తెలంగాణను ప్ర‌ముఖ‌ వెడ్డింగ్ గమ్యస్థానంగా తీర్చిదిద్దడమే ధ్యేయం: మంత్రి జూప‌ల్లి కృష్ణారావు

  • సౌత్‌ ఇండియా వెడ్డింగ్‌ ప్లానర్స్‌ కాంగ్రెస్ లో మంత్రి జూప‌ల్లి కృష్ణారావు

పెళ్లి వేడుకలు జరిపించేందుకు ప్రపంచంలో ప్రముఖ గమ్యస్థానంగా తెలంగాణను చూపించడం ధ్యేయంగాప్ర‌భుత్వం ప‌ని చేస్తుంద‌ని ప‌ర్యాట‌క శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు అన్నారు. ఫైనాన్షియ‌ల్ డిస్ట్రిక్ట్ లోని అక్ష‌య క‌న్వెన్ష‌న్ లో పర్యాటక శాఖ సహకారంతో తెలంగాణ చాంబర్‌ ఆఫ్‌ ఈవెంట్స్‌ ఇండస్ట్రీ (టీసీఈఐ) ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన నాల్గ‌వ‌ సౌత్‌ ఇండియా వెడ్డింగ్‌ ప్లానర్స్‌ కాంగ్రెస్ లో మంత్రి జూపల్లి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. భారతదేశంలో పెళ్లిళ్ల పరిశ్రమ వేగంగా అభివృద్ధి చెందుతోందని, అందులో తెలంగాణ రాష్ట్రం కీలకపాత్ర పోషించేందుకు సిద్ధంగా ఉందని అన్నారు. ప్రపంచం మొత్తం భారతదేశాన్ని వెడ్డింగ్ డెస్టినేషన్‌గా చూస్తోందని, అలాంటి సమయంలో తెలంగాణ‌ను ప్రపంచ ప‌టంలో వివాహ వేడుకల‌ హ‌బ్ నిలపాలన్నదే మా సంకల్పమ‌ని పేర్కొన్నారు.

వివిధ థీమ్స్, బడ్జెట్లకు అనుగుణంగా పెళ్లిళ్లను జరిపేందుకు అద్భుతమైన వేదికగా తెలంగాణ రాష్ట్రం ఉంద‌ని అన్నారు. పురాతన కోటలు, రాజమహాళ్లు, ద‌ట్ట‌మైన అడ‌వులు, న‌దులు సరస్సులు, కొండలు, ఆధునిక విలాసవంతమైన హోటళ్లు — తెలంగాణలోని ఈ సంపద ప్రపంచ స్థాయి వెడ్డింగ్ డెస్టినేషన్‌గా మార్చగల ఎన్నో అద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయని, వెడ్డింగ్ ప్లానర్లు తెలంగాణను కేవలం ఒక రాష్ట్రంగా కాకుండా, ఒక జీవించే సంస్కృతిగా కొత్త దృష్టితో చూసి, దీనిని భారతదేశంలోనే కాక, అంతర్జాతీయంగా పరిచయం చేయాలి అని ఆయన పిలుపునిచ్చారు. పెళ్లి అనేది కేవలం రెండు మనసుల కలయిక మాత్రమే కాకుండా, రెండు కుటుంబాలు, రెండు సంస్కృతుల మిళితమ‌ని, అపూర్వమైన తెలంగాణ‌లో ఉన్న పర్యాటక ప్రదేశాల్లో పెళ్లి వేడుకలు పూర్తి చేసుకోవాలని, మధుర స్మృతులను పదిలపరచుకోవాలని కాబోయే వధూవరులకు ఆయన పిలుపునిచ్చారు.

తెలంగాణ వ్యాప్తంగా ఉన్న గమ్యస్థానాల గురించి వివరాలను ప్రచారంలోకి తీసుకువచ్చి వివాహ వేడుకలను ఎందుకు తెలంగాణ‌లో చేసుకోవాలో తెలిపేలా ప్ర‌ణాళిక‌లు రూపొదింస్తామ‌ని చెప్పారు. రాష్ట్రంలోని అద్భుతమైన వెడ్డింగ్ డెస్టినేషన్‌లను పరిశ్రమకు ప్రత్యక్షంగా పరిచయం చేసేందుకు ప్రత్యేక పర్యటనలు FAM (Familiarization) ఏర్పాటు చేస్తామ‌ని, లైసెన్సులు, అనుమతులు, లాజిస్టిక్స్ , వివాహాల నిర్వహణకు అవసరమైన అనుమతులు వేగంగా మంజూరు చేస్తామ‌ని, ప్రైవేట్-పబ్లిక్ భాగస్వామ్యంతో ఈ రంగంలో పెట్టుబడులను ప్రోత్సహించేందుకు కొత్త విధానాలు సిద్ధం చేస్తున్నామ‌ని,
మీరు ఆలోచించండి, మేము అమలు చేస్తాం” అనే నినాదంతో పర్యాటక శాఖ ముందుకు సాగుతోందని మంత్రి స్పష్టం చేశారు. మీరు దక్షిణ భారతదేశంలో అత్యుత్తమ వెడ్డింగ్ ఈవెంట్‌గా నిరూపించుకున్నార‌ని, ఇప్పుడు దేశవ్యాప్తంగా నెంబర్ వన్ వెడ్డింగ్ ఈవెంట్‌గా ఎదిగే సమయం వచ్చిందని, తదుపరి ఎడిషన్‌కు “South Indian Wedding Planners Congress” పేరును “Indian Wedding Planners Congress”గా మార్చి, రాజస్థాన్, పంజాబ్, కాశ్మీర్, గోవా వంటి భారతదేశంలోని వివిధ సంస్కృతులను ఒకే వేదికపై ప‌రిచ‌యం చేయాలని నిర్వ‌హ‌కుల‌కు సూచించారు. ఈ కార్య‌క్ర‌మంలో ప‌ర్యాట‌క శాఖ స్పెష‌ల్ సీఎస్ జ‌యేష్ రంజ‌న్, టీసీఈఐ అధ్యక్షుడు ఆళ్ల బలరాం బాబు, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ర‌వి బురా, తదితరులు పాల్గొన్నారు.