హైదరాబాద్ : పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ జూపల్లి కృష్ణారావు ఇవాళ ఆర్ట్ గ్యాలరీ సాంస్కృతిక కళాసారథి సంస్థల అధికారులతో మాదాపూర్ లోని ఆర్ట్ గ్యాలరీలో
సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఆర్ట్ గ్యాలరీని సమర్థవంతంగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉందని, దాని నిర్వహణను మరింత మెరుగుపర్చాలని అధికారులను ఆదేశించారు. ఆర్ట్ గ్యాలరీని మరింత ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి సమగ్ర ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. చిత్రకారులు, కళాకారులు దీనిని మరింత సద్వినియోగం చేసుకునేలా, కళా ప్రియులు, ప్రజలు, పర్యాటకులు ఎక్కువగా సందర్శించేలా ప్రత్యేక కార్యక్రమాలు, ప్రదర్శనలు, ఈవెంట్లు నిర్వహించాలని శిశానిర్ధేశం చేశారు.
సాంస్కృతిక కళాసారథుల గురించి మాట్లాడుతూ, వారి వేతనాలను ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో సకాలంలో చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కళాకారుల సేవలకు గౌరవం ఇవ్వడం ప్రభుత్వ ధర్మమని తెలిపారు. అలాగే, కళాసారథి కార్యాలయంలో ఉన్న ఆడియో–వీడియో స్టూడియోలో సౌండ్ ప్రూఫింగ్ పనులను తక్షణమే చేపట్టాలని, అందుకోసం అవసరమైన కన్సల్టెంట్ నిపుణుడి సేవలను వినియోగించుకోవాలని మంత్రి ఆదేశించారు. అంతకుముందు మంత్రి జూపల్లి అర్థ్ గ్యాలరీ, సాంస్కృతిక కళాసారథి కార్యాలయాలను సందర్శించారు. ఈ సమీక్షలో ఆర్ట్ గ్యాలరీ డైరెక్టర్ లక్ష్మి, భాషా, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ నరసింహ రెడ్డి, సాంస్కృతిక కళాసారథి చైర్పర్సన్ వెన్నెల గద్దర్ పాల్గొన్నారు.
