రాష్ట్రంలో వ్యవసాయం కుప్పకూలింది: మాజీ మంత్రి హరీశ్‌రావు

  • మరో రైతు మృతి ఇందుకు నిదర్శనం.. ఎక్స్‌ వేదికగా మాజీ మంత్రి హరీశ్‌రావు

తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయం కుప్పకూలిందని, మరో రైతు మృతి ద్వారా ఈ విషయం రుజువైందని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల మండలం ఈర్లపల్లిలో రవినాయక్‌ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. రైతు మృతి తనను కలచివేసిందని హరీశ్‌రావు ఆవేదన వ్యక్తంచేశారు.

ఈ మేరకు ఎక్స్‌లో ఓ పోస్ట్‌ పెట్టారు. రైతుకు ప్రాథమిక వైద్య సేవలు అందించడంలోనూ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శించారు. ఇది రేవంత్‌రెడ్డి ప్రభుత్వం చేసిన హత్యేనని ఆరోపించారు. రైతులను నిరాశలోకి నెట్టి, ఇటు జీవితంలో, అటు మరణంలోనూ వారికి గౌరవం లేకుండా చేసినందుకు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం బాధ్యత వహించాలని హరీశ్‌రావు డిమాండ్‌ చేశారు.