ఉర్దూ జర్నలిస్టులకు 100 కంప్యూటర్లు: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

ఉర్దూ జర్నలిస్టులకు ప్రభుత్వం నుండి 100 కంప్యూటర్లు సమకూర్చడానికి, వెనుకబడిన తరగతులు మైనారిటీ సంక్షేమ శాఖ మాత్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అంగీకరించారని ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హమ్దన్ తెలిపారు. తెలంగాణ మీడియా అకాడమీ హైదరాబాదులో నిర్వహిస్తున్న ఉర్దూ జర్నలిస్టుల పునఃచరణ తరగతుల ప్రారంభ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మీడియా అకాడమీ చైర్మన్ కే.శ్రీనివాస్ రెడ్డి గారి మార్గదర్శకత్వంలో రాష్ట్ర జర్నలిస్టులకు ముఖ్యంగా ఉర్దూ జర్నలిస్టుల నైపుణ్యాన్ని పెంచే విధంగా ఈ శిక్షణా తరగతులు ఉపయోగపడుతున్నాయని అన్నారు. రాష్ట్రంలోని ఉర్దూ జర్నలిస్టుల కోసం ఉర్దూ అకాడమీ ద్వారా సహాయం చేయడానికి తనవంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు.

తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కే. శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, మాతృభాషకు తగినంత ప్రేరణ, ఆదరణ ఇవ్వాలని అన్నారు. యూరప్ ఖండంలోని ఫ్రెంచ్, జర్మనీ, క్యూబా, ఇటలీ దేశాల ప్రజలు ప్రభుత్వం వారి మాతృభాషలో అన్ని కార్యకలాపాలు చేస్తున్నారని అన్నారు. మన రాష్ట్ర అధికారిక భాషలైన తెలుగు, ఉర్దూ భాషలకు మనమంతా ప్రాధాన్యత నిచ్చి అన్ని కార్యకలాపాలు మాతృభాషలోనే చేయాలని తెలిపారు. మీడియా అకాడమీ జిల్లాలలో పనిచేస్తున్న జర్నలిస్టులకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నదని, ఇప్పటి వరకు నాగర్ కర్నూల్, సిద్దిపేట, వరంగల్ జిల్లాలలో తరగతులు నిర్వహించామని, హైదరాబాద్ మీడియా అకాడమీ ఆడిటోరియంలో మేడ్చల్ మల్కాజ్ గిరి, రంగారెడ్డి జిల్లాల జర్నలిస్టులకు, గిరిజన జర్నలిస్టులకు ప్రత్యేకంగా తరగతులు నిర్వహించినట్లు ఆయన తెలిపారు. సెప్టెంబర్, 3వ తేదీన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఫ్యాక్ట్ చెక్, సైబర్ నేరాలపై ప్రత్యేక వర్క్ షాప్ అకాడమీ నిర్వహిస్తున్నదని ఈ సందర్భంగా తెలియజేశారు. ప్రముఖ ఉర్దూ జర్నలిస్ట్ మాజీద్ మాట్లాడుతూ, జర్నలిస్టులు ఆధునిక టెక్నాలజీని నేర్చుకుంటూ తమ రిపోర్టింగ్లో మెలుకువలు పెంచుకోవాలని అన్నారు. పాత తరంలో జర్నలిస్టు అంటే నిజం తెలిపేవాడు అనే అభిప్రాయము ఉండేదని మెల్లమెల్లగా అది పల్చబడుతున్నదని అన్నారు. కార్యక్రమంలో మీడియా అకాడమీ కార్యదర్శి నాగులపల్లి వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.