రెవెన్యూ భూముల కేటాయింపుల‌పై లెక్క‌లు తేల్చండి: మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి

  • సీతారామ లిఫ్ట్ ఇరిగేష‌న్ కు భూసేక‌ర‌ణ వేగవంతం
  • రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి

హైద‌రాబాద్ : గ‌త 30-40 సంవ‌త్స‌రాల నుంచి రెవెన్యూ శాఖ త‌ర‌పున వివిధ అవ‌స‌రాల కొసం ప్ర‌భుత్వ‌ శాఖ‌ల‌కు కేటాయించిన భూముల వివ‌రాలు, వినియోగం, ప్ర‌స్తుతం వాటి ప‌రిస్ధితి త‌దిత‌ర అంశాల‌పై స‌మ‌గ్ర నివేదిక‌ను రూపొందించాల‌ని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు.
వివిధ ప్రాజెక్ట్‌ల కోసం రెవెన్యూ విభాగం వేలాది ఎక‌రాల భూముల‌ను ప‌లు విభాగాల‌కు ముఖ్యంగా ఇరిగేష‌న్‌, ఫారెస్ట్ శాఖ‌ల‌కు కేటాయించింద‌ని అయితే రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత ప్రాజెక్ట్‌ల‌లో మార్పులు చేర్పులు జ‌ర‌గ‌డం తో పాటు కొన్ని ర‌ద్దుకూడా అయ్యాయ‌ని ఈ అంశాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకొని లెక్క‌లు తేల్చాల‌ని అధికారుల‌కు సూచించారు. గ‌డ‌చిన 30 సంవ‌త్స‌రాల‌లో అట‌వీ శాఖకు రెవెన్యూ శాఖ కేటాయించిన భూమి ఎంత‌, అదేవిధంగా అట‌వీ శాఖ రెవెన్యూ శాఖకు కేటాయించిన భూమి ఎంత అనే వివ‌రాల‌ను రెండు శాఖ‌లు స‌మ‌న్వ‌యంతో ఒక నివేదిక‌ను త‌యారుచేయాల‌ని సూచించారు. సీతారామ లిఫ్ట్ ఇరిగేష‌న్‌కు సంబంధించి ఉమ్మడి ఖ‌మ్మం జిల్లాలో 1138 ఎక‌రాల అట‌వీ భూమి కేటాయించేందుకు ప్ర‌తిపాదించార‌ని ఈ ప్ర‌క్రియ వేగ‌వంతం చేయాల‌ని సూచించారు. అలాగే కేశ‌వ‌పురం త్రాగునీటి ప‌ధ‌కం కోసం రెవెన్యూ శాఖ గ‌తంలో అట‌వీశాఖ‌కు 1030 ఎక‌రాల‌ భూమిని కేటాయించింది. అయితే ఈ ప్రాజెక్ట్ ర‌ద్ద‌యినందున‌ స‌ద‌రు భూమిని సీతారామ లిఫ్ట్ ఇరిగేష‌న్ ప్రాజెక్ట్‌కు బ‌ద‌లాయింపున‌కు సంబంధించి సాధ్యాసాధ్యాల‌ను ప‌రిశీలించాల‌ని మంత్రిగారు సూచించారు. ఈ స‌మావేశంలో రెవెన్యూ శాఖ కార్య‌ద‌ర్శి , అట‌వీ ప‌ర్యావ‌ర‌ణ శాఖ ప్రిన్సిప‌ల్ సెక్రెట‌రీ, పీసీ సిఎఫ్ , మెట్రో వాట‌ర్ వర్క్స్ ఎండీ త‌దిత‌రులు పాల్గొన్నారు.