🔸 30 లక్షల పెట్టుబడితో మహిళా మార్ట్
🔸 మహిళా సంఘాల ఉత్పత్తులకు వేదికగా మారిన మార్ట్
🔸 ప్రత్యక్ష–పరోక్షంగా వేల మందికి ఉపాధి అవకాశాలు
🔸 మూడు నెలల్లో 25 లక్షల విలువైన ఉత్పత్తుల కొనుగోళ్లు
🔸 ఇతర జిల్లాల్లో మహిళా మార్ట్‌ల ఏర్పాటుకు ప్రణాళికలు
🔸 మహిళా ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వ వినూత్న అడుగులు
ఖమ్మం జిల్లాలో ఏర్పాటు చేసిన మహిళా మార్ట్ మూడు నెలల్లోనే విశేష ఫలితాలు సాధించింది. మహిళా సంఘాల కృషితో తయారైన ఉత్పత్తులకు మార్కెట్ లభించడంతోపాటు ఉపాధి అవకాశాలు పెరిగి, మహిళల జీవన ప్రమాణాలు మెరుగుపడుతున్నాయి. మహిళా సంఘాలకు స్థిరమైన ఆదాయం లభించడమే కాకుండా, మధ్యవర్తుల అవసరం లేకుండా ఉత్పత్తిదారుల నుంచి వినియోగదారులకు సరుకులు నేరుగా చేరుతున్నాయి. సహజసిద్ధమైన, నాణ్యమైన ఉత్పత్తులపై ప్రజల్లో విశ్వాసం పెరిగింది. ఈ మార్ట్ ద్వారా గ్రామీణ, పట్టణ మహిళలకు ఉపాధి అవకాశాలు కలుగుతున్నాయి. ప్రజలు, వినియోగదారులు చూపుతున్న విశ్వాసం మహిళా మార్ట్ విజయానికి బలమైన పునాది అయింది. త్వరలో మరిన్ని కొత్త ఉత్పత్తులు, విభాగాలను ప్రవేశపెట్టే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
25 లక్షల విలువైన ఉత్పత్తుల కొనుగోళ్లు
ఇప్పటివరకు మహిళా సంఘాల నుండి 25 లక్షల విలువైన ఉత్పత్తులు కొనుగోలు చేశారు. సాధారణ రోజుల్లో సుమారు 35 వేల రూపాయల సేల్స్ ఉండగా, వారాంతంలో 50 వేల రూపాయలను దాటుతున్నాయి. ఇప్పటివరకు రూ.18.75 లక్షల అమ్మకాలు జరగగా, మూడు నెలల్లోనే మార్ట్ లాభాల బాటలో పయనిస్తోంది. నేరుగా విక్రయాలు జరపడం వల్ల ఉత్పత్తిదారులకు లాభం అదే విధంగా వినియోగదారులకు సరసమైన ధర లభిస్తోంది.
వెయ్యికి పైగా మహిళా సంఘాల ఉత్పత్తులు
ఈ మార్ట్‌లో 20 మండల సమాఖ్యల 95 మహిళా సంఘాల చే ఉత్పత్తి అయిన బియ్యం, బెల్లం, తేనే, మసాలా పొడులు, గానుగ నూనెలు, పూజా సామాగ్రి, పప్పులు, పిండులు, మిల్లెట్స్, చేనేత వస్త్రాలు, మట్టి పాత్రలు, వెదురు ఉత్పత్తులు, క్లీనింగ్ ప్రొడక్టులు, హస్తకళా వస్తువులు వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి. మహిళా సంఘాలు స్వయంగా తయారు చేయడం వల్ల నమ్మకమైన, నాణ్యమైన వస్తువులు తక్కువ ధరలలో వినియోగదారులకు చేరుతున్నాయి.
ప్రత్యేక ఆకర్షణగా టీ క్యాంటీన్
వినియోగదారుల రాక పెరగడంతో టీ క్యాంటీన్‌ను కూడా ఏర్పాటు చేశారు. రోజుకు సుమారు 4 నుండి 5 వేల రూపాయల సేల్స్ నమోదు అవుతోంది.
వేలాది మహిళలకు ప్రత్యక్ష–పరోక్ష ఉపాధి
మహిళా మార్ట్‌లో ప్రస్తుతం ఐదుగురు మహిళలు – భవాని, రజని, త్రివేణి, నాగలక్ష్మి, రజని పనిచేస్తున్నారు. వీరు కార్పొరేట్ స్థాయిలో మార్ట్‌ను విజయవంతంగా నడుపుతూ కుటుంబ ఆదాయానికి తోడ్పడటమే కాకుండా జిల్లా ఆర్థికాభివృద్ధిలో భాగస్వాములుగా నిలుస్తున్నారు. పరోక్షంగా వందలాది కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయి. ఉత్పత్తి, ప్యాకేజింగ్, రవాణా వంటి విభాగాల్లో ఉపాధి అవకాశాలు పెరిగి వేలాది మందికి జీవనోపాధి కలుగుతోంది.
మహిళా సాధికారతకు ప్రభుత్వ వినూత్న అడుగులు
మహిళల ఆర్థికాభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి కార్యక్రమాన్ని అమలు చేస్తూ మహిళా సంఘాలను వ్యాపారావేత్తలుగా తీర్చిదిద్దుతోంది. వడ్డీ కేని రుణాలతో పాటు పెట్రోల్ బంకులు, ఆదర్శ పాఠశాలలు, మహిళా క్యాంటీన్లు, స్కూల్ యూనిఫారమ్ స్టిచింగ్ వంటి రంగాల్లో అవకాశాలు కల్పించిన ప్రభుత్వం, ఇప్పుడు మహిళా మార్ట్‌లతో మరో అడుగు ముందుకు వేసింది. ఖమ్మం మహిళా మార్ట్ విజయవంతం కావడంతో, ఇతర జిల్లాల్లో కూడా విస్తరణకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. మహిళా సంఘాలు తమ కుటుంబ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచుకొని, సమాజంలో ఇతర మహిళలకు ప్రేరణగా నిలుస్తున్నాయి. ఖమ్మం మహిళా మార్ట్ మహిళల శక్తిని, సృజనాత్మకతను, కృషిని ప్రతిబింబిస్తూ జిల్లాలో మహిళల ఆర్థిక–సామాజిక అభివృద్ధికి, స్థానిక ఉత్పత్తుల ప్రోత్సాహానికి, సమాజ ప్రగతికి ఉదాహరణగా నిలుస్తోంది.
ఖాళీగా ఉన్న నేను.. ఇప్పుడు 15 వేల సంపాదిస్తున్నాను” – భవాని
“ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశం మాతో పాటు ఎందరో మహిళల జీవితాల్లో మార్పు తీసుకొచ్చింది. పోటీ పెరగడంతో కొత్త ఉత్పత్తులు తయారీకి మహిళలు ముందుకు వస్తున్నారు. మార్ట్ ప్రారంభించినప్పుడు ప్రొడక్ట్స్ తక్కువగా ఉండేవి. సేల్స్ ఎక్కువ అవడం తో మహిళా సంఘాలలో ఆత్మవిశ్వాసం పెరిగి ఉత్పత్తులను పెంచారు తద్వారా ఎస్ హెచ్ జి, మార్ట్ రెండిటి రాబడి పెరుగుతోంది. ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి. వినియోగదారులకు మరిన్ని ఉత్పత్తులను అందుబాటులోకి తెచ్చే విధంగా ఎస్ హెచ్ జి ల తో సమన్వయం చేస్తున్నాము. గతంలో నేను ఖాళీగా ఉండేదాన్ని, ఇప్పుడు నెలకు 15 వేల రూపాయలు సంపాదిస్తూ మార్ట్ నడపడం గర్వంగా ఉంది” మాకు ఈ అవకాశం కలిపించిన ముఖ్యమంత్రికి జిల్లా యంత్రాంగానికి రుణపడి ఉంటామని అని భవాని ఆనందం వ్యక్తం చేసింది.
