రేప‌టి నుంచి బతుకమ్మ సంబరాలు: మంత్రి జూప‌ల్లి కృష్ణారావు

  • ఆరంభ వేడుక‌ల్లో పాల్గొన‌నున్న మంత్రులు జూప‌ల్లి, కొండా సురేఖ‌, సీత‌క్క
  • బ‌తుక‌మ్మ శుభాకాంక్ష‌లు తెలిపిన మంత్రి జూప‌ల్లి

తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచిన బతుకమ్మ సంబురాలు రేప‌టి (ఆదివారం) నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మొదలుకానున్నాయి. బ‌తుక‌మ్మ ప్రారంభ వేడుక‌ల‌కు చారిత్ర‌క వేయి స్తంభాల గుడి సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ప‌ర్యాట‌క శాఖ, సాంస్కృతిక శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ‌, పంచాయ‌తీ రాజ్ శాఖ మంత్రి సీత‌క్క అన‌సూయ బ‌తుక‌మ్మ అరంభ వేడుక‌లో పాల్గొన‌నున్నారు.

ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సార‌ధ్యంలోని ప్ర‌జా ప్రభుత్వం ఈ ఉత్సవాలను మరింత వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది. సకల జనులు, సబ్బండ వర్ణాలు కలిసి ఏకత్వస్ఫూర్తిని చాటేలా రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు రూపోందించింది. చారిత్ర‌క ప్రదేశాలు, ప్ర‌సిద్ధ పుణ్య‌క్షేత్రాలు, వార‌స‌త్వ క‌ట్ట‌డాలు, ప‌ర్యాట‌క ప్రాంతాల్లో 9 రోజుల పాటు బ‌తుక‌మ్మ ఉత్స‌వాల‌ను ఘ‌నంగా నిర్వ‌హించేందుకు ప్ర‌భుత్వం స‌న్న‌హాలు చేసింద‌ని మంత్రి జూప‌ల్లి పేర్కొన్నారు.

ప్రకృతితో మమేకమైన తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల ఔన్నత్యాన్ని బతుకమ్మ పండుగ విశ్వవ్యాప్తంగా చాటుతోందని అన్నారు. తెలంగాణ ఆడ్డ‌బిడ్డ‌లంద‌రికీ ఈ సంద‌ర్భంగా బతుక‌మ్మ శుభాకాంక్ష‌లు తెలిపారు. తెలంగాణ ప్రజలందరి బతుకుల్లో వెలుగులు నింపుతూ, మరింతగా సుఖ సంతోషాలతో జీవించేలా దీవించాలని ప్రార్థించారు.బ‌తుక‌మ్మ పండ‌గ‌ను సంప్ర‌దాయ బ‌ద్ధంగా జ‌రుపుకోవాల‌ని కోరారు.