- పంచాయితీ కార్యదర్శి సస్పెన్షన్, మరొకరిపై విచారణ
- ఇందిరమ్మ కమిటీ సభ్యునిపై క్రిమినల్ కేసు నమోదు
- ఫిర్యాదు చేసిన 24 గంటల్లోపే చర్యలు
- పేదోడి నుంచి పైసా వసూల్ చేసినా సహించేది లేదు
హైదరాబాద్ : నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపే ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం విషయంలో ఎటువంటి అవినీతి, అక్రమాలకు చోటు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న గట్టి చర్యలు ప్రజలను చైతన్యపరుస్తున్నాయి. అందుకే ఏ చిన్న సమస్య వచ్చినా లబ్దిదారులు ఏమాత్రం సంకోచించకుండా ఇందిరమ్మ ఇండ్ల కాల్ సెంటర్ ను ఆశ్రయిస్తున్నారు. ఈ కాల్ సెంటర్ బాధితులకు బాసటగా నిలుస్తోంది. కాల్ సెంటర్ నెంబర్ 1800 599 5991కు ఫిర్యాదు వచ్చిన గంటల్లోనే సదరు ఫిర్యాదులు, సమస్యలపై అధికారులే నేరుగా రంగంలోకి దిగి తక్షణ చర్యలు తీసుకుంటున్నారు. కాల్ సెంటర్ కు వచ్చే ఫిర్యాదులను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రతిరోజు తన కార్యాలయానికి తెప్పించుకొని పరిశీలిస్తున్నారు. ఇందిరమ్మ ఇండ్ల బిల్లుల మంజూరులో లంచాలు అడుగుతున్న అధికారులపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఫిర్యాదు వచ్చిన 24 గంటల్లోనే బాధితులకు న్యాయం చేసి సంబంధిత అధికారులపై చర్యలు చేపడుతున్నారు. డబ్బుల కోసం పేదలను వేధిస్తే ఫిర్యాదు చేసిన 24 గంటల్లో విచారణ జరిపి క్రిమినల్ కేసుల నమోదు చేస్తామని అధికారులు, ఇందిరమ్మ కమిటీలను హెచ్చరించారు. మంత్రిగారు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ కాల్‌సెంటర్ లో నమోదయ్యే ఫిర్యాదులపై విచారణ జరుగుతోంది. ఇప్పటికే పలువురు ఇందిరమ్మ కమిటీ సభ్యులు, గ్రామ కార్యదర్శులపై వేటు పడింది.
తాజాగా కొంతమంది ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారుల ఫిర్యాదులను గమనిస్తే.. వారికి కాల్ సెంటర్‌పై ఎంత నమ్మకం ఏర్పడిందో అర్ధమవుతుంది. అంతేగాక ఓ లబ్దిదారు ఏకంగా పోలీసు స్టేషన్లోనే ఇందిరమ్మ కమిటీ సభ్యునిపై ఫిర్యాదు చేయడం కూడా వారిలో పెరిగిన ఆత్మస్థైర్యానికి నిదర్శనంగా నిలిచింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి…
పంచాయితీ కార్యదర్శిపై ఫిర్యాదు
సంగారెడ్డి జిల్లా నిజాంపేట, ఏదులతండాకు చెందిన ఇందిరమ్మ ఇల్లు లబ్దిదారు అంగోత్ తులసీభాయి నేరుగా హౌసింగ్ కార్పొరేషన్‌లోని కాల్ సెంటర్ కు ఫోన్ చేసి తన ఇల్లు నిర్మాణం పునాదుల వరకు పూర్తయిందని అయితే అంతవరకు ఫోటో తీసి పంపడానికి గాను పంచాయితీ కార్యదర్శి పి. మహబూబ్ అలీ 10 వేల రూపాయిలు డిమాండ్ చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. ఇప్పటికే తాము 5వేల రూపాయిలు ఇచ్చామని అయినప్పటికీ ఇంటి పునాదుల ఫోటోను అప్లోడ్ చేయలేదని ఫిర్యాదు చేశారు. విచారణలో ఫోన్ పే ద్వారా అతనికి డబ్బులు చెల్లించినట్లు అధికారుల విచారణలో తేలింది.
మరో కార్యదర్శిపై కూడా…
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మండలం మాజిద్పూర్ కు చెందిన కల్లె సత్యాలు అనే ఇందిరమ్మ ఇల్లు లబ్దిదారు నేరుగా కాల్ సెంటర్‌కు ఫోన్ చేసి తమ పంచాయితీ కార్యదర్శి రాఘవేంద్ర పలు రకాలుగా సమస్యలు సృష్టించి వేధిస్తున్నారని, 20 వేల రూపాయిలు లంచంగా ఇవ్వమని డిమాండ్ చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. ఇంతవరకు ఇల్లు బేస్మెంట్ వరకు పూర్తయిందని , ఇప్పుడు గ్రామ పైప్‌లైన్‌కు అడ్డంగా ఉందని చెప్పి ఇంటి ఫోటో కూడా తీయకుండా వేధిస్తున్నారని ఆమె కాల్‌సెంటర్‌కు తెలిపారు. 2నెలలుగా నరకం అనుభవిస్తున్నామని, తమ కుటుంబం ఆత్మహత్య చేసుకుంటామని చెబితే అలాగే చేస్కోండి అంటూ సమాధానమిస్తున్నారని ఆమె తెలిపారు. దీనిపై అధికారులు లోతైన విచారణ జరుగుతున్నారు .
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారు ఫిర్యాదు- కేసు నమోదు
నాగర్ కర్నూలు జిల్లా తాండూరు మండలం సిర్సవాడ గ్రామానికి చెందిన ఏదుల భీమమ్మ అనే ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారు చేపట్టిన ఇంటి నిర్మాణానికి అడ్డుపడుతూ, ఆమెను బెదిరించి డబ్బు వసూలు చేసినట్లు అందిన ఫిర్యాదుపై స్థానిక పోలీసుల కేసు నమోదు చేశారు. ఆమె ఫిర్యాదులోని వివరాల ప్రకారం భీమమ్మకు ఇందిరమ్మ ఇల్లు మంజూరుకాగా ఆమె బావ ఏదుల నారాయణ తన భార్య పిల్లలతో కలిసి ఇంటి నిర్మాణాన్ని అడ్డుపడ్డారు. నారాయణకు అండగా నిలిచిన ఇందిరమ్మ కమిటీ సభ్యుడు చిక్కోండ్ర మల్లేష్ జోక్యం చేసుకొని 25వేల రూపాయిలను డిమాండ్ చేశాడు. దీంతో భయపడిన భీమమ్మ 10 వేల రూపాయిలను మల్లేష్‌కు ఇచ్చారు. అయినప్పటికీ ఏదుల నారాయణకు మల్లేష్ మద్దతుగా నిలిచి తనను మోసం చేశారని , తన ఇంటి నిర్మాణానికి అడ్డుపడుతున్నందున వీరందరిపై తగు చర్యలు తీసుకోవాలని భీమమ్మ తాండూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ జరిపిన పోలీసులు ఇందిరమ్మ కమిటీ సభ్యుడు మల్లేష్‌పై క్రిమినల్ కేసు నమోదు చేశారు.
పేదోడి నుంచి పైసా వసూలు చేసిన క్షమించేది లేదు : మంత్రి పొంగులేటి
పేదవాడి సొంతింటి కలను నెరవర్చే సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గారి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల మంజూరు, చెల్లింపుల విషయంలో అవినీతికి పాల్పడితే ఎంతటివారినైనా ఉపేక్షించబోమని పేదవాడి నుంచి పైసా వసూలు చేసిన సహించబోమని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్ , సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల నుంచి లంచం డిమాండ్ చేసిన సంగారెడ్డి జిల్లాలోని పంచాయితీ కార్యదర్శిని సస్పెండ్ చేయాలని జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు. రంగారెడ్డి జిల్లా మాజిద్పూర్ గ్రామ కార్యదర్శిపై లోతైన విచారణకు ఆదేశించామన్నారు.
అలాగే నాగర్ కర్నూల్ జిల్లా తాండూరు మండలంలో ఇందిరమ్మ కమిటీ సభ్యుడిపై క్రిమినల్ కేసు నమోదు చేశామని తెలిపారు.. ఇందిరమ్మ ఇండ్ల మంజూరుకు లబ్దిదారుల నుంచి లంచం అడిగే ఇందిరమ్మ కమిటీ సభ్యులను తక్షణం కమిటీ నుంచి తొలగించి క్రిమినల్ కేసు నమోదు చేయాలని అధికారులను ఇప్పటికే ఆదేశించామని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల విషయంలో పేదలను ఇబ్బందిపెట్టి డబ్బుల వసూళ్లకు పాల్పడితే ఫిర్యాదు అందిన 24 గంటల్లోనే చర్యలు తీసుకుంటామని కాల్ సెంటర్‌కు వచ్చిన ఫిర్యాదును తక్షణం ఆయా జిల్లా కలెక్టర్ , ఎస్పీకి పంపడంతోపాటు సచివాలయంలోని తన కార్యాలయానికి కూడా పంపించాలని అధికారులకు సూచించామని వివరించారు. ఇటువంటి ఫిర్యాదులపై తమ కార్యాలయం కూడా మానిటరింగ్ చేస్తుందని తెలిపారు. లంచమడిగితే టోల్ ఫ్రీ నెంబర్ 18005995991కు కాల్ చేసి వివరాలను తెలియజేస్తే 24 గంటల్లో యాక్షన్ తీసుకుంటామని భరోసా ఇచ్చారు. గత ప్రభుత్వం పేదల ఇండ్ల నిర్మాణంలో నిర్లక్ష్యంగా వ్యవహరించి పట్టించుకోలేదు, కానీ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గారి నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వం ఎన్ని ఆర్ధిక ఇబ్బందులు ఉన్నాకూడా ఈ పధకాన్ని అమలు చేస్తున్న నేపథ్యంలో పేదల నుంచి డబ్బులు డిమాండ్ చేయడం బాధాకరం, బాధితులు నిర్భయంగా ఇందిరమ్మ కాల్ సెంటర్‌కు ఫిర్యాదు చేయాలని, ఫిర్యాదు చేస్తే దోషులను వదిలిపెట్టబోమని అన్నారు.