హైదరాబాద్ : ఆసియా ఖండంలోనే అతి పెద్దదైన గిరిజన జాతర, తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచిన మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరకు అవసరమైన ఏర్పాట్లను యుద్ధప్రాతిపదికన చేపడతున్నామని ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి, రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనల మేరకు సోమవారం నాడు సచివాలయంలోని తన కార్యాలయంలో పంచాయితీరాజ్ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్కతో కలిసి మంత్రి పొంగులేటి సమీక్షించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గిరిజన సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా గిరిజనుల మనోభావాలకు అనుగుణంగా ఆలయ ఆధునీకరణను చేపడుతున్నామని, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచన మేరకు ఈ పనులను ఈనెల 15వ తేదీ నుంచి ప్రారంభించి జనవరి మొదటి వారంలోగా పూర్తయ్యేలా కార్యాచరణ రూపొందించాలని అధికారులకు సూచించారు. ఇప్పటికే మేడారం ఆలయాలకు సంబంధించిన మాస్టర్ ప్లాన్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలించారని, మూడు నెలల వ్యవధిలో పనులు పూర్తయ్యేలా ఆదేశించారని తెలిపారు. వారం రోజుల్లో ముఖ్యమంత్రి స్వయంగా క్షేత్రస్ధాయి పరిశీలనకు వస్తున్నందున తగు ప్రణాళికలు, సమాచారంతో సిద్దంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాసరాజు, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
