- సీఎం కప్ 2025 నిర్వహణలో అందరినీ భాగస్వామ్యం చేస్తాం
- పండుగ వాతావరణంలా క్రీడాజ్యోతి ర్యాలీలు
- జిల్లా యువజన క్రీడ అభివృద్ధి అధికారులతో సమీక్షా సమావేశం
గ్రామీణ క్రీడాకారుల ఉత్సాహానికి ప్రోత్సాహం ఇచ్చే విధంగా సీఎం కప్ 2025 నిర్వహిస్తామని రాష్ట్ర క్రీడలు యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. ఈరోజు గచ్చిబౌలి స్టేడియంలో ఆయన జిల్లా యువజన క్రీడ అభివృద్ధి అధికారులు, మరియు క్రీడా శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సీఎం కప్ 2024మాదిరిగానే సీఎం కప్ 2025 కూడా గ్రామీణ స్థాయి నుంచి నిర్వహిస్తామని,
గ్రామీణ యువ క్రీడాకారుల ప్రతిభను గుర్తించి ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాన్ని మొత్తం అందులో భాగస్వామ్యం చేస్తామని ఆయన తెలిపారు. సీఎం కప్ 2025 నిర్వహణ మొక్కుబడిగా నామమాత్రంగా నిర్వహించకుండా, అందరు ప్రజాప్రతినిధులను మరియు అధికారులను ఇందులో భాగస్వామ్యం చేస్తామని తెలిపారు. ఇందులో ఎటువంటి పార్టీ భేదాలు లేకుండా ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు కూడా స్వయంగా మాట్లాడడం లేఖలు రాసి వారి సహాయాన్ని కోరుతామని, జిల్లా కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తామని ఆయన తెలిపారు. జిల్లాలో పరిపాలనపరంగా క్రీడా శాఖలో కొన్ని ఇబ్బందులు ఉన్నా సీఎం కప్ నిర్వహణకు చిత్తశుద్ధితో ఉత్సాహంతో కృషి చేస్తున్న అధికారులను ఆయన అభినందించారు.
సీఎంకు పోటీలను కేవలం హైదరాబాద్ నగరానికి పరిమితం చేయకుండా ప్రతి ఉమ్మడి జిల్లాల్లో ఆయా జిల్లాల్లో ప్రాచుర్యం ఉన్న క్రీడాంశాలలో పోటీలు అన్ని జిల్లాల లో ఒక పండుగ వాతావరణం తెచ్చేలా నిర్వహిస్తామని తెలిపారు. కేవలం పోటీలు నిర్వహించడమే కాకుండా ప్రతి క్రీడాకారుడి సమాచారాన్ని నిక్షిప్తం చేసి ప్రతిభా కలిగిన వారిని గుర్తించి ప్రోత్సహించడానికి పటిష్టమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. సీఎం కప్ విజయవంతానికి పిఈటిలు ఫిజికల్ డైరెక్టర్ల సహకారం తీసుకోవాలని అన్ని క్రీడా సంఘాలను భాగస్వామ్యం చేయాలని మంత్రి ఆదేశించారు. సంకల్పబలం గట్టిదైతే ఏ పనైనా సాధించవచ్చని, సీఎం రేవంత్ రెడ్డి గారు క్రీడలకు ఇస్తున్న ప్రోత్సాహానికి క్రీడా శాఖ అధికారులు చిత్తశుద్ధితో క్షేత్రస్థాయిలో కృషి చేస్తే అంచలంచలుగా క్రీడాభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. సీఎం కప్ పోటీల్లో పాల్గొని క్రీడాకారులకు భవిష్యత్తు క్రీడా అవకాశాల్లో మంచి స్థానం ఇస్తామని, సీఎం కప్ సర్టిఫికెట్లకు ప్రభుత్వం కల్పించే విద్య ఉద్యోగ అవకాశాల్లో ప్రాధాన్యత దక్కేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి మాట్లాడుతూ, సీఎం కప్ నిర్వహణ వాటి ఆశయాన్ని లక్ష్యాలను గ్రామీణ స్థాయిలో విస్తృత ప్రచారం చేసేందుకు ఘనంగా నిర్వహించాలని రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో క్రీడాజ్యోతి కార్యక్రమాలు నిర్వహించి అందులో క్రీడాకారులు క్రీడాభిమానులను పెద్ద ఎత్తున భాగస్వామ్యం చేయాలని డి వై ఎస్ ఓ లను కోరారు. సీఎం కప్పోటీల తేదీలు మరియు క్రీడాజ్యోతి ర్యాలీ తేదీలు త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు. గ్రామీణ స్థాయి నుండి రాష్ట్రస్థాయి వరకు జరిగే ఈ పోటీలలో అన్ని స్థాయిల్లో విజయవంతం చేసిన ఐదు జిల్లాలను ఎంపిక చేసి వారికి ప్రోత్సాహకాలు అందజేస్తామని తెలిపారు. అదేవిధంగా విధుల్లో నిర్లక్ష్యం వహించిన వారి పట్ల కఠిన చర్యలు తప్పవని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ క్రీడల సలహాదారులు ఏపీ జితేందర్ రెడ్డి మాట్లాడుతూ, సీఎం కప్ నిర్వాహణలో క్రీడా సంఘాలను భాగస్వామ్యం చేయాలని, సూచించారు. ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ అథారిటీ ఎండి డాక్టర్ సోనీ బాలాదేవి, డిప్యూటీ డైరెక్టర్లు స్టేడియం అడ్మినిస్ట్రేటర్లు కోచులు పాల్గొన్నారు.