ప్రజలకు తెలంగాణ పోలీసుల కీలక సూచన

సైబర్ నేరాల నియంత్రణకు ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోంది. కానీ ఈ నేరాల బారిన పడిన వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. అలాగే భారీగా లోన్ యాప్‌లు సైతం పెరిగాయి. వీటిలో అసలు ఏదో.. నకిలీది ఏదో తెలుసుకోలేని పరిస్థితి నెలకొంది. దీంతో తెలంగాణ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ సందర్భంగా ప్రజలకు తెలంగాణ పోలీసులు కీలక సూచనలు చేశారు. అన్ని ఇన్‌స్టాంట్‌ లోన్ యాప్స్ సురక్షితం కాదని స్పష్టం చేసింది. సులభంగా లోన్ వస్తుందంటే.. నమ్మొద్దని సూచించింది. ఒక్క లింక్ క్లిక్‌ చేస్తే.. లోన్ వస్తుందనేది అబద్ధమని తెలిపింది. రుణం కోసం కనిపించిన యాప్స్ అన్నీ డౌన్ లోడ్ చేయవద్దని పేర్కొంది. ఏపీకే ఫైల్స్‌ను అసలు ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేయొద్దని వివరించింది. యాప్స్‌కు మీ మొబైల్‌లో అసలు అనుమతి ఇవ్వవద్దంది. లోన్ కంటే మీ వ్యక్తిగత డేటా చాలా ముఖ్యమనే విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తించుకోవాలని తెలంగాణ పోలీసులు కీలక సూచన చేసింది.

మరోవైపు సైబర్ నేరగాళ్లు అనేక నకిలీ యాప్‌ల ద్వారా రుణాల పేరుతో ఆకర్షిస్తున్నారు. నకిలీ వెబ్ సైట్లు, సోషల్ మీడియా ప్రకటనలు, ఫోన్ కాల్స్ ద్వారా సంప్రదింపులు జరుపుతారు. వెంటనే లోన్ ఆమోదం, స్వల్ప వడ్డీ రేట్ల పేరుతో వల వేస్తారు. రుణం ఆమోదం కోసం ముందుగా కొంత చెల్లించాలని చెబుతారు. అలా నగదు దోచుకుంటారు. లేకుంటే లోన్ తీసుకునే వ్యక్తికి సంబంధించిన వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలిస్తారు. అలా లోన్ తీసుకున్న వారు.. ఆ తర్వాత నుంచి వివిధ మార్గాల్లో వేధింపులకు గురవుతారు. తీసుకున్న లోన్ చెల్లించిన సరే.. ఇంకా చెల్లించాల్సిన నగదు బకాయిలుగా ఉందంటూ ఒత్తిడి చేస్తారు. దీంతో తీవ్ర ఒత్తిడిని తట్టుకోలేక లోన్ తీసుకున్న వారు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఈ తరహా ఘటనలు తెలుగు రాష్ట్రాల్లో అత్యధికమయ్యాయి. ఇలా బాధితులుగా మారిన వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ పోలీసులు.. ప్రజలకు ఈ కీలక సూచనలు చేశారు.