ఏసీబీ అధికారులమంటూ మోసం

  • 10.5 లక్షలు సమర్పించుకున్న ఇద్దరు ఆర్టీఏ అధికారులు

‘హాలో నేను ఏసీబీ డీఎస్పీని మాట్లాడుతున్న.. మీరు లంచం డబ్బులు బాగా తీసుకుంటున్నారట.. మీ మీద ఫిర్యాదు వచ్చింది.. సెటిల్‌ చేసుకోండి.. అర్జెంట్‌గా డబ్బులు ఆన్‌లైన్‌లో అకౌంట్‌కు పంపించండి’ అంటూ.. ఓ ఆగంతకుడు కొద్దిరోజుల క్రితం వరంగల్‌ జిల్లాలో ఇద్దరు అధికారులకు ఫోన్లు చేయడంతో రూ.10.5 లక్షలు సమర్పించుకున్నారు. మోసపోయామని తెలిసి పోలీసులను ఆశ్రయించారు. వివరాలిలా.. రెండు వారాల క్రితం అవినీతి నిరోధక శాఖ డీఎస్పీ అని గుర్తుతెలియని వ్యక్తి 9886826656, 9880472272, 9591938585 నంబర్ల నుంచి వరంగల్‌ జిల్లా ఆర్టీఏ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్న ఇద్దరు అధికారులకు ఫోన్లు వచ్చాయి. ‘మీ మీద ఫిర్యాదు వచ్చింది’ అని అవతలి వ్యక్తి బెదిరించాడు. నిజమేనని నమ్మిన ఓ అధికారి ఉద్యోగ విరమణకు దగ్గరగా ఉన్నందున మూడు దఫాలుగా రూ.10 లక్షలు, మరో అధికారి రూ. 50 వేలు ఆగంతకుడి బ్యాంక్‌ అకౌంట్‌కు బదిలీ చేశారు. అతడు మళ్లీ మళ్లీ డబ్బులు డిమాండ్‌ చేయడంతో నకిలీ డీఎస్పీ అని తెలుసుకున్నారు. మోసపోయిన అధికారుల్లో ఒకరు రెండు రోజుల క్రితం వరంగల్‌లోని మిల్స్‌కాలనీ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

ఈ విషయమై ఇన్‌స్పెక్టర్‌ బొల్లం రమేశ్‌ను వివరణ కోరగా ఆర్టీఏ అధికారి నుంచి ఫిర్యాదు వచ్చిందని తెలిపారు. ఇద్దరు అధికారులు రూ.10.5 లక్షలు నకిలీ ఏసీబీ అధికారికి ఆన్‌లైన్‌ ట్రాన్స్‌ఫర్‌ చేసి మోసపోయారని, ఈ కేసుపై విచారణ చేస్తున్నామని పేర్కొన్నారు. ఆగంతకుడి ఫోన్‌ నంబర్ల లొకేషన్‌ ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు. సదరు వ్యక్తి కర్ణాటక నుంచి రాయలసీమ యాసలో మాట్లాడినట్టు గుర్తించారు. ఈ విషయంపై ఏసీబీ డీఎస్పీ సాంబయ్యను వివరణ కోరగా.. ఇద్దరు ఎంవీఐలకు గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్‌ చేస్తే డబ్బులు పంపించారని చెప్పారు. ఏసీబీ అధికారులు ప్రభుత్వ అధికారులకు ఫోన్‌ చేసి డబ్బులు అడగరని ఎన్నిసార్లు చెప్పినా ఇదేవిధంగా మోసపోతున్నారని, ఇలాంటి ఫోన్‌కాల్స్‌ వస్తే పోలీసులతో పాటు ఏసీబీ అధికారులను ఆశ్రయించాలని సూచించారు.