగుణంగా సిలబస్ మారితేనే ప్రయోజనం అని సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని యావత్ క్యాబినెట్ భావించి స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేశాం అన్నారు. పరిశ్రమలకు పనికొచ్చేలా సిలబస్ రూపొందించామని తెలిపారు. రాష్ట్రంలో కొన్ని దశాబ్దాల కిందట ఏర్పాటు చేసిన 100 ఐటిఐ లను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా మార్చాం, వివిధ పరిశ్రమల అధిపతులు సూచించిన సిలబస్ ను వాటిలో ప్రవేశపెట్టామని తెలిపారు. పేదలకు ప్రపంచ స్థాయి విద్యను అందించేందుకు దేశంలో ఎక్కడా లేని విధంగా 25ఎకరాల విస్తీర్ణంలో 200 కోట్లు పెట్టుబడితో అసెంబ్లీ నియోజకవర్గానికి కనీసం ఒకటి చొప్పున యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి 104 యంగ్ ఇండియా పాఠశాలల నిర్మాణానికి జీవో జారీ చేశాం, పాఠాలు బోధించే సిబ్బంది కూడా అక్కడే ఉండేలా వసతులు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. కోటి ఉమెన్స్ కాలేజీకి వీరనారి చాకలి ఐలమ్మ పేరు పెట్టి 500 కోట్లతో భవన నిర్మాణాలు చేపడుతున్నామని, ఉస్మానియా యూనివర్సిటీలో కావలసిన అన్ని వసతులను ఏర్పాటు చేస్తున్నామని, బీసీల నియామకం చేశామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో దశాబ్ద కాలంగా నిర్లక్ష్యానికి గురైన విద్య, వైద్యంపై దృష్టి సారించాం అన్నారు. రాబోయే 50, వంద సంవత్సరాల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రజా ప్రభుత్వం విద్యారంగాన్ని పటిష్టం చేస్తుందని తెలిపారు. విద్యారంగ అభివృద్ధికి ప్రభుత్వంతోపాటు ప్రైవేటు సంస్థలు కలిసి పని చేయాల్సిన అవసరం ఉంది, ప్రైవేటు విద్యా సంస్థల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తుందని డిప్యూటీ సీఎం తెలిపారు.