- ఆస్ట్రేలియా ‘డికన్ యూనివర్సిటీ’ భాగస్వామ్యంతో ఏర్పాటు
- మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో ‘లెటర్ ఆఫ్ ఇంటెంట్’ పై సంతకాలు
తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో ‘ఏఐ’ సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ ను ఏర్పాటు చేసేందుకు ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ విద్యాసంస్థ ‘డికన్(Deakin) విశ్వవిద్యాలయం’ ముందుకొచ్చింది. ఇందుకు సంబంధించిన లెటర్ ఆఫ్ ఇంటెంట్(ఎల్ వోఐ)పై సోమవారం డా.బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సమక్షంలో ‘డికన్ యూనివర్సిటీ’ వీసీ ప్రొఫెసర్ ఇయాన్ మార్టిన్, ఐటీ శాఖ డిప్యూటీ సెక్రటరీ భవేష్ మిశ్రా సంతకాలు చేశారు. అనంతరం ఈ ఒప్పంద పత్రాలను పరస్పరం మార్పిడి చేసుకున్నారు. ‘అంతర్జాతీయ భాగస్వామ్యాల ద్వారా ఏఐ రంగంలో తెలంగాణను గ్లోబల్ లీడర్ గా తీర్చిదిద్దాలన్నదే మా ప్రభుత్వ సంకల్పం. ఏఐలో నూతన ఆవిష్కరణలు, నైపుణ్యాభివృద్ధిని ప్రోత్సహించాలనే లక్ష్యంతోనే ఈ సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ ఏర్పాటుకు డికన్ యూనివర్సిటీతో ఒప్పందం చేసుకున్నాం. ఇది కేవలం లాంఛనప్రాయ ఒప్పందం కాదు. రాబోయే రోజుల్లో కీలక రంగాల్లో తెలంగాణ, ఆస్ట్రేలియా మధ్య ద్వైపాక్షి సంబంధాల మెరుగుదలకు దిక్సూచీగా మారుతుంది. సమాజానికి ఉపయోగపడే అత్యాధునిక ఏఐ పరిష్కారాలను అభివృద్ధి చేయడంతో పాటు పరిశోధనలు, వ్యవస్థాపకతకు కొత్త అవకాశాలను సృష్టిస్తుంది’ అని ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు వివరించారు.
ఏఐ కోర్సుల రూపకల్పన, శిక్షణ, స్టార్టప్ లకు చేయూత
‘ఏఐ, డిజిటల్ ట్రాన్స్‌ఫార్మేషన్ రంగాల్లో ప్రపంచానికి అత్యంత నైపుణ్యమున్న మానవ వనరులను తెలంగాణ నుంచే అందించాలని లక్ష్యంగా పెట్టుకుని, ఆ దిశగా చిత్తశుద్ధితో కృషి చేస్తున్నాం. ఈ సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్, యంగ్ ఇండియన్ స్కిల్ యూనివర్సిటీ సంయుక్తంగా నేటి మార్కెట్ అవసరాలకు అనుగుణంగా ఏఐ కోర్సులకు రూపకల్పన చేసి, ఇక్కడి యువతకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన శిక్షణనిస్తాయి. మన ఏఐ స్టార్టప్ సంస్థలు అంతర్జాతీయ మార్కెట్ లో తెలంగాణ బ్రాండ్ ను మరింత విశ్వ వ్యాప్తం చేసేలా ఆస్ట్రేలియా నిపుణులు మార్గదర్శకత్వం చేస్తారు ’ అని మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు.
ఏఐ ఆధారిత పౌర సేవలను అందించేలా…
‘ఏఐ కేవలం ఒక సాంకేతికత మాత్రమే కాకుండా, సమ్మిళిత వృద్ధికి, మానవాభివృద్ధికి ఒక శక్తివంతమైన సాధనంగా మార్చేలా మా ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలను రూపొందించి అమలు చేస్తోంది. ఈ లక్ష్య సాధనలో ఈ సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ మార్గదర్శిగా మారుతుంది. ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం, గవర్నెన్స్ తదితర రంగాల్లో ఏఐ వినియోగాన్ని పెంచి పౌర సేవలను మరింత సమర్థవంతంగా అందించేలా సంయుక్త పరిశోధనలు నిర్వహిస్తాం. ప్రస్తుతం సమాజం ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు ఏఐ ఆధారిత పరిష్కారాలను కనుగొనేందుకు కృషి చేస్తాం’ అని తెలిపారు.
అందుకే ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం: ప్రొఫెసర్ ఇయాన్ మార్టిన్, వీసీ, డికన్ యూనివర్సిటీ
‘ఏఐలో తెలంగాణను గ్లోబల్ లీడర్ గా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషి ప్రశంసనీయం. ప్రజల శ్రేయస్సు కోసం సమర్థవంతమైన, బాధ్యతాయుతమైన ఏఐ పరిష్కారాలను అందించాలనే లక్ష్యంతోనే భారత్ లో సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ ను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాం. ఇందుకోసం తెలంగాణ అన్ని రకాలుగా అనుకూలంగా ఉందని గుర్తించాం. అందుకే ఇక్కడ ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చాం’ డికన్ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఇయాన్ మార్టిన్ తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ కాన్సూల్ జనరల్(ఆస్ట్రేలియన్ కాన్సూలేట్- జనరల్ బెంగళూరు) స్టీవెన్, కాన్సూల్ ఆండ్రూ కాలిస్టర్, ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్ మెంట్ కమిషనర్ వికా సింగ్, పొలిటిల్ అండ్ ఎకానమిక్ రీసెర్చ్ ఆఫీసర్ రంజని మాధవన్, డికన్ యూనివర్సిటీ ప్రతినిధులు రౌనీత్ పాహ్వా, ప్రియాంక సింగ్, గాయత్రి వేద్ నారాయణన్ తదితరులు పాల్గొన్నారు.