ఎస్సారెస్పీ ఫేజ్‌ 2కు మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి పేరు: సీఎం రేవంత్‌రెడ్డి

శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు (ఎస్సారెస్పీ) ఫేజ్‌-2కు దివంగత మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి (ఆర్డీఆర్‌) పేరు పెడతామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఇదే ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి అన్నారు. ఆదివారం దామోదర్‌రెడ్డి దశదిన కర్మ సందర్భంగా సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో జరిగిన సంతాపసభకు సీఎం రేవంత్‌ హాజరై మాట్లాడారు. తుంగతుర్తి, సూర్యాపేట ప్రాంతాలు నీటి సౌకర్యం లేక ఎడారిగా మారే ప్రమాదం ఉందని, ప్రజలకు నివాసయోగ్యం కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) నివేదిక ఇచ్చిందని, దీంతో దామోదర్‌రెడ్డి ఈ ప్రాంతానికి గోదావరి జలాలు తీసుకువచ్చి సస్యశ్యామలం చేయాలన్న ఆలోచన చేశారని తెలిపారు. ఫ్లోరైడ్‌ భూతాన్ని తరమడంలో దామోదర్‌రెడ్డి ఎంతో కృషి చేశారని, శ్రీరాంసాగర్‌ జలాలను కరీంనగర్‌, వరంగల్‌తోపాటు నల్లగొండ (ప్రస్తుత సూర్యాపేట) జిల్లాకు ఇవ్వాలంటూ పోరా డారని గుర్తు చేశారు. నల్లగొండలో గోదావరి జలాలు ప్రవహిస్తున్నాయంటే అది దామన్న వల్లేనన్నారు. చంద్రబాబునాయుడు సీఎంగా ఉన్నప్పుడు దామోదర్‌రెడ్డి నాటి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఎస్సారెస్పీ ఫేజ్‌-2కు శంకుస్థాపన చేయించారని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. అనంతరం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి అధికారంలోకి వచ్చాక ఆయన క్యాబినెట్‌లో మంత్రిగా ఉన్న దామోదర్‌రెడ్డి వైఎస్సార్‌పై ఒత్తిడి తెచ్చి.. కాల్వల నిర్మాణం పూర్తిచేయించారని పేర్కొన్నారు. గోదావరి జలాల కోసం ఇంతగా పోరాడిన దామోదర్‌రెడ్డి పేరును ఆ ప్రాజెక్టుకు పెడుతూ ‘ఆర్డీఆర్‌ ఎస్సారెస్పీ ఫేజ్‌-2’గా నామకరణం చేస్తున్నామని సీఎం ప్రకటించారు. ఇందుకు సంబంధించి 24 గంటల్లో జీవో విడుదల చేస్తామన్నారు. దామోదర్‌రెడ్డి కుటుంబానికి ‘గాంధీ’ కుటుంబం అండగా ఉంటుందని, ఆర్డీఆర్‌ మృతి పట్ల సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, మల్లికార్జున ఖర్గే ఈ విషయం చెప్పారని తెలిపారు. దామోదర్‌రెడ్డి కుమారుడు సర్వోత్తమ్‌రెడ్డికి రాజకీయంగా అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌, కోమటిరెడ్డి, పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి పాల్గొన్నారు.