రెవెన్యూలో విప్ల‌వాత్మ‌క సంస్క‌ర‌ణ‌లు: మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

హైద‌రాబాద్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచ‌న‌ల‌కు అనుగుణంగా రాష్ట్రంలో భూ స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం రెవెన్యూ వ్య‌వ‌స్ధ‌లో విప్ల‌వాత్మ‌క‌మైన సంస్క‌ర‌ణ‌ల‌ను చేప‌ట్టామ‌ని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. బుధ‌వారం నాడు డాక్టర్ బి.ఆర్‌. అంబేద్కర్ స‌చివాల‌యంలో డిప్యూటీ క‌లెక్ట‌ర్ ల నుంచి స్పెష‌ల్ గ్రేడ్ డిప్యూటీ క‌లెక్ట‌ర్‌లుగా పదోన్న‌తి పొందిన 13 మంది అధికారులు మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డిని క‌లిసి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ ప్ర‌జ‌ల ఆశ‌లు , ఆకాంక్ష‌ల‌కు అనుగుణంగా త‌మ ప్ర‌భుత్వం చేప‌ట్టిన సంస్క‌ర‌ణ‌లు క్షేత్ర‌స్ధాయిలో ప‌క‌డ్బందీగా అమ‌లు చేయాల‌ని అప్పుడే ప్ర‌భుత్వ ల‌క్ష్యం నెర‌వేరుతుంద‌ని అన్నారు. సాదాబైనామాల ద‌ర‌ఖాస్తుల ప‌రిష్కారానికి భూభార‌తి చ‌ట్టంలో స్ప‌ష్ట‌మైన నిబంధ‌న‌ల‌ను రూపొందించ‌డం జ‌రిగింద‌ని దీనికి అనుగుణంగా సాదాబైనామా ద‌ర‌ఖాస్తుల‌ను వీలైనంత త్వ‌రిత‌గ‌తిన పరిష్క‌రించాల‌ని సూచించారు.
గ‌త ప్ర‌భుత్వంలో సాదా బైనామాల‌కు సంబంధించి ద‌ర‌ఖాస్తుల‌ను స్వీకరించారుకానీ 2020 ఆర్వోఆర్ చ‌ట్టంలో ప‌రిష్కారం చూపించ‌లేద‌ని ఫ‌లితంగా 9.26 ల‌క్ష‌ల ద‌ర‌ఖాస్తులు ప‌రిష్కారం కాకుండా పోయాయ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. దీనిపై కొంత మంది హై కోర్టును ఆశ్ర‌యించగా స్టే విధించింద‌ని దీనిపై ఇటీవ‌ల కోర్టు స్టేను తొల‌గించడం జ‌రిగింద‌న్నారు.
త‌మ ప్ర‌భుత్వం ఉద్యోగుల‌తో స్నేహ‌పూర్వ‌కంగా ఉంటుంద‌ని రెవెన్యూ విభాగంలో వీలైనంత‌వ‌ర‌కూ అన్ని కేడ‌ర్ల‌లో ప‌దోన్న‌తులు క‌ల్పించడం జ‌రిగింద‌న్నారు. ప‌దోన్న‌తులు పొందిన‌వారు ప్ర‌జ‌ల‌తో మ‌మేక‌మై రెట్టించిన ఉత్సాహంతో ప‌నిచేయాల‌ని సూచించారు.