డెక్కన్ సిమెంట్ పరిశ్రమలో ఉద్రిక్తత

  • మరణించిన కార్మికుడికి పరిహారం కోసం ధర్నా
  • రాళ్లు రువ్విన యూపీ కార్మికులు..
  • సెక్యూరిటీ గది, పోలీస్‌ వాహనం ధ్వంసం
  • పోలీసులపై యుపి కార్మికుల రాళ్ల దాడి
  • ఎస్‌ఐతోపాటు కానిస్టేబుల్‌కు గాయాలు

సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం భవానిపురంలోని డెక్కన్‌ సిమెంట్‌ పరిశ్రమ వద్ద సోమవారం కార్మికులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. ఆందోళనను అడ్డుకునేందుకు యత్నించిన పోలీసులపై కార్మికులు రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో పలువురు పోలీసులకు గాయాలు కాగా, పోలీస్‌ వాహనం, సెక్యూరిటీ గది అద్దాలు ధ్వంసమయ్యాయి. ఎస్సై కోటేశ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌లోని బలియా జిల్లా కాకర్‌ఘాట్‌కు చెందిన వినోద్‌ (45) అవాక్‌ ఔట్‌సోర్సింగ్‌ ఏజెన్సీ ద్వారా వచ్చి డెక్కన్‌ ఫ్యాక్టరీలో కూలీగా పనిచేస్తున్నాడు. పరిశ్రమ వెనుక భాగంలోని లేబర్ కాలనీలో ఉంటున్నాడు. ఆదివారం సాయంత్రం 5 గంటల సమయంలో బట్టలు ఉతుకుతుండగా గుండెపోటు వచ్చింది. అక్కడ ఉన్నవారు వెంటనే మిర్యాలగూడ మ్యాక్స్ కేర్ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించి హార్ట్ ఎటాక్‌తో చనిపోయాడని నిర్ధారించారు. మృతదేహాన్ని అతని కుటుంబ సభ్యులకు అప్పగించారు.

ఇదిలావుండగా, సోమవారం ఉదయం 10 గంటల సమయంలో డెక్కన్ సిమెంట్ గేట్ ముందు కొందరు కూలీలు గొడవ చేస్తున్నట్లు ఫ్యాక్టరీ నుండి సమాచారం రావడంతో పోలీసులు అక్కడికి వెళ్లారు. అక్కడ ధర్నా అవసరం లేదని.. వెళ్లి పనిచేసుకోవాలని ..మీలో నలుగురు వస్తే ఫ్యాక్టరీ వాళ్ళతో జరిగిన విషయాన్ని చర్చించి మాట్లాడదామని ఎస్‌ఐ నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వారు వినకుండా పోలీసులపై మూకుమ్మడిగా రాళ్లతో దాడి చేశారు. ఈ సందర్భంగా ఫ్యాక్టరీ సెక్యూరిటీ రూమ్‌కి సంబంధించిన అద్దాలను పగులగొట్టారు. పోలీసులపై రాళ్లతో, సిమెంటు ఇటుకలతో దాడికి పాల్పడ్డారు. పరిశ్రమ ముందు పూలకుండీలను పగులగొట్టారు. పాలకవీడు పోలీస్ స్టేషన్‌కు చెందిన పోలీసు వాహనంపై రాళ్లతో దాడి చేయడంతో ముందు, వెనక అద్దాలు ధ్వంసమయ్యాయి. దాడుల్లో ఎస్‌ఐ కోటేష్‌తోపాటు కానిస్టేబుల్ కు స్వల్ప గాయాలయ్యాయి. ప్రస్తుతం పరిశ్రమ అంతా పోలీసుల అదుపులో ఉంది. పోలీసులపై దాడి చేసిన వ్యక్తులను పట్టుకునే పనిలో పోలీసులు ఉన్నారు. ఘటన స్థలాన్ని ఎస్‌పి నరసింహ పరిశీలించారు.