కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి(73) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న దామోదర్‌రెడ్డి కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఆరోగ్యం మరింత ఇబ్బందికరంగా మారడంతో కుటుంబసభ్యులు ఆయనను గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ బుధవారం రాత్రి 10 గంటలకు దామోదర్‌రెడ్డి తుదిశ్వాస విడిచారు. ఆయన భౌతిక కాయాన్ని గురువారం కిమ్స్ ఆస్పత్రికి తరలించనున్నారు. అనంతరం శుక్రవారం (ఈ నెల 3న) హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ఆయన నివాసానికి తరలిస్తారు. అక్కడి నుంచి అదే రోజు సాయంత్రం కార్యకర్తలు, ప్రజల సందర్శనార్థం సూర్యాపేటకు తీసుకెళ్తారు. ఈ నెల 4న సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో అంత్యక్రియలు నిర్వహిస్తారు. కాగా, దామోదర్‌రెడ్డి 1952 సెప్టెంబరు 14న జన్మించారు. వరంగల్‌లోని కాకతీయ యూనివర్సిటీలో బీఎస్సీ విద్యను పూర్తి చేశారు. వ్యవసాయం చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపేవారు. దామోదర్‌రెడ్డికి మాజీ మంత్రి దివంగత రాంరెడ్డి వెంకటరెడ్డి, గోపాల్‌రెడ్డి, క్రిష్ణారెడ్డి సోదరులున్నారు. ఆయన స్వస్థలం ఖమ్మం జిల్లా పాతలింగాల గ్రామం. ఆయనకు కుమారుడు సర్వోత్తమ్‌రెడ్డి ఉన్నారు. దామోదర్‌రెడ్డి భార్య వరూధినీదేవి కొన్నేళ్ల క్రితం మరణించారు. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో దామోదర్‌రెడ్డి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1985, 1989, 1994, 2004 ఎన్నికల్లో తుంగతుర్తి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన దామోదర్‌రెడ్డి.. ఆ తరువాత నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణతో సూర్యాపేటకు మారారు. 2009 ఎన్నికల్లో సూర్యాపేట నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కూడా వరుసగా 2014, 2018, 2023 ఎన్నికల్లో సూర్యాపేట నుంచి దామోదర్‌రెడ్డి పోటీ చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రెండు సార్లు మంత్రిగా పని చేశారు. 1991 నుంచి 1992 వరకు రాష్ట్ర భూగర్భజలవనరుల శాఖ మంత్రిగా పని చేశారు. అనంతరం 2008 నుంచి 2009 వరకు వైఎ్‌సఆర్ మంత్రివర్గంలో ఐటీ శాఖ మంత్రిగా పని చేశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా రాజకీయాల్లో దామోదర్‌రెడ్డి చెరగని ముద్ర వేశారు. నల్లగొండ జిల్లా కాంగ్రెస్ పార్టీలో దామోదర్‌రెడ్డి మాటకు చాలా విలువనిచ్చేవారు. అన్ని పార్టీల నాయకులు, ప్రజలు ఆయనను ‘టైగర్ దామన్న’ అని పిలిచేవారు. దామోదర్‌రెడ్డి మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. దామోదర్‌రెడ్డి మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు అని పేర్కొన్నారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు సంతాపం వ్యక్తం చేశారు.
