విజ‌య‌వంతంగా ఇందిర‌మ్మ ఇండ్ల ప‌ధ‌కం అమ‌లు: మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి

  • ల‌బ్దిదారులే నిర్మాణ క‌ర్త‌లు – మంత్రి పొంగులేట
  • ఇందిర‌మ్మఇండ్ల పై ఎఐసిసి అధ్య‌క్షులు ఖ‌ర్గే ఆరా
  • ఖ‌ర్గేను ప‌రామ‌ర్శించిన మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి

హైద‌రాబాద్ : రాష్ట్రంలో ఇందిర‌మ్మ ఇండ్ల ప‌ధ‌కం విజ‌య‌వంతంగా అమలవుతోంద‌ని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి అన్నారు. ఇటీవల అనారోగ్యానికి గురై బెంగుళూరులో విశ్రాంతి తీసుకుంటున్న అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీ మల్లికార్జున ఖర్గే గారి మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి గారు మంగ‌ళ‌వారం పరామ‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా ఇందిర‌మ్మ ఇండ్ల ప‌ధ‌కం అమ‌లు, చెల్లింపులు ల‌బ్దిదారుల‌ ఎంపిక విధానం, ఒక్కో ఇంటికి యూనిట్ కాస్ట్ త‌దిత‌ర‌ అంశాల‌పై ఖ‌ర్గే గారు మంత్రిని అడిగి తెలుసుకున్నారు. భార‌త‌దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే పేద‌ల‌కు ఐదు ల‌క్ష‌ల రూపాయిల‌తో ఇందిర‌మ్మ ఇంటిని నిర్మించుకునే స‌దుపాయాన్ని క‌ల్పించింది. ఇండ్ల ప‌ధ‌కాల‌లో కేంద్రం ఇస్తున్న నిధుల‌తోనే అన్ని రాష్ట్రాలు స‌రిపెడుతున్నాయ‌ని కానీ తెలంగాణ రాష్ట్రంలో పేద‌ల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఐదు ల‌క్ష‌ల రూపాయిల‌తో నాలుగు వంద‌ల చ‌ద‌ర‌పు అడుగులు త‌గ్గ‌కుండా ఇండ్ల‌ను ల‌బ్దిదారుడే నిర్మించుకునేలా ప‌ధ‌కాన్ని రూపొందించామ‌ని ఈ సంద‌ర్భంగా మంత్రి వివ‌రించారు.

రాష్ట్రంలో గ‌డ‌చిన ప‌ది సంవ‌త్స‌రాల‌లో పేద‌లు ఆశించిన మేర‌కు ఇండ్ల నిర్మాణాలు జ‌ర‌గ‌క‌పోవ‌డంతో ఇందిర‌మ్మ ఇండ్ల‌కు డిమాండ్ అధికంగా ఉంద‌ని అన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని మొద‌టి ద‌శ‌లో ఈ ఏడాది 22,500 కోట్ల రూపాయిల‌తో నియోజ‌క‌వ‌ర్గానికి 3500 ఇండ్ల చొప్పున 4.50 ల‌క్ష‌ల ఇండ్ల‌ను నిర్మించాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్నామ‌ని ల‌బ్దిదారుల ఎంపిక పూర్తికాగా దాదాపు 2 ల‌క్ష‌ల‌కు పైగా ఇండ్లు వివిధ నిర్మాణ ద‌శ‌ల్లో ఉన్నాయ‌ని తెలిపారు. గ‌త నెల‌లో గౌర‌వ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఇందిర‌మ్మ ఇండ్ల గృహ‌ప్ర‌వేశాల‌కు స్వ‌యంగా హాజ‌రయ్యార‌ని వివ‌రించారు. ఇంటి నిర్మాణ ద‌శ‌ల‌ను బ‌ట్టి ల‌బ్దిదారుల‌కు ప్ర‌తి సోమ‌వారం నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో నిధుల‌ను జ‌మ చేస్తున్నామ‌ని తెలిపారు. రాజ‌కీయాల‌కు అతీతంగా ల‌బ్దిదారుల ఎంపిక‌లో పార‌ద‌ర్శ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నాం, పేద‌రిక‌మే అర్హ‌త‌గా ఇండ్ల‌ను మంజూరు చేస్తున్నాం. అడ‌వుల‌ను న‌మ్ముకొని జీవించే చెంచుల‌కు సైతం తొలిసారిగా ఇందిర‌మ్మ ఇండ్ల‌ను మంజూరు చేశామ‌న్నారు. ఇందిర‌మ్మ ఇండ్ల ప‌ధ‌కంలో ఎటువంటి అవినీతి అక్ర‌మాలు చోటుచేసుకోకుండా ఎప్ప‌టిక‌ప్ప‌డు స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించేందుకు గాను ప్ర‌త్యేకంగా ఒక కాల్ సెంట‌ర్‌ను ఇటీవ‌ల ఏర్పాటు చేశామ‌ని , కాల్ సెంట‌ర్‌కు వచ్చే ఫిర్యాదుల‌పై 24 గంట‌ల్లోనే చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని తెలిపారు.
ఇందిర‌మ్మ ఇండ్ల ప‌ధ‌కం అమ‌లు తీరుతెన్నుల‌ను మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి స‌విరంగా వివ‌రించ‌గా ఖ‌ర్గే స్పందిస్తూ తెలంగాణ రాష్ట్రంలో ఇందిర‌మ్మ ఇండ్ల ప‌ధ‌కం అమ‌లు బాగుంద‌ని ఇదే విధంగా ముందుకు సాగాల‌ని మంత్రి పొంగులేటిని అభినందించారు.