- మహిళలు ఆర్థికంగా ఎదిగినప్పుడే పేదరికం అంతం అవుతుంది
- హైటెక్ సిటీలో ఇందిరా మహిళా శక్తి బజార్ సలహాలోనే హైదరాబాదులో మరిన్ని స్థలాలను మహిళా సంఘాలకు కేటాయిస్తాం
- సారస్ మేళా ప్రారంభోత్సవంలో మంత్రి సీతక్క
హైదరాబాద్ : ఇందిరా మహిళా శక్తి ద్వారా పేదరికాన్ని నిర్మూలిస్తాం, మహిళలు ఆర్థికంగా ఎదిగినప్పుడే పేదరికం అంతం అవుతుంది అని మంత్రి సీతక్క స్పష్టం చేశారు.
హైటెక్ సిటీలోని ఇందిరా మహిళా శక్తి బజార్‌లో సరస్ మేళాను పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డా. దనసరి అనసూయ సీతక్క ప్రారంభించారు. రిబ్బన్ కట్ చేసి ప్రాంగణాన్ని ఆరంభించిన మంత్రి సీతక్క వెంట స్థానిక ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, బాలల పరిరక్షణ కమిషన్ చైర్‌పర్సన్ సీతా దయాకర్ రెడ్డి, మహిళా అభివృద్ధి కార్పొరేషన్ చైర్‌పర్సన్ బండ్రు శోభ, వ్యవసాయ కమిషన్ సభ్యురాలు భవాని రెడ్డి, సెర్ప్ సీఈవో దివ్య దేవరాజన్, అదనపు సీఈవో కాత్యాయిని, స్త్రీనిధి ఎండి విద్యాసాగర్ రెడ్డి, WE-Hub సీఈవో సీతా పల్లచోళ తదితరులు పాల్గొన్నారు.
సాంప్రదాయ కళాకారులు ఘన స్వాగతం పలకగా, డప్పుల చప్పుళ్లతో మారుమోగిన ఇందిరా మహిళా శక్తి ప్రాంగణంలో తెలంగాణ చరిత్ర, పోరాటాలకు చెందిన కళారూపాలు, నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. మహిళా సంఘాలు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను మంత్రి సీతక్క స్వయంగా స్టాల్స్‌ను సందర్శించి మహిళలతో మాట్లాడి ఉత్పత్తులను కొనుగోలు చేశారు. సరస్ మేళా ప్రారంభోత్సవంలో మాట్లాడుతూ మంత్రి సీతక్క హైటెక్ సిటీ వంటి విలువైన ప్రదేశాన్ని గ్రామీణ మహిళల చేతివృత్తులు, ఉత్పత్తుల ప్రదర్శన కోసం కేటాయించిన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధిలో మహిళలకు భాగస్వామ్యం కల్పించడం తమ సంకల్పమని చెప్పారు. ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా మహిళల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించి, ఆర్థికంగా నిలదొక్కుకునేలా ప్రభుత్వం చేస్తున్న కృషిని వివరించారు. ప్రతి మహిళను కోటీశ్వరురాలిని చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని, ఇప్పటివరకు బ్యాంకుల ద్వారా మహిళా సంఘాలకు రూ. 27 వేల కోట్ల రుణాలను సమకూర్చినట్లు వెల్లడించారు.
మహిళలు బ్యాంకుల నుంచి తాము తీసుకున్న రుణాలను 98 శాతం రీపేమెంట్ చేస్తున్నారని, అందువల్ల బ్యాంకులు మరింత ఉత్సాహంగా సహకరిస్తున్నాయని మంత్రి తెలిపారు. చిరు వ్యాపారాలతో ప్రారంభమైన మహిళా శక్తి ఇప్పుడు పెద్ద వ్యాపారాల్లో అడుగుపెడుతోందని, నారాయణపేటలో మహిళా సమాఖ్య విజయవంతంగా పెట్రోల్ బంకును నడుపుతోందని, ఆరు నెలల్లో రూ. 15.50 లక్షల ఆదాయం సంపాదించిందని పేర్కొన్నారు. సోలార్ పవర్ ప్రాజెక్టులు, పలు వ్యాపారాలను మహిళా సంఘాలకు అప్పగిస్తున్నామని, మహిళలు సంతోషంగా ఉంటే కుటుంబం, సమాజం సంతోషంగా ఉంటుందని అన్నారు. మహిళలకు అవకాశాలు కల్పిస్తే వారు ఆకాశాన్ని చీల్చి అంతరిక్షంలోకి వెళ్ళగలరని నిరూపించారని గుర్తుచేసిన మంత్రి, మహిళలు ఆర్థికంగా బలపడేలా ప్రభుత్వం అన్ని విధాల సహకరిస్తుందని హామీ ఇచ్చారు. బ్యాంక్స్ రుణాల ద్వారా వడ్డీ వ్యాపారుల దోపిడీని అడ్డుకున్నామని, మహిళా సంఘాలు క్రమశిక్షణ, నమ్మకానికి ప్రతీకలుగా నిలుస్తున్నాయని చెప్పారు. ఇందిరమ్మ మహిళా శక్తి పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో పేదరిక నిర్మూలన లక్ష్యమని, హైటెక్ సిటీ ప్రాంగణంలో విజయవంతమైన ఈ ప్రయత్నం తరహాలోనే హైదరాబాద్‌లో మరికొన్ని ప్రదేశాలను కూడా మహిళా సంఘాల ఉత్పత్తుల ప్రదర్శనకు కేటాయిస్తామని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న సహాయాన్ని సద్వినియోగం చేసుకొని మహిళలు కోటీశ్వరులుగా ఎదగాలని పిలుపునిచ్చిన మంత్రి సీతక్క, ఈ సందర్భంగా మహిళా సంఘాలకు లోన్లు సులభంగా అందజేస్తున్న పలువురు బ్యాంకర్లను సన్మానించారు.