- ఫ్లడ్ డ్యామేజ్ రోడ్ల వివరాలపై ఆరా తీసిన మంత్రి
- టిమ్స్ హాస్పిటల్స్,మెడికల్ కాలేజీలు,IDOC ల పనుల పురోగతిపై సమీక్షించిన మంత్రి
హైదరాబాద్: ఆర్ అండ్ బి శాఖ పరిధిలోని పలు పనుల పురోగతిపై సోమవారం నాడు రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఇటీవల కురిసిన అధిక వర్షాల వల్ల డ్యామేజ్ అయిన రోడ్ల వివరాలపై మంత్రి ఆరా తీశారు. 1062 ప్రాంతాల్లో,1370 కి.మీ స్టేట్ రోడ్స్ దెబ్బతిన్నాయని,68 రోడ్లు కోతకు గురికాగా,38 తాత్కాలిక పునరుద్ధరణ చేసినట్టు ఈఎన్సి మోహన్ నాయక్ వివరించారు. ఓవర్ ఫ్లో ఉన్న 520 గాను 478 చోట్ల తగ్గుముఖం పట్టాయని, 445 చోట్ల ట్రాఫిక్ అంతరాయం ఏర్పడితే,375 చోట్ల పునరుద్ధరణ చేసినట్టు తెలిపారు. సుమారు 306 కోట్ల సిడి వర్క్స్ దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. తాత్కాలిక, శాశ్వత పునరుద్ధరణ కోసం ఎస్టిమేట్స్ రూపొందించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ప్రాథమిక అంచనా ప్రకారం తాత్కాలిక పునరుద్ధరణ కోసం 72.49 కోట్లు, శాశ్వత పునరుద్ధరణకు 1263.33 కోట్లు అవుతాయని అధికారులు వివరించారు. వర్షాలు తగ్గుముఖం పట్టగానే పూర్తి స్థాయి తాత్కాలిక మరమ్మతులు చేపట్టాలని,శాశ్వత పునరుద్ధరణ కోసం మళ్ళీ క్షేత్ర స్థాయిలో పరిశీలన చేయాలని ఆర్ అండ్ బి ఈఎన్సి మోహన్ నాయక్ ను మంత్రి ఆదేశించారు.
టిమ్స్ హాస్పిటల్స్,మెడికల్ కాలేజీలు, ఇంటిగ్రేటెడ్ జిల్లా కలెక్టరేట్ల పనుల పురోగతిని మంత్రి అడిగి తెలుసుకున్నారు. టిమ్స్ హాస్పిటల్స్,మెడికల్ కాలేజీల పనులు వేగం పెంచి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. తుది దశకు చేరుకున్న ములుగు, వరంగల్, కరీంనగర్ జిల్లాల కలెక్టరేట్లు నిర్మాణాలు త్వరగా పూర్తి చేసి అందుబాటులోకి వచ్చేందుకు అధికారులు రేయింబవళ్ళు కష్టపడాలన్నారు. నారాయణపేట,ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్ల పనుల్లో వేగం పెంచాలని, ఆర్ అండ్ బి పరిధిలో నిర్మితం అవుతున్న ప్రతి భవన నిర్మాణాలు ప్రభుత్వం విధించిన నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని పునరుద్ఘాటించారు. నేషనల్ హైవేలు,పురోగతిలో ఉన్న ఫ్లై ఓవర్లు పై ఆరా తీసిన మంత్రి నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని చెప్పారు. ఎన్నికల కోడ్ తర్వాత పూర్తి స్థాయిలో సమీక్ష నిర్వహిస్తానని,ముఖ్యమంత్రి తో మాట్లాడి హ్యామ్ రోడ్ల పై ఒక స్పష్టమైన విధానాన్ని తీసుకువస్తామని మంత్రి అధికారులతో అన్నారు. ఈ సమీక్ష సమావేశంలో ఈఎన్సి మోహన్ నాయక్,సి.ఈ లు రాజేశ్వర్ రెడ్డి, బి.వి రావు, లక్ష్మణ్, ఎం.శ్రీనివాస్ రెడ్డి, కిషన్ రావు లు పాల్గొన్నారు.