45 మంది డిప్యూటీ కలెక్టర్ల నియామకం

 రాష్ట్ర ప్రభుత్వం 45 మందిని డిప్యూటీ కలెక్టర్లుగా నియమించింది. గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ కింద డిప్యూటీ కలెక్టర్‌ (క్యాటగిరీ-3) పోస్టులకు ఎంపికైన 45 మంది అభ్యర్థులను నియమిస్తూ ఆదివారం ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ సివిల్‌ సర్వీసెస్‌ (ఎగ్జిక్యూటివ్‌ బ్రాంచ్‌) రూల్స్‌-2024 ప్రకారం టీజీపీఎస్సీ ఎంపిక చేసిన అభ్యర్థులను మల్టీజోన్‌-1లో 20 మంది, మల్టీజోన్‌-2లో 25 మందిని వివిధ జిల్లాలకు ట్రైనింగ్‌ కోసం కేటాయించారు. ఈ నియామకాలు షరతులకు లోబడి ఉంటాయని పేర్కొన్నారు. అభ్యర్థులు 60 రోజుల్లోపు డ్యూటీలో చేరాలని, లేకుంటే నియామకం రద్దు అవుతుందని తెలిపారు. శిక్షణ పూర్తయ్యాక మూడేండ్లు ప్రభుత్వ సర్వీసులో కొనసాగాలని సూచించారు. అభ్యర్థులు సర్టిఫికెట్లను వెరిఫికేషన్‌ చేయించుని, మెడికల్‌ రిపోర్ట్‌ సమర్పించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.