హైకోర్టు స్టేకు నిరసనగా 14న తెలంగాణ బంద్‌: ఎంపీ ఆర్‌.కృష్ణయ్య

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు కల్పించిన 42% రిజర్వేషన్లపై హైకోర్టు స్టే ఇవ్వడాన్ని నిరసిస్తూ అన్ని బీసీ సంఘాలతో కలిసి ఈ నెల 14న రాష్ట్ర బంద్‌ నిర్వహిస్తున్నట్లు బీసీ నేత, ఎంపీ ఆర్‌.కృష్ణయ్య ప్రకటించారు. బంద్‌కు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వాలని కోరారు. శుక్రవారం హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌లో బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం ఆధ్వర్యంలో 22 బీసీ సంఘాల సమావేశం నిర్వహించారు. ఇందులో ఎమ్మెల్సీ మధుసూదనాచారి, మాజీ మంత్రి శ్రీనివా్‌సగౌడ్‌తో కలిసి ఆర్‌.కృష్ణయ్య మాట్లాడారు. బీసీ రిజర్వేషన్ల సాధన ఇప్పుడు ప్రజా ఉద్యమంగా మారిందన్నారు. ఎన్నికల నోటిఫికేషన్‌ ఇచ్చిన తర్వాత హైకోర్టు ఏకపక్షంగా స్టే ఇవ్వడం దుర్మార్గమని విమర్శించారు. మి లియన్‌ మార్చ్‌ తరహాలో బీసీ ఉద్యమాన్ని నిర్వహించడానికి కార్యాచరణ రూపొందిస్తున్నామని, శాంతియుతంగా ఈ ఉద్యమం చేపడతామన్నారు. ఇటు సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో, విద్యానగర్‌లోని బీసీ భవన్‌లో బీసీ సంఘాల సమావేశాల్లోనూ ఇదే విషయమై ఆయన మాట్లాడారు. మధుసూదనాచారి మాట్లాడుతూ.. బీసీలు బిచ్చగాళ్లు కాదని.. వాటాదారులనే వాస్తవాన్ని పాలకులు గ్రహించాలన్నారు. రాజ్యాధికారంతోనే బీసీల సమస్యలు పరిష్కారమవుతాయని చెప్పారు. 42% రిజర్వేషన్లు బీసీలకు కల్పించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని శ్రీనివాస్‌గౌడ్‌ డిమాండ్‌ చేశారు.

13న జాతీయ రహదారుల దిగ్బంధం: జాజుల శ్రీనివాస్‌గౌడ్‌
బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టేను నిరసిస్తూ ఈనెల 13న రాష్ట్రవ్యాప్తంగా జాతీయ రహదారులను దిగ్బంధం చేయాలని నిర్ణయించినట్లు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌ గౌడ్‌ వెల్లడించారు. బీసీ ఉద్యమాన్ని ఉధృతం చేయనున్నట్లు తెలిపారు. మీడియాతో జాజుల మాట్లాడుతూ.. శనివారం మధ్యాహ్నం బంజారాహిల్స్‌ కళింగభవన్‌లో అఖిలపక్ష పార్టీలు, బీసీ సంఘాలు, కుల సంఘాల నేతలు, మేధావులతో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు చెప్పారు.