ఏసీబీ వలలో నల్లగొండ స్టేషన్‌ ఫైర్‌ ఆఫీసర్‌

టపాసుల దుకాణానికి అనుమతి ఇచ్చేందుకు లంచం తీసుకున్న స్టేషన్‌ ఫైర్‌ ఆఫీసర్‌ అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులకు చిక్కిన ఘటన గురువారం నల్లగొండ జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. ఏసీబీ డీఎస్పీ జగదీ్‌షచంద్ర వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లా కేంద్రంలోని నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో తాత్కాలిక టపాసుల దుకాణం ఏర్పాటుకు అనుమతి కోసం ఓ వ్యక్తి జిల్లా కేంద్రంలోని అగ్నిమాపక కేంద్రంలో దరఖాస్తు చేసుకున్నారు. అనుమతి ఇచ్చేందుకు స్టేషన్‌ ఫైర్‌ ఆఫీసర్‌ ఏమిరెడ్డి సత్యనారాయణరెడ్డి రూ.10 వేలు డిమాండ్‌ చేశారు. రూ.8 వేలు ఇస్తాననడంతో.. గురువారం సాయంత్రం ఎన్‌జీ కళాశాల ఆవరణలో తన ద్విచక్ర వాహనంలో ఆ మొత్తం పెట్టాలని సత్యనారాయణరెడ్డి సూచించారు. బాధితుడు ఈ విషయాన్ని ఏసీబీ అధికారులకు చెప్పారు. వారి సూచనల మేరకు ద్విచక్ర వాహనం ముందు భాగంలో రూ.8వేల నగదు ఉంచగా… సత్యనారాయణరెడ్డి వెళ్లి ఆ నగదు తీసుకుని పర్సులో పెట్టుకున్న సమయంలో ఏసీబీ సిబ్బంది ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అగ్నిమాపక కార్యాలయానికి తీసుకెళ్లి ఫైల్స్‌ స్వాధీనం చేసుకుని తనిఖీలు చేశారు.