నిజామాబాద్ జిల్లాలో పంచాయతీ రాజ్ సమ్మేళనం

ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నప్పటికీ పల్లె ప్రగతి కార్యక్రమం వల్లనే ప్రజాప్రతినిధులపై ప్రజలకు గౌరవం పెరిగిందని రాష్ట్ర రోడ్లు- భవనాలు,గృహ నిర్మాణ, శాసనసభ వ్యవహారాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఇకముందు కూడా పల్లె ప్రగతి లో గ్రామాలను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయడానికి బాధ్యత తీసుకోవాలని ఆయన కోరారు.
బుధవారం నాడు నిజామాబాద్ జిల్లా బోర్గాం వద్దగల భూమా రెడ్డి కన్వెన్షన్ హాల్లో పంచాయతీ రాజ్ సమ్మేళనం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. జిల్లా పరిషత్ చైర్మన్ విట్టల్ రావు, పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి తో పాటు అదనపు కలెక్టర్లు, జడ్పీటీసీలు, ఎంపీపీ అధ్యక్షులు, సర్పంచులు,ఎంపీటీసీలు, జిల్లా అధికారులు సుమారు రెండు వేల పైగా పాల్గొన్న ఈ సదస్సులో పంచాయతీ రాజ్ చట్టం లో సర్పంచులు , ప్రజాప్రతినిధుల విధులు, నిధులు, బాధ్యతలు తదితర అంశాలపై అవగాహన కల్పించడానికి ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.