- ఏసీబీ సోదాల్లో దొరికిన నగదు
- స్థిరాస్తుల పత్రాలూ స్వాధీనం
- ఇప్పటికే ఏసీబీ అరెస్టు చేసిన ఏడీఈ అంబేడ్కర్‌కు ఇతను బినామీ
- అంబేడ్కర్‌కు 14 రోజుల రిమాండ్
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో విద్యుత్ శాఖ ఏడీఈ ఏరుగు అంబేడ్కర్‌ను అరెస్టు చేసిన ఏసీబీ అధికారులు.. బుధవారం సాయంత్రం అతని బినామీ అయిన మరో ఏడీఈ రాజేష్ బాబు ఇంట్లో సోదాలు నిర్వహించారు. సికింద్రాబాద్ మారెడ్‌పల్లిలో ఉన్న రాజేష్ బాబు ఇంటికి చేరుకున్న ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టగా.. కవర్‌లో పెట్టి బాత్‌రూంలో దాచిన రూ.17 లక్షల నగదు లభ్యమైంది. కొన్ని స్థిరాస్తులకు సంబంధించిన పత్రాలను సైతం ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. సోదాల సమయంలో రాజేష్ బాబు ఇంట్లో లేడు. ఆయన రెండు రోజుల నుంచి ఆఫీసుకు కూడా రావడం లేదని తెలిసింది. రాజే్‌షబాబు 9 నెలల క్రితం పదోన్నతిపై రంగారెడ్డి జిల్లా చేవెళ్లకు ఏడీఈగా వచ్చాడు. అంతకుముందు మొయినాబాద్ మండలం చిల్కూర్ ఫీడర్ ఏఈగా చాలాకాలం పనిచేశాడు. కాగా ఇబ్రహీంబాగ్ ఏడీఈ అంబేడ్కర్ కూడబెట్టిన ఆస్తుల విలువ వంద కోట్ల రూపాయలు ఉంటుందని భావిస్తుండగా.. ఏసీబీ విచారణలో అతనికి స్నేహితుడైన రాజేష్ బాబు బినామీ అని కూడా తెలిసింది. హైదరాబాద్‌కు చేరువగా ఉన్న చేవెళ్ల ప్రాంతం దినదినాభివృద్ధి చెందుతున్న తరుణంలో కొత్త ఇళ్లు, లేఅవుట్‌లు, ఫామ్ హౌస్ లకు విద్యుత్ కనెక్షన్లకు అనుమతులు ఇచ్చేందుకు విద్యుత్ అధికారులు, కాంట్రాక్టర్లు కుమ్మక్కై పెద్దమొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. మొయినాబాద్‌లో ఏఈగా పనిచేసిన సమయంలో కొత్త ఫామ్‌హౌ్‌సలకు విద్యుత్ కనెక్షన్లు ఇచ్చేందుకు రాజేష్ బాబు భారీగా వసూళ్లకు పాల్పడినట్లు తెలిసింది. ఇదిలా ఉండగా.. ఏడీఈ అంబేడ్కర్‌ను ఏసీబీ అధికారులు బుఽధవారం కోర్టులో హాజరుపరచగా 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. అతడిని చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఈ కేసులో విచారణ కొనసాగుతోందని, అంబేడ్కర్‌కు చెందిన కొన్ని లాకర్లను తెరవాల్సి ఉందని అధికారులు పేర్కొన్నారు. అతని అక్రమాస్తుల విలువ వంద కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. మంగళవారం మణికొండలోని అంబేడ్కర్ ఇల్లు, బంధువులు ఇళ్లలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. అంబేడ్కర్ బినామీ అయిన సతీష్ ఇంట్లో రూ.2.18కోట్లు స్వాధీనం చేసుకోవడం సైతం ఏసీబీ చరిత్రలో అరుదైన ఘటనగా పేర్కొంటున్నారు.