జ‌ర్న‌లిస్టుల‌ సంక్షేమానికి అత్యంత ప్రాధాన్య‌త‌: మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి

  • త్వ‌ర‌లో అక్రిడిటేష‌న్ పాల‌సీ

హైద‌రాబాద్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమం కోసం నిరంతరం ప‌నిచేస్తుంద‌ని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. పాత్రికేయుల కోసం ప్ర‌భుత్వం అమ‌లు చేసే సంక్షేమ కార్య‌క్ర‌మాలు అర్హులైన జ‌ర్న‌లిస్టుల‌కు అందేలా విధి విధానాల‌ను రూపొందిస్తున్నామ‌ని తెలిపారు. బుధ‌వారం నాడు డాక్టర్ బి.ఆర్‌. అంబేద్కర్ స‌చివాల‌యంలో మీడియా అకాడ‌మీ ఛైర్మన్ కె.శ్రీ‌నివాస‌రెడ్డి, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ క‌మీష‌న‌ర్ సిహెచ్‌. ప్రియాంక, సిపిఆర్‌వో మ‌ల్సూర్‌ తో క‌లిసి అక్రిడిటేష‌న్ పాల‌సీపై సుదీర్ఘంగా చ‌ర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అర్హులైన జ‌ర్న‌లిస్టుల గౌర‌వాన్ని కాపాడేవిధంగా శాస్త్రీయ ప‌ద్ద‌తిలో అక్రిడిటేష‌న్ పాల‌సీ ఉండాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. వీలైనంత త్వ‌ర‌గా అక్రిడిటేష‌న్ కార్డుల‌ను జారీ చేయ‌డానికి ఈనెల చివ‌రినాటికి పాల‌సీ విధివిధానాల‌ను కొలిక్కితీసుకురావాల‌ని ఆదేశించారు.