అటవీ శాఖ అమరుల త్యాగం చిరస్మరణీయం: అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ

  • అమరుల స్తూపం వద్ద శ్రద్ధాంజలి
  • అమరుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తుంది

విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన అటవీ శాఖ అధికారుల త్యాగం చిరస్మరణీయమని రాష్ట్ర అటవీ పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. గురువారం నెహ్రూ జులాజికల్ పార్కులో అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డిజిపి డాక్టర్ జితేందర్, పిసిసిఎఫ్ సువర్ణ, జిల్లా కలెక్టర్ హరిచందన దాసరిలతో కలసి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 11 వ తేదీన “అటవీ అమర వీరుల సంస్మరణ దినోత్సవముగా” జరుపుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినదని అన్నారు. అందులో బాగముగా మన తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 11 వ తేదీన “అటవీ అమర వీరుల సంస్మరణ దినోత్సవం జరుపుకోవటం జరుగుతుందని అన్నారు. ఇదే రోజు 1730 వ సంవత్సరములో రాజస్థాన్ రాష్ట్రంలో బిష్నోయి తెగకు చెందిన 360 మంది కేజ్రి చెట్లు రక్షించుటకు తమ ప్రాణ త్యాగం చేసారని మంత్రి తెలిపారు. అటవీ అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా విధినిర్వహణలో వన సంపద సంరక్షణ కొరకు జీవితములను త్యాగము చేసిన అటవీ సిబ్బంది సేవలను స్మరించుకుంటున్నామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో 1984వ సంవత్సరము నుండి ఇప్పటివరకు (22) అటవీ సిబ్బంది ధైర్య సాహసాలతో అంకిత భావంతో పనిచేసి అటవీ నేరములకు పాల్పడిన నేరస్తులను పట్టుకొనుటలో, అటవీ సంపద పరిరక్షణలో తమ అమూల్యమైన ప్రాణాలు అర్పించినారని ఈ సందర్భంగా వారి అమూల్యమైన సేవలను గుర్తు చేశారు.అదేవిదంగా అడవులు మరియు వన్య ప్రాణులను రక్షించటంలో నిబద్దతతో పనిచేస్తున్నారని తెలంగాణ రాష్ట్ర అటవీ శాఖ అధికారులు తమ శాయశక్తుల కృషి చేసి అటవీ రక్షణలో భాగంగా 2014 నుండి 2025 జూలై మాసం వరకు టేకు అలాగే మారు జాతి కలపకు సంబంధించిన నేరాలను అలాగే 10375 అటవీ భూ ఆక్రమణ కేసులను కూడా పెద్దసంఖ్యలో నమోదు చేయడం జరిగిందని అన్నారు. అలాగే 2025 సంవత్సరంలో రూ. 149.66 కోట్ల కలపకు గాను 96813 కేసులు నమోదు చేసి రూ.లు 51.50 కోట్ల జరిమానా వసూలు చేయడం జరిగిందని తెలిపారు. అలాగే 18002 వాహనములను కూడా స్వాధీనపరచుకోవడం జరిగిందని అన్నారు. నేరస్తులు తెలియని కేసులు 29858 (UDOR) నమోదు చేసి రూ. లు 67.13 కోట్ల విలువ కలిగిన టేకు మరియు మారు జాతి కలపను స్వాధీనపర్చుకొని జప్తు చేయడం జరిగిందని పేర్కొన్నారు.

అదేవిదంగా అమూల్యమైన అటవీ సంపదను పరిరక్షించడానికి ప్రజల భాగస్వామ్యముతో ఎన్నో పథకాలను మరియు చర్యలను చేపట్టటము జరుగుతుందని అన్నారు. 174 బేస్ క్యాంపులు, 62 చెక్ పోస్టులను ఏర్పాటు చేయడము జరిగినదని పేర్కొన్నారు. అడవి సరిహద్దుల నిర్వహణకు పశువులు అడవిలో చొరబడకుండా నియంత్రించే కాలువలు నిర్మించడం, సాయుధ పోలీసు దళాలు కలప అక్రమ రవాణా అరికట్టడానికి తోడ్పాటును అందిస్తున్నాయని తెలిపారు. పి.డి. యాక్ట్ మేరకు టేకు అక్రమ రవాణాదారులను కూడా అరెస్టు చేయడము జరుగుచున్నదని, అటవీ శాఖ సిబ్బంది పోలీసు అధికారుల సాయముతో ఇపటివరకు (5) కేసులు నమోదు చేశామని అన్నారు. అటవీ శాఖ సిబ్బందిని మరింత బలోపేతం చేయడానికి చర్యలు తీసుకుంటుందని తెలిపారు. పి.డి. యాక్టు (PD Act) కి తగిన సవరణలు చేపట్టి నేరస్తులకు కఠినమైన శిక్షలు పడేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని గుర్తు చేశారు. అదేవిదంగా అటవీ సంరక్షణ బలోపేతానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత కొత్తగా 2118 వాహనాలు, (2008 మోటారు సైకిళ్ళు, ఎఫ్.బి.ఓ నుండి డి.ఆర్.ఓ వరకు, (110) మహీంద్ర తార్ జీపులు అటవీ క్షేత్రాధికారులకు అందించామని స్పష్టం చేశారు.

ప్రభుత్వం 2022 సంవత్సరంలో (1516) రిక్రూట్‌మెంట్ కొరకు అనుమతి ఇచ్చిందని, అందులో భాగంగా (1393) ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు (15) మంది ఫారెస్ట్ రేంజ్‌ ఆఫీసర్లు, (18) మంది ఏ‌సి‌ఎఫ్ (ACF) ఇతర పోస్టులు రిక్రూట్‌మెంట్ ప్రక్రియలోఉన్నాయని పేర్కొన్నారు. అడవుల రక్షణ మరియు స్మగ్లింగ్ కార్యకలాపాలను అరికట్టడం కోసం అనేక సమగ్ర చర్యలు ప్రారంభించబడ్డాయని అలాగే వన్యప్రాణుల ఆవాసాలను మెరుగుపరచడానికి పలు కార్యక్రమాలు చేపట్ట ఉన్నట్లు మంత్రి పేర్కొన్నారు. అటవీ అమరవీరుల దినోత్సవం’ సందర్భంగా అటవీ సంరక్షణ, వన్యప్రాణుల సంరక్షణ, అటవీ ప్రాంతాల అభివృద్ధి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని తెలుపుతూ మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియపరచి అమరుల స్తూపం వద్ద ఈ సందర్భంగా అమూల్యమైన నివాళులు అర్పించారు. అంతకుముందు అమరుల స్తూపం వద్ద పోలీసుల గౌరవ వందనాన్ని ఉన్నతాధికారులతో కలిసి మంత్రి స్వీకరించారు. అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డిజిపి డాక్టర్ జితేందర్, ప్రిన్సిపల్ సెక్రెటరీ నదీమ్ అహ్మద్, పిసిసిఎఫ్ హెడ్ సువర్ణ, పిసిసిఎఫ్ వైల్డ్ లైఫ్ ఏలు సింగ్ మేరు, సి సి ఎఫ్ ప్రియాంక వర్గీస్, జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి, వివిధ విభాగాల అధికారులు, అమరుల త్యాగాలను స్మరించుకుంటూ ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వివిధ విభాగాల ఫారెస్ట్ అధికారులు, రిటైర్డ్ ఉద్యోగస్తులు, అమరుల కుటుంబాలు తదితరులు పాల్గొన్నారు.