- త్వరలో రూ.33 కోట్ల చేనేత రుణాల మాఫీ
- ఆర్థిక పరిస్థితిని బాగు చేస్తూ ఒక్కో హామీ అమలు
దేశానికే ఆదర్శంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దు తున్నామని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత జౌళి శాఖల మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కే కన్వెన్షన్ హల్ లో నిర్వహించిన నేతన్న పొదుపు, నేతన్న బీమా పథకాల పంపిణీ కార్యక్రమానికి రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత జౌళి శాఖల మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వర రావు, సంక్షేమ శాఖ మంత్రి వర్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, చేనేత, జౌళి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ మహేష్ బిగితే లతో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ 10 సంవత్సరాల కాలంగా ఉన్న బకాయిలను ప్రజా ప్రభుత్వం విడుదల చేస్తుందని అన్నారు. నేత కార్మికుల కోరిక మేరకు లక్ష రూపాయల రుణ మాఫీ వర్తింప చేస్తున్నామని, 33 కోట్ల చేనేత రుణాలను రాబోయే క్యాబినెట్ సమావేశంలో మాఫీ చేయనున్నట్లు మంత్రి తెలిపారు. వేములవాడలో నూలు డిపో ఏర్పాటు చేసి ఇప్పటి వరకు 2500 మెట్రిక్ టన్నుల నూలు 100 సోసైటీలకు సరఫరా చేయడం జరిగిందని వెల్లడించారు. నేతన్న చేయూత, నేతన్న పొదుపు, నేతన్న బీమా వంటి అనేక పథకాల బకాయిలను జమ చేస్తున్నామని అన్నారు.
ఆర్థిక వ్యవస్థ ఇబ్బందికరంగా ఉన్నా పేద ప్రజలపై పన్నుల భారం మోపకుండా ఎన్నికల సమయంలో ఇచ్చిన ఒక్కో హామీ అమలు చేస్తున్నామని అన్నారు. మహిళలకు ఆర్టిసి బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించామని, ఉచిత ప్రయాణానికి 6680 కోట్ల రూపాయలు చెల్లించిందని, మహిళలకు 200 కోట్ల జిరో టికెట్లు జారీ చేశామని, మనల్ని చూసి పక్క రాష్ట్రాలు కూడా ఈ పథకాన్ని అమలు చేస్తున్నాయని అన్నారు.
సన్న వడ్లు పండించే రైతులకు క్వింటాళ్ల 500 రూపాయల బోనస్ ఇచ్చి ప్రోత్సహిస్తున్నామని, పేద ప్రజలకు రేషన్ ద్వారా సన్న బియ్యం సరఫరా చేస్తున్నామని, ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకాలతో దేశంలో 2 కోట్ల 80 లక్షల ట్రిప్ టన్నుల ధాన్యం పండిస్తున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని మంత్రి తెలిపారు.
దేశానికే తెలంగాణ రాష్ట్రం మోడల్ గా నిలిచిందని అన్నారు. 50 లక్షల కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నామని, మహిళలకు 500 రూపాయల గ్యాస్ సిలిండర్ సరఫరా చేస్తున్నామని, రెండు లక్షల రైతు రుణమాఫీ పూర్తి చేసామని, 9 రోజులలో 9 వేల కోట్ల రూపాయల రైతు భరోసా నిధులు జమ చేసామని, అన్ని రకాల పరిశ్రమలు, గృహ అవసరాలకు 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తున్నామని అన్నారు.
వస్త్ర పరిశ్రమలు ఆధునిక సాంకేతికతను పెంచేందుకు హ్యాండ్లూమ్ యూనివర్సిటీ (ఐ.ఐ.ఐహెచ్.టి) ఏర్పాటుకు కృషి చేస్తున్నామని అన్నారు. మహిళలు గౌరవంగా స్వీకరించేలా నాణ్యమైన చీరలు తయారు చేయాలని 450 రూపాయలు ఒక్క చీర పై ఖర్చు చేస్తూ 65 లక్షల మంది మహిళా సంఘాల సభ్యులకు రెండు చీరలు చొప్పున పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.
అనంతరం సంక్షేమ శాఖ మంత్రి వర్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ, చేనేత పవర్ రూం కార్మికులను ఆదుకోవాలని ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చర్యలు చేపట్టారని అన్నారు. ప్రభుత్వం ఆర్థిక స్థితిగతులను బాగు చేస్తూ దేశంలో ఎక్కడా లేనివిధంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారన్నారు. రేషన్ ద్వారా సన్న బియ్యం సరఫరా, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 రూపాయల గ్యాస్ సిలిండర్ సరఫరా, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఇందిరమ్మ ఇండ్ల, నూతన రేషన్ కార్డుల జారీ వంటి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని అన్నారు.
విద్య పై ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధ పెట్టారని అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ ప్రత్యేకంగా అభివృద్ధి చేసేందుకు నిధులు మంజూరు చేస్తున్నారన్నారు. 6 నుంచి ఇంటర్ వరకు సంక్షేమ గృహాల్లో చదివే పిల్లలకు నాణ్యమైన ఆహారం అందించేందుకు డైట్ చార్జీలు పెంచామని, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో 25 ఎకరాల విస్తీర్ణంలో 200 కోట్ల వ్యయంతో యంగ్ ఇండియా సమీకృత గురుకులాల నిర్మాణం జరుగుతుందని తెలిపారు.
ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లాను అన్ని రకాలుగా అభివృద్ధి చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వం లో ప్రజా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని అన్నారు. నేత కార్మికుల కష్టాలు తీర్చేందుకు ప్రజా ప్రభుత్వం పలు చర్యలు చేపట్టిందని అన్నారు.
వస్త్ర పరిశ్రమలో 352 కోట్ల రూపాయల బకాయిలను రేవంత్ సర్కార్ చెల్లించిందని అన్నారు.చేనేత కార్మికులకు పని కల్పించాలనే లక్ష్యంతో 270 కోట్ల రూపాయల విలువ గల బట్ట ఉత్పత్తి ఆర్డర్లను ప్రభుత్వం అందించిందని వెల్లడించారు.
కేకే మహేందర్ రెడ్డి మాట్లాడుతూ, బతుకమ్మ చీరల ఉత్పత్తి బకాయిలు దాదాపు 350 కోట్ల రూపాయలను ప్రజా ప్రభుత్వం విడుదల చేసిందని అన్నారు. స్వశక్తి మహిళా సంఘాలోని మహిళలకు 2 నాణ్యమైన చీరలు అందించాలని నిర్ణయించి, ఆ చీరల ఉత్పత్తి ఆర్డర్ సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ కు కేటాయించామని అన్నారు.
వేములవాడ లో 50 కోట్ల రూపాయల ఖర్చు చేసి నూలు డిపో ఏర్పాటు చేశామని అన్నారు. నేతన్న పొదుపు, నేతన్న బీమా, నేతన్నలకు లక్ష రూపాయల రుణ మాఫీ వంటి అనేక సంక్షేమ పథకాలను సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం అమలు చేస్తుందని అన్నారు.
చేనేత జౌళి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యార్ మాట్లాడుతూ సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ కార్మికులకు చేతినిండా పని కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రభుత్వ శాఖల ఆర్డర్లను ఇప్పిస్తుందని తెలిపారు. ఇందిరా మహిళా శక్తి కింద ఉత్పత్తి చేసే ఆర్డర్లతో ఒక్కో కార్మికుడికి నెలకు 20 వేల నుంచి 25 వేల వరకు ఆదాయం వస్తుందని వివరించారు. ఆర్డర్లు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ, నేతన్న పొదుపు (త్రిఫ్ట్) పథకం క్రింద జిల్లాకు చెందిన 4963 మంది వస్త్ర పరిశ్రమ కార్మికులకు 24 కోట్ల 80 లక్షల రూపాయలను, నేతన్న బీమా ఉండి మరణించిన 12 చేనేత కార్మికుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల చొప్పున పరిహారం చెక్కులు పంపిణీ చేస్తున్నామని అన్నారు.చేనేత సహకార సంఘాలకు క్యాష్ క్రెడిట్ కింద రుణాలు రెన్యువల్ చేస్తున్నామని అన్నారు. చేనేత కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎస్పీ మహేష్ బి గీతే, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, సిరిసిల్ల ఆర్డీవో వెంకటేశ్వర్లు, చేనేత జౌళి శాఖ జేడీ ఎన్వీ రావు, ఏడీ రాఘవరావు, మార్కెట్ కమిటీ చైర్మన్ లు, నేత కార్మికులు, ఆసాములు ప్రజా ప్రతినిధులు, స్థానిక నాయకులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
