- మానవీయకోణంతో ప్రజా ప్రభుత్వం చేపట్టిన భారీ సంక్షేమ పథకం
ప్రజా ప్రభుత్వం మహోన్నత ఆశయంతో మానవీయకోణంలో, ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల భారీ సంక్షేమ పథకం విజయవంతం చేసేందుకు రాష్ట్రంలోని సిమెంటు, స్టీలు పరిశ్రమలు భాగస్వాములు కావాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు కోరారు. మంగళవారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తో కలిసి సిమెంటు, స్టీలు పరిశ్రమల యజమానులు, అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. 22,500 కోట్లతో 4.50 లక్షల ఇందిరమ్మ ఇల్లు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించి ఇప్పటికే రాష్ట్రంలో వేగంగా ఇళ్ల నిర్మాణం చేస్తుందని తెలిపారు. స్టీలు సిమెంటు పరిశ్రమలను ఈ రాష్ట్రంలో ఎంతగానో ప్రోత్సహించాం మానవీయ కోణంలో ఆలోచించి ఇందిర ఇళ్ల నిర్మాణానికి స్టీలు, సిమెంటు ధరలు తగ్గించి, భారీ బవంతుల నిర్మాణానికి ఏ విధమైన నాణ్యతతో సిమెంటు, స్టీలు సరఫరా చేస్తారో అందుకు ఏమాత్రం నాణ్యతలో రాజీ పడకుండా ఇందిరమ్మ ఇళ్లకు సిమెంటు, స్టీలు అందించాలని తెలిపారు. పేద కుటుంబాలకు సంబంధించిన సంక్షేమ పథకం కాంగ్రెస్ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే 10 సంవత్సరాల తర్వాత రాష్ట్రంలో అమలు అవుతుంది, రాష్ట్ర ప్రగతిలో భాగస్వాములై చేయూతనివ్వాలని పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు కోరారు. పెద్ద , చిన్న అనే అంతరం లేకుండా కంపెనీలన్నీ ఒకే ధరకు సిమెంటు, స్టీలు సరఫరా చేయాలని మంత్రి శ్రీధర్ బాబు సూచించారు. రాష్ట్రంలో పరిశ్రమలను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నాం, ప్రపంచ ప్రసిద్ధిగాంచిన పరిశ్రమలు హైదరాబాద్ తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తున్నాయి భవిష్యత్తులో రాష్ట్రంలో సిమెంటు, స్టీలు ఉత్పత్తులకు భారీ డిమాండ్ ఏర్పడుతుంది, రాష్ట్రంలో సిమెంటు, స్టీలు పరిశ్రమల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకొని తక్కువ ధరకు, నాణ్యతతో కూడిన సిమెంటు, స్టీలను సరఫరా చేయాలని మంత్రి శ్రీధర్ బాబు వివరించారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో ప్రభుత్వ పథకాలకు సిమెంటు కంపెనీలు అందిస్తున్న ధరను సమావేశంలో మంత్రులు సమీక్షించారు.
4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సుమారు 50 లక్షల మెట్రిక్ టన్నుల సిమెంటు, 27.75 లక్షల మెట్రిక్ టన్నుల స్టీలు అవసరం అవుతుందని అధికారులు పరిశ్రమల యజమానులు, నిర్వాహకులకు వివరించారు.ప్రభుత్వం మానవీయ కోణంలో చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకానికి ప్రోత్సహం అందించే అవకాశం కలగడం అదృష్టంగా భావిస్తున్నామని సిమెంటు, స్టీలు కంపెనీల యజమానులు, ప్రతినిధులు తెలిపారు. పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో వీలైనంత త్వరగా స్టీలు, సిమెంటు పరిశ్రమల యాజమాన్యాలు, ప్రతినిధులు సమావేశమై ధరలు ఫైనల్ చేస్తామని కంపెనీల ప్రతినిధులు తెలిపారు. సమావేశంలో చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, పరిశ్రమల శాఖ డైరెక్టర్ నిఖిల్ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.