- దేశ విదేశాలకు నాణ్యమైన విత్తనాలు తెలంగాణ నుంచే..
- సీడ్మెన్ అసోసియేషన్ 30వ వార్షికోత్సవ కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
తెలంగాణ రాష్ట్రం “సీడ్ బౌల్ ఆఫ్ ఇండియా”గా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిందని, భవిష్యత్తులో “గ్లోబల్ సీడ్ క్యాపిటల్”గా నిలుస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. గురువారం జరిగిన సీడ్మెన్ అసోసియేషన్ 30వ వార్షికోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్‌కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ, గత 25 ఏళ్లుగా సీడ్మెన్ అసోసియేషన్ రైతులు, శాస్త్రవేత్తలు, పరిశ్రమలు, ప్రభుత్వాల మధ్య బలమైన వారధిగా నిలిచిందని అభినందించారు. నాణ్యమైన విత్తనాల తయారీలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో ఉందని, ప్రతి సంవత్సరం రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న ఒక కోటి క్వింటాళ్ల విత్తనాలలో 75 లక్షల క్వింటాళ్లు వరి, 10 లక్షల క్వింటాళ్లు మొక్కజొన్న, మరో 10 లక్షల క్వింటాళ్లు జొన్నలు, చిరుధాన్యాలుగా ఉత్పత్తి అవుతున్నాయని వివరించారు. ప్రస్తుతం దాదాపు 8 లక్షల ఎకరాల్లో విత్తన ఉత్పత్తి సాగుతో పాటు 3.5 లక్షల మంది రైతులు ప్రత్యక్షంగా ఈ రంగంలో భాగస్వాములు అవుతున్నారని తెలిపారు.
ప్రతి సంవత్సరం రూ.2,000 కోట్ల విలువైన ఒక లక్ష టన్నుల విత్తనం రాష్ట్రం నుంచి ఎగుమతి అవుతుందని, ప్రభుత్వం తీసుకుంటున్న కఠిన నిర్ణయాల వలన అంతర్జాతీయ మార్కెట్‌లో తెలంగాణ విత్తనాలకు ప్రత్యేక గుర్తింపు ఉందని ఆయన పేర్కొన్నారు. రైతుల కష్టం, క్రమశిక్షణ, అవగాహన వలనే ఈ విజయాలు సాధ్యమయ్యాయని మంత్రి గుర్తుచేశారు.
ప్రస్తుతం రాష్ట్రంలో 1,30,000 ఎకరాల్లో సాగుతున్న ఆయిల్ ఫామ్, భవిష్యత్తులో మరింత విస్తరించి రాష్ట్ర అభివృద్ధికి గేమ్ ఛేంజర్‌గా మారనుందని స్పష్టం చేశారు.
“ప్రతి రైతు నాటే విత్తనమే అతని భవిష్యత్తు. విత్తనం నాణ్యత కలిగినదైతే రైతు నమ్మకం పెరుగుతుంది. నాణ్యత తగ్గితే రైతు పంట మాత్రమే కాదు, అతని ఆదాయం, కుటుంబ జీవనం, దేశ భవిష్యత్తు కూడా ప్రమాదంలో పడుతుంది” అని మంత్రి హెచ్చరించారు. రాబోయే 25 ఏళ్లలో “quantity” కంటే “quality”కి ప్రాధాన్యం ఇవ్వాలని సీడ్మెన్ అసోసియేషన్‌కు సూచించారు. నిజాయితీగా పనిచేసే విత్తన కంపెనీలను ప్రోత్సాహించడం, నకిలీ విత్తనాలనుంచి రైతులను రక్షించడం – రెండూ ముఖ్యమని మంత్రి స్పష్టం చేశారు. ఈ లక్ష్యాల సాధనకు విత్తన చట్ట సవరణలు తీసుకొస్తున్నామని, ప్రస్తుతం అవి ముసాయిదా దశలో ఉన్నాయని తెలిపారు. సీడ్ ఇండస్ట్రీ అభివృద్ధికి అవసరమైన అన్ని సహకారాలు అందించేందుకు సీఎం శ్రీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు.
గతేడాది తెలంగాణలో నిర్వహించిన వరల్డ్ రైస్ సమ్మిట్, ఇటీవలి ఇండో-ఆఫ్రికన్ సీడ్ సమ్మిట్‌ల ద్వారా రాష్ట్రం ప్రపంచ దృష్టిని ఆకర్షించిందని మంత్రి గుర్తుచేశారు. విత్తనాలను సరఫరా చేయడమే కాకుండా జ్ఞానాన్ని పంచే కేంద్రంగా కూడా తెలంగాణ నిలిచిందని తెలిపారు.
1995 నుండి రైతులు, కంపెనీలు, శాస్త్రవేత్తలు, ప్రభుత్వాల మధ్య అనుసంధానంగా పని చేస్తూ విత్తన రంగానికి విశేష సేవలందించినందుకు సీడ్మెన్ అసోసియేషన్‌ను ఈ సందర్భంగా మంత్రి అభినందించారు. భవిష్యత్తులో కఠినమైన నాణ్యత ప్రమాణాలను పాటించాల్సిన అవసరం ఉందని, వాతావరణ మార్పులకు తట్టుకునే కొత్త హైబ్రిడ్ల అభివృద్ధికి పరిశోధనలో పెట్టుబడులు పెంచాలని, ఆహార ధాన్యాలే కాకుండా ఉద్యానపంటలకు ముఖ్యంగా అధిక దిగుబడి ఇచ్చే కూరగాయ విత్తనాలను రూపొందించాలని మంత్రి సూచించారు. ఆఫ్రికా, ఆసియా దేశాలకు విత్తన ఎగుమతులు విస్తరించాల్సిన అవసరం ఉందని, ప్రభుత్వం–విశ్వవిద్యాలయాలు–పరిశ్రమ–రైతులు కలిసి బలమైన భాగస్వామ్యం ఏర్పరుచుకోవాలని పిలుపునిచ్చారు. దళారుల వద్ద లేబుల్ లేని లూస్ ప్యాకింగ్ విత్తనాలు కొనవద్దని, ప్రభుత్వ లైసెన్స్ షాపుల్లో మాత్రమే విత్తనాలు కొనాలని రైతులకు సూచించారు. HT రకం పత్తి విత్తనాల విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందనీ, అవి అమ్మే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకొంటామని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు. “తెలంగాణ నుండి బయటికి వెళ్లే ప్రతి విత్తనం నాణ్యత, ఉత్పాదకత, రైతు సుభిక్షతకు హామీగా నిలవాలి. తెలంగాణను సీడ్ బౌల్ ఆఫ్ ఇండియా మాత్రమే కాకుండా, గ్లోబల్ సీడ్ క్యాపిటల్‌గా తీర్చిదిద్దేందుకు అందరం కలసి కృషి చేద్దాం” అని మంత్రి తుమ్మల సంకల్పబద్ధంగా ప్రకటించారు. ఈ కార్యక్రమంలో సీడ్ మెన్ అసోషియేషన్ సభ్యులు, వ్యవసాయశాఖ అడిషనల్ డైరెక్టర్, విత్తన కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.