- గిరిజన ప్రాంతమైన బెండలపాడు చారిత్రక ఘట్టం..
- పండుగ వాతావరణంలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు..
- రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార మరియు పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండలం బెండలపాడు గ్రామంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి చేతుల మీదుగా పేదవారి సొంతింటి కల నెరవేరబోతుందని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార మరియు పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. మంగళవారం బెడాలపాడు గ్రామంలో జరగబోయే ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశాల ఏర్పాట్లను గృహనిర్మాణ శాఖ ఎండి వి. పి. గౌతమ్, జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్, జిల్లా ఎస్పీ రోహిత్ రాజు, అశ్వరావుపేట శాసనసభ్యులు జారే ఆదినారాయణ, భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు, ఇల్లందు శాసనసభ్యులు కోరం కనకయ్యతో కలిసి మంత్రి పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, మారుమూల గిరిజన ప్రాంతమైన బెండలపాడు గ్రామానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రావడం ఒక చారిత్రక ఘట్టం. ఇది గ్రామ ప్రజలకు సంతోషకరమైన మరియు గుర్తుండిపోయే రోజు అవుతుంది. ముఖ్యమంత్రి పర్యటన విజయవంతం కావడానికి జిల్లా యంత్రాంగంలోని అన్ని శాఖల అధికారులు సమన్వయంతో, బాధ్యతాయుతంగా పనిచేయాలి అని సూచించారు. మంత్రి అధికారులు గృహప్రవేశ వేడుకలను పండుగ వాతావరణంలో, అంగరంగ వైభవంగా నిర్వహించాలన్నారు. సభా ప్రాంగణాన్ని పరిశీలించిన అనంతరం, గ్రామాన్ని అందంగా తీర్చిదిద్దడంలో ఎలాంటి లోటు లేకుండా పనులు పూర్తి చేయాలని సూచించారు.
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలపై మాట్లాడుతూ మంత్రి తెలిపారు, మా ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి గృహనిర్మాణ శాఖను బలోపేతం చేస్తూ, పేదవారికి న్యాయం జరిగేలా పారదర్శక విధానంలో ఇళ్లను మంజూరు చేస్తున్నాం. లబ్ధిదారుల ఎంపిక నుండి వారి ఖాతాల్లో నిధుల జమ వరకు మొత్తం ప్రక్రియలో పారదర్శకతకు ప్రాధాన్యం ఇస్తున్నాం. ఎక్కడైనా అవకతవకలు జరిగినా వాటిని వెంటనే గుర్తించి, సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటివరకు కొందరిని సస్పెండ్ చేయడం, కేసులను ఏసీబీకి అప్పగించడం కూడా జరిగింది అని అన్నారు. ఇందిరమ్మ ప్రభుత్వానికి ఓటు వేసిన వారికే కాకుండా, రాజకీయాలు, కులం, మతం అనే తేడా లేకుండా ప్రతి పేదవానికి సొంతింటి కల నెరవేరేలా చర్యలు తీసుకుంటున్నాం. ఈ పథకం వల్ల జిల్లాలోనే సుమారు 21,500 కుటుంబాల లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారు గృహప్రవేశాల సందర్భంగా లబ్ధిదారులను ప్రత్యక్షంగా ఉద్దేశించి మాట్లాడి, వారి సంతోషంలో పాలుపంచుకుంటారు అని మంత్రి పేర్కొన్నారు.
గత ప్రభుత్వం గృహనిర్మాణ శాఖను నిర్వీర్యం చేసి, పేదవారి కలలను దెబ్బతీసింది. కానీ మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గృహనిర్మాణ శాఖను తిరిగి బలోపేతం చేసి, లక్షలాది పేదలకు గృహాల కలను నిజం చేసేందుకు కృషి చేస్తున్నాం” అన్నారు. ఈ మహత్తర గృహప్రవేశ కార్యక్రమానికి జిల్లా మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు, ఇంచార్జ్ మంత్రి వాకాటి శ్రీహరి, ఇతర సహచర మంత్రులు, శాసనసభ్యులు పాల్గొంటారని మంత్రి తెలిపారు. ఈ పరిశీలనలో టీజీ ఐడిసి చైర్మన్ మువ్వ విజయ్ బాబు,ట్రైనీ కలెక్టర్ సౌరబ్ శర్మ, జడ్పీ సీఈఓ నాగలక్ష్మి, కొత్తగూడెం ఆర్డీవో మధు జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.