విద్యలో పెట్టుబడి… భవిష్యత్తుకు బలమైన పునాది: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

  • గౌలీదొడ్డి – క్రమశిక్షణకు మారుపేరు, విద్యా విలువలకు నిలయం

హైదరాబాద్: “విద్యలో పెట్టుబడి పెట్టడం అంటే భవిష్యత్తును నిర్మించడం” అనే సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాటలను సాకారం చేస్తున్నారనీ రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. బుధవారం ఎస్‌.ఆర్‌. శంకరన్ జయంతి సందర్భంగా గౌలీదొడ్డి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (COE) కళాశాలలో విద్యార్థులతో మమేకమై, విద్యా ప్రాముఖ్యతపై స్ఫూర్తిదాయక సందేశం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెనపూడి గాంధీ, ప్రిన్సిపాల్ అంజన్న , కల్పన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ సామాజిక న్యాయానికి ప్రతీక – ఎస్‌.ఆర్‌. శంకరన్. ఎస్‌.ఆర్‌. శంకరన్ దేశంలోని అత్యున్నత సేవా తపన కలిగిన సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి. పేదలు, దళితులు, గిరిజనులు, బడుగు వర్గాల జీవితాలలో వెలుగు నింపేందుకు అహర్నిశలు శ్రమించారు. దళితుల సంక్షేమం కోసం ప్రత్యేక హాస్టల్ వ్యవస్థను ప్రారంభించారు. గురుకుల విద్యకు పునాది వేశారు. సమాజంలో సమానత్వం, సేవా విలువలను ప్రోత్సహించారు. “అధికారంలో ఉన్నవాడు దయ చూపడం కాదు, న్యాయం చేయాలి” అనే సిద్ధాంతాన్ని ఆచరణలో పెట్టారు. “శంకరన్ గారు చూపిన మార్గం ఈ రోజు రాష్ట్ర సంక్షేమ విధానాలకు దిశా నిర్దేశం చేస్తున్నది. ఆయన కలల తెలంగాణను సీఎం రేవంత్ రెడ్డి సాకారం చేస్తున్నారు” అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం విద్యా రంగంలో పలు విప్లవాత్మక చర్యలు చేపట్టింది. ప్రతి నియోజకవర్గంలో రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటు. అన్ని సంక్షేమ హాస్టళ్లకు మౌలిక సదుపాయాల అభివృద్ధి, భద్రత, స్వచ్ఛతపై ప్రత్యేక దృష్టి. గ్రీన్ చానెల్ వ్యవస్థ ద్వారా పెండింగ్ బిల్లుల తక్షణ క్లియరెన్స్. విద్యార్థుల మానసిక ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని యోగ, ధ్యానం, కౌన్సెలింగ్ ప్రోగ్రామ్స్ ప్రారంభించడం జరిగింది.

“చదువు అన్నది గొప్ప ఆస్తి. ఎక్కడికి వెళ్లినా మీ చదువే మీ పరిచయం,” అని మంత్రి విద్యార్థులకు సూచించారు. యోగా, ధ్యానం ద్వారా ఏకాగ్రతను పెంపొందించుకోవాలని, క్రమశిక్షణను జీవిత భాగంగా చేసుకోవాలని, గురువులు, తల్లిదండ్రుల పట్ల కృతజ్ఞతాభావం కలిగి ఉండాలని పిలుపునిచ్చారు. “మీ సమస్యల పరిష్కారం కోసం నేను కట్టుబడి ఉన్నాను,” అని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే అరికెనపూడి గాంధీ మాట్లాడుతూ “గౌలీదొడ్డి అభివృద్ధి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి అడ్లూరి కృషితో వేగంగా కొనసాగుతోంది,” అని ఎమ్మెల్యే గాంధీ అన్నారు. స్థానిక సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం చూపిన స్పందనకు కృతజ్ఞతలు తెలిపారు. “గౌలీదొడ్డి డ్రైనేజ్ సమస్య పరిష్కారానికి రూ.1.5 కోట్లు కేటాయించి పనులు పూర్తి చేశాం. విద్యార్థుల కోసం మౌలిక వసతులు మరింతగా బలోపేతం చేస్తాం,” అని ఎమ్మెల్యే అన్నారు. “ఇక్కడి విద్యార్థులు భవిష్యత్తులో రాష్ట్రం, దేశం గర్వించేటట్లు ఎదగాలని నా ఆకాంక్ష” అని గాంధీ పేర్కొన్నారు. ప్రిన్సిపాల్ అంజయ్య, కల్పన మాట్లాడుతూ … “గౌలీదొడ్డి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అభివృద్ధి దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ప్రశంసనీయం. మంత్రి, ఎమ్మెల్యే సహకారంతో మా విద్యార్థుల భవిష్యత్తు మరింత మెరుగుపడుతుంది,” అని వారు అన్నారు.