రూ 525.36 కోట్లతో మున్నేరుకు రిటైనింగ్ నిర్మాణం

  • పనుల ప్రగతిని రెగ్యులర్ గా మానిటరింగ్ చేస్తున్న మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు.
  • పనుల నాణ్యతకు ప్రాధాన్యత ఇస్తున్న ప్రజా ప్రభుత్వం
  • వరంగల్ NIT నిపుణులతో నాణ్యతా పరీక్షలు
  • రెండు వైపుల సర్వీసు రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థ

ఖమ్మం నగర ప్రజల వరద ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారంకై రూ 525.36 కోట్ల వ్యయంతో మున్నేరుకి రిటైనింగ్ వాల్ నిర్మాణాన్ని ప్రజా ప్రభుత్వం చేపట్టింది. తెలంగాణలో విద్య, వైద్యం, వ్యవసాయ మార్కెటింగ్, వర్తక, వ్యాపార రంగాలలో వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ఖమ్మం అగ్రగామిగా నిలుస్తుంది. అయితే ఖమ్మం నగరం మద్య నుండి ప్రవహిస్తున్న మున్నేరు వాగు ప్రతి ఏటా వర్షాకాలంలో ఉదృతంగా పొంగి, పరిసర ప్రాంతాల ఇండ్లు, వర్తక , వ్యాపార సంస్థలు, పంటలు వరద ముంపు కి గురవుతున్నాయి. మారిన వాతావరణ మార్పుల ప్రభావం వల్ల వస్తున్న ఆకస్మిక వర్షాలు, క్లౌడ్ బస్ట్ లతో ప్రభుత్వ మౌళిక వసతులకు కూడా తీవ్ర నష్టం జరుగుతున్నది. పనులకు వెళ్ళిన వారు, ఇంటికి వచ్చి సామాన్లు, నిత్యావసరాలు సర్దుకునే వెసులుబాటు లభించదు. దీనితో వందలాది కుటుంబాలు సర్వస్వం కోల్పోయి, కట్టు బట్టలతో రోడ్డున పడుతున్నాయి. రోడ్లు ,విద్యుత్ స్తంబాలు, సబ్ స్టేషన్లు, పాఠశాల భవనాలు, తాగునీటి వసతు లు, పైపు లైన్లు , ఆరోగ్య కేంద్రాలు దెబ్బతింటున్నవి. రూరల్ మండలం లో పంటలు ముంపుకు గురవుతాయి. ఉదాహరణకు 2024 సెప్టెంబర్లో సంభవించిన క్లౌడ్ బస్ట్ తో మున్నేరుకు వచ్చిన ఆకస్మిక వరద ముంపుతో ప్రభుత్వ మౌలిక సదుపాయాలకు రూ. 757 కోట్ల నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేశారు. వరద ముంపు ప్రాంతాల్లో ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి పర్యటించి, బాధిత కుటుంబాలను పరామర్శించారు. మున్నేరు వాగు రివిట్మెంట్ వాల్ పనులు వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మున్నేరు వాగుకు 5,863 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ( Catchment area) నుండి గరిష్టంగా 10 వేల క్యుమెక్స్ వరద ప్రవహిస్తుంది. ఖమ్మం నగరం మద్య నుండి ప్రవహిస్తున్న మున్నేరు వాగుకు ఎడమ వైపు డ్రైనేజ్ వ్యవస్థ ద్వారా 379 క్యూమెక్స్ , కుడి వైపు డ్రైనేజ్ వ్యవస్థ ద్వారా 605 క్యూమెక్స్ వరద డిశ్చార్జ్ అవుతుంది. పరివాహక ప్రాంతం, నగరం నుంచి వచ్చే వరద గరిష్ట స్థాయిని దృష్టిలో ఉంచుకుని, మున్నేరు వాగు కు రెండు వైపుల సిమెంట్ కాంక్రీట్ రక్షణ గోడ పనులను ప్రభుత్వం మంజూరు చేసింది.

మున్నేరు వాగు వరద ముంపు సమస్యకు శాశ్వత పరష్కారానికి ప్రజా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందులో భాగంగా రూ.525.36 కోట్ల వ్యయంతో మున్నేరు వాగు కు రెండు వైపుల Retaining wall నిర్మాణం పనులను 2024 మార్చి నెలలో ప్రారంభించారు. మున్నేరు వాగుకు రెండు వైపుల ఖమ్మం రూరల్ మండలంలో 8.5 కిలోమీటర్లు, ఖమ్మం అర్బన్ మండలంలో 8.5 కిలోమీటర్లు మొత్తం 17 కిలోమీటర్లు పొడవున 10-15 మీటర్ల ఎత్తున రిటైనింగ్ వాల్ తో పాటు, సర్వీసు రోడ్డు , డ్రైనేజ్ వ్యవస్థ సదుపాయంతో ప్రారంభించిన పనులు వేగంగా జరుగుతున్నాయి. పనుల నాణ్యతకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్నది. వరంగల్ NIT నిపుణులతో పనుల ప్రమాణాలను తనిఖీ చేయిస్తున్నది. Retaining wall పనులను రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ & సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లు రెగ్యులర్ గా మానిటరింగ్ చేస్తున్నారు. ఖమ్మం అర్బన్ మండలం లో మల్లేమడుగు, దానవాయి గూడెం, బుర్హాన్ పురం, ఖమ్మం గ్రామాలు , ఖమ్మం రూరల్ మండలం పోలేపల్లి, గొల్లపాడు, గుడిమల్ల, గుర్రాలపాడు, ఏదులాపురం గ్రామాలకు చెందిన మొత్తం 245.12 ఎకరాల భూసేకరణలో 106.21 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంది. 138.31 ఎకరాల పట్టా భూమిలో ఇప్పటివరకు 69.12 ఎకరాలను సేకరించడం జరిగింది. భూ సేకరణ ప్రక్రియ వేగంగా జరుగుతున్నది. నిర్వాసితులకు పరిహారంతో పాటు, ఇండ్ల స్థలాలు కేటాయించుటకు ఖమ్మం రూరల్ మండలం పోలేపల్లి గ్రామంలో 139.27 ఎకరాల్లో లే-అవుట్ ను ప్రభుత్వం అభివృద్ది చేస్తున్నది. ఈ లే-అవుట్ నందు 1,666 కుటుంబాలకు ఇండ్ల స్థలాలు కేటాయించనున్నారు. అన్ని మౌలిక వసతులతో మోడల్ కాలనీగా ఇది అభివృద్ధి చెందుతుంది. మున్నేరు రీటైనింగ్ వాల్ పనులు పూర్తయితే, ఖమ్మం పురోభివృద్ధికి మైలు రాయిగా నిలుస్తుంది. దశాబ్దాల సమస్యను పరిష్కరించిన ఘనత ప్రజా ప్రభుత్వానికి దక్కుతుంది.