రాష్ట్రవ్యాప్తంగా 232 కోట్ల రూపాయలతో పోలీసు అధికారులు, సిబ్బంది క్వార్టర్స్ నిర్మాణం చేపట్టడం జరిగిందని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. శనివారం నల్గొండ జిల్లా కేంద్రంలోని పోలీసు హెడ్ క్వార్టర్స్ లో నిర్మించిన ఏ ఆర్ డి ఎస్ పి రెసిడెన్సి క్వార్టర్స్ , సీఐ,ఎస్ఐ క్వార్టర్లను, శిశువిహార్ ను మంత్రి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మీడియాతో మంత్రి మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శిథిలావస్థలో ఉన్న పోలీస్ అధికారులు, సిబ్బంది క్వార్టర్స్ ను తొలగించి వాటి స్థానంలో కొత్త క్వార్టర్లను నిర్మిస్తున్నామని, ఇందులో భాగంగానే అవసరమైనచోట 232 కోట్ల రూపాయలతో పోలీస్ క్వార్టర్స్ నిర్మాణం చేపట్టినట్లు వెల్లడించారు. ఇంకా ఎక్కడైనా ఇలాంటి స్థితిలో క్వార్టర్స్ ఉన్నట్లయితే గుర్తించి వాటిని స్థానంలో కొత్త వాటిని నిర్మించే విధంగా చర్యలు తీసుకోవాలని పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండి రమేష్ రెడ్డిని ఆదేశించారు. నల్గొండ జిల్లా డీఎస్పీ కార్యాలయం 50 సంవత్సరాల క్రితం నిర్మించినది అయినందున త్వరలోనే ఈ కార్యాలయాన్ని కూలగొట్టి దాని స్థానంలో కొత్తది మంజూరు చేయిస్తామని, రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడి డిఎస్పి కార్యాలయంతో పాటు, ఏ ఆర్ కానిస్టేబుల్ క్వార్టర్స్ శిథిలావస్థలో ఉన్నందున వాటికి కూడా మంజూరు చేయించడం జరుగుతుందని తెలిపారు. పోలీసు అధికారులు, సిబ్బంది 24 గంటలు పనిచేస్తారని, అలాంటివారికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. హింసను నిర్మూలించి, శాంతియుత వాతావరణం నెలకొల్పడంతో పాటు, సమాజంలో మత్తుమందుల నిర్మూలన కు పోలీసులు కృషి చేస్తున్నారని, ప్రత్యేకించి నల్గొండ జిల్లాలో జిల్లా ఎస్పీ, జిల్లా కలెక్టర్లు మత్తుపదార్థాల నివారణకు చేస్తున్న కృషిని ఆయన అభినందించారు.రాష్ట్రవ్యాప్తంగా డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని తెలిపారు. జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవర్, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి,ఐ జి ఇక్బాల్ , ఎం ఎల్ సి నెల్లికంటి సత్యం,స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్ నారాయణ్ అమిత్, రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్,దేవరకొండ ఏ సి పి మౌనిక, ఇతర పోలీసు అధికారులు, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.