- మరో 50 గొర్రెలకు తీవ్ర అస్వస్థత
- కంపెనీ యాజమాన్యాల నిర్లక్ష్యమే కారణమని గ్రామస్తులు ఆరోపణ
రసాయన కంపెనీలు విడుదల చేసే వ్యర్ధాలను తిని 9 గొర్రెలు మృతి చెందిన ఘటన ఆదివారం చిట్యాల మండలంలోని పీఠంపల్లి గ్రామంలో జరిగింది. తెలిసిన వివరాల ప్రకారం… గ్రామానికి చెందిన గొర్రెల కాపరి మెట్టు లింగయ్య తన గొర్రెలను తోలుకొని మేతకు వెళ్లాడు. కాగా గ్రామ పరిధిలోని రసాయన కంపెనీలు వదిలేసే విషపూరిత వ్యర్థాల వల్ల గొర్రెలు వాటిని తిని 9 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందగా మరో 50 గొర్రెలు ప్రాణాపాయ స్థితిలో కొట్టు మిట్టాడుతున్నాయి. మేత మేయడం లేదని ఆ రైతు వాపోతున్నారు. రసాయన కంపెనీ యాజమాన్యాలు విషపూరిత వ్యర్థాలు బ్యాగులలో నింపి విచ్చలవిడిగా ఎక్కడపడితే అక్కడ వదిలేయడంతో వాటిని తిన్న మూగ జీవాలు మృత్యువాత పడుతున్నాయి. రసాయన కంపెనీలు విడుదల చేసే విషపూరిత వ్యర్ధాలను పరిసర ప్రాంతాల్లో వదిలేయకుండా కంపెనీ ఆవరణలోనే నిక్షిప్తం చేసేలా చర్యలు తీసుకోవాలి. కానీ అలా కాకుండా కంపెనీ యాజమాన్యం విషపూరిత రసాయనలను పరిసర ప్రాంతాల్లో వదిలివేయడం వల్ల పర్యావరణం క్షీణించి వన్యప్రానులే కాకుండా ప్రజలు కూడా ప్రాణాలు కోల్పోతున్నప్పటికీ కంపెనీ యాజమాన్యాలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం వారి నిర్లక్ష్య వైఖరికి నిదర్శనమని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇటీవల కాలంలో చుట్టు పక్కల ఉన్న ఫార్మా పరిశ్రమల యాజమాన్యాలు ఇస్టారీతిలో ఎక్కడపడితే అక్కడ రసాయన వ్యర్ధాలు పారబోస్తున్నారని, ఫిర్యాదులు చేసిన పట్టించుకోవడం లేదని, సంబంధిత అధికారులు వెంటనే స్పందించి కంపెనీ యాజమాన్యాలపై చర్యలు తీసుకుని తమకు తగిన న్యాయం చేయాలని గొర్రెల కాపరులు, గ్రామస్తులు, రైతులు కోరుతున్నారు.