భూప‌రిపాలనలో మరో ముంద‌డుగు: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

  • ప్రతి మండలానికి లైసెన్స్‌డ్‌ సర్వేయర్లు
  • 19న ముఖ్య‌మంత్రి గారి చేతుల‌మీదుగా లైసెన్సుల పంపిణీ

హైదరాబాద్‌: తెలంగాణ ప్ర‌జ‌ల‌కు ముఖ్యంగా రైతాంగానికి మెరుగైన సేవ‌ల‌ను అందించ‌డానికి, రాష్ట్రంలో భూముల‌కు సంబంధించిన అనేక పంచాయితీల‌కు శాశ్వ‌త ప‌రిష్కారం చూపాల‌నే ల‌క్ష్యంతో ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి ఆలోచ‌న‌ల‌కు అనుగుణంగా రెవెన్యూ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు శ్రీ‌కారం చుట్టామ‌ని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
ఇందులో భాగంగా గ్రామ రెవెన్యూ వ్య‌వ‌స్ధ‌ను బ‌లోపేతం చేసే దిశ‌గా ఇప్ప‌టికే గ్రామ‌పాల‌నాధికారులు ( జీపీవో)ను అందుబాటులోకి తీసుకురాగా తాజాగా క్షేత్ర‌స్ధాయిలో ప్రజలకు సులభంగా భూ సేవలు అందేలా ప్రతి మండలానికి కనీసం 4 నుంచి 6 మంది లైసెన్స్‌డ్‌ సర్వేయర్లను నియమిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నామ‌ని వెల్ల‌డించారు.
ఈనెల 19వ తేదీన శిల్ప క‌ళావేదిక‌లో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా శిక్ష‌ణ పొందిన లైసెన్స్‌డ్ స‌ర్వేయ‌ర్ల‌కు లైసెన్స్‌లు పంపిణీ చేయ‌నున్న‌ట్లు తెలిపారు. రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకువచ్చిన భూభారతి చట్టంలో రిజిస్ట్రేషన్ సమయంలో భూమి సర్వే మ్యాప్ ను జ‌త ప‌ర‌చ‌డం తప్పనిసరి చేసిన నేప‌ధ్యంలో స‌ర్వే విభాగం పాత్ర మ‌రింత క్రియాశీలం కానుంద‌న్నారు. భూభార‌తి చ‌ట్టంలో పేర్కొన్న‌విధంగా ప్ర‌భుత్వ ల‌క్ష్యం నెర‌వేరాలంటే ప్ర‌స్తుతం ఉన్న 350 మంది స‌ర్వేయ‌ర్లు స‌రిపోర‌ని, మ‌రికొంత మంది స‌ర్వేయ‌ర్లు అవ‌స‌ర‌మ‌వుతార‌ని అన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని ఒక వైపు లైసెన్స్‌డ్ స‌ర్వేయ‌ర్ల‌ను తీసుకోవ‌డం, మ‌రోవైపు స‌ర్వే విభాగంలో ఖాళీగా ఉన్న స‌ర్వేయ‌ర్ పోస్టులు భ‌ర్తీచేయ‌డం, ఇంకోవైపు భూముల స‌ర్వేకు అవ‌స‌ర‌మైన అత్యాధునికి ప‌రిక‌రాల‌ను అందుబాటులోకి తీసుకురావ‌డానికి చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని తెలిపారు.
శుక్ర‌వారం నాడు స‌చివాలయంలోని త‌న కార్యాల‌యంలో రెవెన్యూశాఖ కార్య‌ద‌ర్శి డిఎస్ లోకేష్‌కుమార్‌, స‌ర్వే విభాగం క‌మీష‌న‌ర్ రాజీవ్ గాంధీ హ‌నుమంత్ తో క‌లిసి నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రిగారు మాట్లాడుతూ గౌర‌వ ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి గారి సూచ‌న మేర‌కు అవ‌స‌ర‌మైన స‌ర్వేయ‌ర్ల‌ను అందుబాటులోకి తీసుకురావ‌డానికి ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానించ‌గా ప‌ది వేల మంది ద‌ర‌ఖాస్తు చేసుకోగా తొలివిడ‌త‌లో ఏడు వేల మందికి శిక్ష‌ణ ఇచ్చామ‌ని ఇందులో 3465 మంది అర్హ‌త సాధించార‌ని తెలిపారు. భూ విస్తీర్ణాన్ని బ‌ట్టి ప్ర‌తి మండ‌లానికి 4 నుంచి 6 మంది లైసెన్స్‌డ్ స‌ర్వేయ‌ర్ల‌ను నియ‌మిస్తామ‌ని తెలిపారు. రెండ‌వ విడ‌త‌లో మ‌రో మూడు వేల మందికి ఆగ‌స్టు 18వ తేదీ నుంచి శిక్ష‌ణను ప్రారంభించామ‌ని ఈనెల 26వ తేదీన జేఎన్‌టీయూ ఆధ్వ‌ర్యంలో అర్హ‌త ప‌రీక్ష నిర్వ‌హిస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. ఈ ప‌రీక్ష‌లో అర్హ‌త సాధించిన వారికి 40 రోజుల పాటు అప్రంటిస్ శిక్ష‌ణ ఉంటుంద‌ని వీరి సేవ‌లు కూడా డిసెంబ‌ర్ రెండ‌వ వారం నాటికి అందుబాటులోకి వ‌స్తాయ‌ని వెల్ల‌డించారు.
రెవెన్యూ శాఖకు సర్వే విభాగానికి అవినాభావ సంబంధం ఉంటుంద‌ని భూముల కొలతలు, రికార్డులు స్పష్టంగా ఉన్న‌ప్పుడే వివాదాలు తగ్గుతాయ‌ని సర్వే వ్యవస్థ బలపడితేనే ప్రజలకు భద్రత, న్యాయం లభిస్తుందన్నారు. గత పది సంవత్సరాలుగా సర్వే విభాగం నిర్లక్ష్యానికి గురైందని, క్షేత్ర‌స్దాయిలో సిబ్బంది లేకపోవడం వల్ల ప్రజలకు తగిన సేవలు అందలేదని గుర్తుచేశారు. ప్రతి రెవెన్యూ గ్రామంలో జీపీవోలు, ఇప్పుడు ప్రతి మండలంలో లైసెన్స్‌డ్ సర్వేయర్లు – ఈ రెండు చర్యలతో ప్రజలకు అవసరమైన భూ సంబంధిత సేవలు అందేలా వ్యవస్థను పటిష్టం చేయడమే లక్ష్యమని మంత్రి గారు స్పష్టం చేశారు. భూమి రికార్డులు స్పష్టంగా ఉండేలా, ప్రజలకు ఇబ్బంది లేకుండా, అవినీతి లేని సేవలు అందించడమే త‌మ ప్ర‌భుత్వ సంక‌ల్ప‌మ‌ని ” మంత్రి పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి అన్నారు.