మంత్రి కొండా సురేఖ ఇంటి వద్ద హైడ్రామా

  • ఆమె మాజీ ఓఎస్టీ సుమంత్ ను అరెస్టు చేసేందుకు వెళ్లిన పోలీసులు
  • అర్ధరాత్రి హైడ్రామా
  • మంత్రి కూతురు సుస్మిత ఫైర్
  • దీని వెనక సీఎం, మంత్రితో పాటు మరో ఇద్దరి ప్రమేయం ఉందని ఆరోపణ

జూబ్లీహిల్స్ లోని మంత్రి కొండా సురేఖ ఇంటి వద్ద బుధవారం రాత్రి హైడ్రామా నెలకొన్నది. మంత్రి మాజీ ఓఎస్టీ సుమంత్ ను అరెస్ట్ చేయడానికి వెళ్లిన పోలీసులతో మంత్రి కూతురు సుస్మిత వాగ్వాదానికి దిగడం చర్చనీయాంశంగా మారింది. హుజూర్ నగర్ కు చెందిన డెక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీ నిర్వాహకులను సుమంత్ బెదిరించాడని వచ్చిన ఫిర్యాదుతో.. కేసు నమోదు చేసిన పోలీసులు.. అతడిని అరెస్ట్ చేసేందుకు రెండు రోజులుగా గస్తీ పెట్టినట్టు తెలుస్తున్నది. మంత్రి కొండా సురేఖ నివాసం వద్ద కూడా మఫ్టీ పోలీసులను గస్తీలో ఉన్నట్టు సమాచారం. అయితే మంత్రి ఇంటికి సుమంత్ వచ్చాడని తెలుసుకొని బుధవారం రాత్రి పోలీసులు అక్కడికి మఫ్టీలో వెళ్లారు. దీంతో మంత్రి కుమార్తె సుస్మిత వారితో వాగ్వాదానికి దిగినట్టు తెలుస్తున్నది. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో చెప్పాలని అడిగినట్టు సమాచారం. ‘మఫ్టీలో ఏం చేస్తున్నారు. యూనిఫాంలో లేకున్నా పోలీసులు కాబట్టి గౌరవిస్తున్నాం. పోలీస్ కేసులు మాకు కొత్త కాదు’ అని అన్నట్టు సమాచారం. ఈ వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

అమ్మపై కుట్రలు చేస్తున్నారు: సుస్మిత
సీఎం రేవంత్ రెడ్డికి నమ్మకంగా ఉండటం తప్పా అని సుస్మితా ప్రశ్నించారు. హుజూర్ నగర్ నియోజకవర్గంలో డెక్కన్ సిమెంట్ కంపెనీ ఫైల్ విషయంలో ఓ వ్యక్తిని పాయింట్ బ్లాంక్ రేంజ్ లో రివాల్వర్ పెట్టి సుమంత్ బెదిరించినట్టుగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫిర్యాదు చేశారంటూ టాస్క్ ఫోర్స్ పోలీసులు చెప్పారని ఆమె పేర్కొన్నారు. ఇదే విషయంలో తాము మంత్రి ఉత్తమ్ కు ఫోన్ చేస్తే.. తాను ఎలాంటి కంప్లయింట్ ఇవ్వలేదని చెప్పడం ఆశ్చర్యంగా ఉందన్నారు. రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లపై రాహుల్ గాంధీ, ప్రభుత్వ పెద్దలు స్పీచులు దంచుతున్నారని, కానీ బీసీ బిడ్డ అని చూడ కుండా మా అమ్మపై అందరూ కుట్రలు చేస్తున్నారని కామెంట్ చేశారు. ఈ మొత్తం ఎపిసోడ్ లో వేం నరేందర్ రెడ్డి, కడియం శ్రీహరి, సీఎం రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఇన్వాల్వ్ మెంట్ ఉందని సుస్మిత సంచలన ఆరోపణలు చేశారు. కాగా, ఇంట్లో టాస్క్ ఫోర్స్ పోలీసులు ఉండగానే.. కొండా సురేఖ తన కారులో సుమంత్ ను వెంటపెట్టుకుని బయటకు వెళ్లిపోయారు.

మంత్రి ఉత్తమ్ ఫిర్యాదుతోనే..: కొండా సురేఖ
కాగా, ఈ వివాదంపై మీడియా మంత్రి కొండా సురేఖను ప్రశ్నించగా.. దక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీ వ్యవహారంలో తన మాజీ ఓఎస్టీ సుమంత్పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫిర్యాదు చేశారని ఆమె తెలిపారు. అయితే కొండా సురేఖ వ్యాఖ్యలను మంత్రి ఉత్తమ్ ఖండించారు. తాను ఎవరిపై ఎలాంటి ఫిర్యాదు చేయలేదని స్పష్టం చేశారు.