కరీంనగర్‌లో ఎసిబికి చిక్కిన అధికారులు

కరీంనగర్ జిల్లా కేంద్రంలోని డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసులో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. మంగళవారం నిర్వహించిన ఏసీబీ దాడులలో లంచం తీసుకుంటుండగా ఇద్దరు అధికారులను రెడ్‌హ్యండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం… కరీంనగర్ లోని విజేత హాస్పిటల్‌లో ఫార్మసీ వార్షిక తనిఖీ నిర్వహించినందుకు గాను ఫిర్యాదుదారుడు పుల్లూరి రాములు ద్వారా డ్రగ్స్ కంట్రోల్ అసిస్టెంట్ డైరెక్టర్ మర్యాల శ్రీనివాస్, డ్రగ్స్ ఇన్‌స్పెక్టర్ కార్తీక్ భరద్వాజ్‌లు 20వేల రూపాయలు డిమాండ్ చేశారు. దీంతో సదరు ఫిర్యాదుదారుడు ఏసీబీ అధికారులను సంప్రదించారు. అనంతరం ఏసీబీ అధికారుల సూచనతో సదరు ఫిర్యాదుదారుడు 20వేల రూపాయలు సదరు అధికారులు నియమించుకున్న పుల్లూరి రాములుకు రూ.20,000 అందించారు. పుల్లూరి రాములు సదరు ఇద్దరు అధికారులకు ఫిర్యాదుదారు నుండి తీసుకున్న నగదు ఇవ్వగా వెంటనే ఏసీబీ అధికారులు దాడులు చేసి రెడ్ హ్యండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం లంచం తీసుకుంటూ పట్టుబడిన అధికారులతో పాటు సహకరించిన సదరు నిందితున్ని అరెస్టు చేసి గౌరవ ఏసీబీ కోర్టులో హాజరు పరిచారు. కేసు దర్యాప్తు కారణంగా ఫిర్యాదుదారుని పేరును వెల్లడించడానికి ఏసీబీ అధికారులు నిరాకరించారు. ఈ సందర్భంగా ఎవరైనా అధికారులు లంచం డిమాండ్ చేసినట్లయితే ఎసిబి ట్రోల్ ప్రీ నెంబర్ 1064కు సంప్రదించాలని కోరారు. తెలంగాణ ఏసీబీ సోషల్ మీడియా వాట్సాప్ నెంబర్ 9440446106, తెలంగాణ ఎసిబి ఫేస్‌బుక్ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చని ఏసీబీ అధికారులు తెలిపారు.