పేషెంట్ల విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలి: మంత్రి దామోదర్ రాజనర్సింహ

నిమ్స్‌లో పేషెంట్లకు అందుతున్న వైద్య సేవలపై ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ సమీక్ష చేశారు. హైదరాబాద్‌లోని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కార్యాలయంలో నిమ్స్ డైరెక్టర్ బీరప్ప, ఇతర ఉన్నతాధికారులతో మంత్రి సమావేశం నిర్వహించారు. నిమ్స్‌లో ఈ ఏడాది తొలి 7 నెల్లలో (జనవరి నుంచి జులై) 5 లక్షల 44 వేల మందికి వైద్య సేవలు అందించామని బీరప్ప తెలిపారు. ఇందులో సగానికిపైగా ఆరోగ్యశ్రీ, ఈజేహెచ్‌ఎస్ వంటి ప్రభుత్వ పథకాల కింద ఉచితంగా చికిత్స పొందారని ఆయన తెలిపారు. మెరుగైన వైద్య సేవలు అందుతుండడంతో, నిమ్స్‌కు వచ్చే పేషెంట్ల సంఖ్య గణనీయంగా పెరిగిందని బీరప్ప వివరించారు. ఈ‌ ఏడాది ఇప్పటికే వందకుపైగా కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ సర్జరీలు కూడా చేశామని ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా నిమ్స్ డైరెక్టర్, డాక్టర్లు, సిబ్బందిని మంత్రి అభినందించారు. అత్యవసర పరిస్థితుల్లో నిమ్స్‌కు వస్తున్న పేషెంట్ల విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని మంత్రి సూచించారు. వీలైనంత త్వరగా పేషెంట్లను అడ్మిట్ చేసుకుని, ట్రీట్‌మెంట్ అందించాలని సూచించారు. ఎమర్జన్సీ వార్డులో అవసరమైన చికిత్స అందించి, సంబంధిత వార్డుకు పేషెంట్‌ను షిఫ్ట్ చేయాలన్నారు. ప్రస్తుతం నిమ్స్ ఎమర్జెన్సీకి రోజుకు 80 నుంచి వంద మంది పేషెంట్లు వస్తున్నారని డైరెక్టర్ బీరప్ప తెలిపారు. ఇందులో సగం మందికిపైగా పేషెంట్లు ప్రైవేటు, కార్పొరేట్ హాస్పిటల్స్‌లో చికిత్స పొంది, పరిస్థితి విషమించాక చివరి నిమిషంలో నిమ్స్‌కు వస్తున్నారని బీరప్ప వెల్లడించారు. కొన్ని కార్పొరేట్ హాస్పిటల్స్‌ ఆపరేషన్లు చేసి, పేషెంట్లు పూర్తిగా కోలుకోకముందే వారిని డిశ్చార్జ్ చేసి, నిమ్స్‌, ఉస్మానియా, గాంధీ హాస్పిటల్స్‌కు పంపిస్తున్నారని బీరప్ప వివరించారు. ఇలాంటి కేసుల వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు.

ఎమర్జన్సీకి వచ్చే పేషెంట్లలో నేరుగా నిమ్స్‌కు వచ్చే వారికి, ప్రభుత్వ హాస్పిటల్స్ నుంచి రిఫరల్‌పై వచ్చే వారికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఈ సందర్భంగా మంత్రి సూచించారు. ప్రైవేట్, కార్పొరేట్ హాస్పిటల్స్ నుంచి వచ్చే పేషెంట్ల విషయంలోనూ సానుభూతితో వ్యవహరించి చికిత్స అందించాలన్నారు. ఆపరేషన్ల తర్వాత, చికిత్స మధ్యలో పేషెంట్లను డిశ్చార్జ్ చేస్తున్న ప్రైవేట్, కార్పొరేట్ హాస్పిటల్స్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆరోగ్యశాఖ అధికారులను మంత్రి ఆదేశించారు. గాంధీ, ఉస్మానియా, నిమ్స్, ఇతర ప్రభుత్వ హాస్పిటళ్ల ఎమర్జన్సీ డిపార్ట్‌మెంట్ల నడుమ సమన్వయం ఉండాలని, ఒక హాస్పిటల్‌ ఎమర్జెన్సీ వార్డులో బెడ్లు నిండుకున్నప్పుడు పేషెంట్‌ను మరో హాస్పిటల్‌కు రిఫర్ చేసి అక్కడ అడ్మిట్ చేసుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. పేషెంట్‌ను రిఫర్ చేయడానికి ముందే అవసరమైన ప్రాథమిక చికిత్స అందించి, స్టేబుల్ చేయాలన్నారు. ఒక హాస్పిటల్ నుంచి మరో హాస్పిటల్‌కు పంపించేటప్పుడు ఆ పేషెంట్‌తో పాటు అవసరమైతే అంబులెన్స్‌లో ఒక డాక్టర్‌ను పంపించాలని మంత్రి సూచించారు. పేషెంట్ల అడ్మిషన్, రిఫరల్ విషయంలో డ్యూటీ డాక్టర్లు, ఆర్‌ఎంవోలు నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. సమావేశంలో హెల్త్ సెక్రటరీ క్రిస్టినా జడ్ చొంగ్తూ, నిమ్స్ డైరెక్టర్ బీరప్ప, మెడికల్ ఎడ్యుకేషన్ అడిషనల్ డైరెక్టర్ వాణి, ఉస్మానియా మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ రాజారావు డాక్టర్ వాణి తదితరులు పాల్గొన్నారు.