హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన సజ్జనార్‌

హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌గా వీసీ సజ్జనార్‌ బాధ్యతలు స్వీకరించారు. గత నాలుగేండ్లుగా ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు నిర్వహిస్తున్న సజ్జనార్‌ను.. మూడు రోజుల క్రితం ప్రభుత్వం హైదరాబాద్‌ సీపీగా బదిలీ చేసింది. ఇప్పటి వరకు సీపీగా ఉన్న సీవీ ఆనంద్‌ను హోంశాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీగా ట్రాన్స్‌ఫర్‌ చేసింది. దీంతో మంగళవారం ఉదయం సీపీ కార్యాలయంలో ప్రత్యేక పూజల అనంతరం సీవీ ఆనంద్‌ నుంచి సజ్జనార్‌ బాధ్యతలు స్వీకరించారు.

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ-టీజీఎస్‌ఆర్టీసీకి నాలుగేండ్లపాటు సేవలందించడం తనకెంతో ఆనందంగా ఉందని, ప్రజలకు నేరుగా సేవలదించే సంస్థను వీటడం ఒకింత బాధగా ఉన్నదని.. ఆర్టీసీ స్టీరింగ్‌ వదిలేసే సమయం వచ్చిందని భావోద్వేగానికి గురయ్యారు. సోమవారం వీడ్కోలు సభలో ఆయన మాట్లాడారు. తనకు సహకరించిన సిబ్బందికి, అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. తన హయాంలో కొత్త బస్సుల కొనుగోలు, యూపీఐ పేమెంట్లు, ఎలక్ట్రిక్‌ బస్సులు, స్టేషన్ల ఆధునీకరణ, మెగా హెల్త్‌ క్యాంపులు వంటి కొత్త కార్యక్రమాలు చేపట్టినట్టు చెప్పారు. ఆర్టీసీ కార్మికులకు త్వరలోనే పీఆర్సీ వచ్చే అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు. సంస్థ మనుగడ కోసం ఉద్యోగులు శ్రమించాలని సూచించారు.

అనంతరం సజ్జనార్‌ను ఉద్యోగులు గజమాలతో సత్కరించారు. కార్యక్రమంలో ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌లు మునిశేఖర్‌, వెంకన్న, సీటీఎం (కమర్షియల్‌) శ్రీధర్‌, సీపీఎం ఉషాదేవి, ఇతర ఉన్నతాధికారులు, వివిధ జిల్లాల నుంచి వచ్చిన ఆర్‌ఎంలు, డీఎంలు, సిబ్బంది పాల్గొన్నారు. వీడ్కోలు అనంతరం సజ్జనార్‌ తన ఎక్స్‌ ఖాతాలోనూ భావోద్వేగంతో పోస్ట్‌ పెట్టారు. ‘నా స్టాప్‌ వచ్చేసింది. ఆర్టీసీకి 4 సంవత్సరాలకు పైగా మార్గదర్శకత్వం వహించిన తర్వాత, ఈ బస్సు నుంచి దిగి, కొత్త మార్గంలో పయనించాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రయాణాలు ఆగుతాయి, ప్రయాణికులు ముందుకు కదులుతారు, కానీ రహదారి ఎల్లప్పుడూ ముందుకే సాగుతుంది. బస్సును పార్‌ చేసి, తదుపరి సవాలు వైపు ప్రయాణం వేగవంతం చేయాల్సిన సమయం ఇది’ అని పేర్కొన్నారు. అంతకుముందు ఉదయం సజ్జనార్‌ లక్డీకపూర్‌లోని టెలిఫోన్‌ భవన్‌ నుంచి ఆర్టీసీ క్రాస్‌రోడ్డులోని బస్‌ భవన్‌కు బస్సులో ప్రయాణించారు. దారి పొడవునా ప్రయాణికులతో ముచ్చటించారు. డ్రైవర్‌, కండక్టర్‌తో ఆత్మీయంగా మాట్లాడారు.