ప్రభుత్వ ఆస్పత్రుల్లో భద్రత మరింత పటిష్టం చేయాలని నిర్ణయించిన సర్కారు.. అందుకు రిటైర్డ్ ఆర్మీ జవాన్లను నియమించుకోనున్నది. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ పద్ధతిలో నియామకాలు జరుగుతాయి. ఇటీవల ప్రభుత్వాస్పత్రుల్లో వైద్యులు, వైద్య సిబ్బందిపై పెరుగుతున్న దాడులకు చెక్ పెట్టేందుకు సర్కారు ఈ మేరకు సూత్రప్రాయ నిర్ణయం తీసుకున్నది. రెండు రోజుల క్రితం ప్రభుత్వాస్పత్రుల్లో శానిటేషన్, సెక్యూరిటీ, పేషంట్ కేర్ విభాగాలపై సమీక్షించిన వెద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ.. భద్రతా గార్డులుగా రిటైర్డు ఆర్మీ జవాన్లను నియమించాలని నిర్ణయించారు. ప్రస్తుతం 40శాతం రిటైర్డు ఆర్మీ, 60శాతం నాన్ ఆర్మీ భద్రతా గార్డులను నియమించాలని నిర్ణయించినా.. భవిష్యత్తులో పూర్తిస్థాయిలో రిటైర్డు ఆర్మీ జవాన్లతో ఆస్పత్రి భద్రతను పటిష్టపరిచే యోచనలో సర్కారు ఉంది. ఈ విషయమై ఏర్పాటైన వైద్యాధికారుల అధ్యయన కమిటీ.. ఇతర రా ష్ట్రాల్లో ఆస్పత్రుల భద్రతను పరిశీలించింది. ఇప్పటికే రిటైర్డు ఆర్మీ జవాన్లతో కూడిన ఓయూ భద్రతా వ్యవస్థనూ పరిశీలించిన కమిటీ.. ఆ విధానంపై సంతృప్తికరమైన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది.