బీసీ రిజరేషన్లకు సంబంధించిన బిల్లులకు బీఆర్ఎస్ సంపూ ర్ణ మద్దతు అందిస్తుందని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తెలిపారు. అసెంబ్లీలో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే విషయమై కాంగ్రె్‌సకు చిత్తశుద్ధి లేదని ఆరోపించారు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే డెడికేటెడ్ కమిషన్ వేయాలని డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో బీఆర్ఎస్ సూచనలను సర్కారు పరిగణనలోకి తీసుకోవడం లేదని మండిపడ్డారు. మంత్రివర్గంలోనూ బీసీలకు 42% వాటా కల్పిస్తామన్నారని, ఇది సీఎం చేతుల్లోనే ఉందని గుర్తు చేశారు. బీసీ రిజర్వేషన్ల బిల్లుపై సంబంధిత మంత్రికి కనీస అవగాహన లేదని విమర్శించారు. దీంతో మంత్రి పొన్నం జోక్యం చేసుకుని.. అపశకునం మాటలొద్దని సూచించారు.
ఆకారం పెద్దగా ఉన్నంత మాత్రాన అవగాహన ఉందనుకోవడం సరికాదని వ్యాఖ్యానించారు. దీంతో బాడీ షేమింగ్ చేయడం సరికాదంటూ గంగుల అభ్యంతరం వ్యక్తం చేశారు. స్పీకర్ జోక్యం చేసుకుని.. మంత్రికి అవగాహన లేదన్న వ్యాఖ్యల్ని వెనక్కి తీసు కోవాలని సూచించారు. గంగుల మాట్లాడుతూ జీవో ఇచ్చినంత మాత్రాన బీసీ రిజర్వేషన్ల అమలు సాధ్యం కాదని, తమిళనాడులో సర్వే కోసం డెడికెటె డ్ కమిషన్ రెండున్నరేళ్లపాటు పనిచేసిందని గుర్తు చేశారు. దీనిపై మంత్రి శ్రీధర్‌బాబు స్పందిస్తూ.. బీసీ రిజర్వేషన్ల అంశం మరో పదేళ్లపాటు సాగాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ మాట్లాడుతోందన్నారు.