పట్టణ ప్రాంత పేదలకు శుభవార్త: మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి

  • జి ప్లస్1 తరహాలో ఇందిరమ్మ ఇండ్లు కట్టుకునే అవకాశం
  • మారనున్న మురికి వాడల రూపురేఖలు

హైద‌రాబాద్ : పేద‌వాడి సొంతింటి క‌ల నెర‌వేర్చాల‌నే ల‌క్ష్యంతో గౌర‌వ ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డిగారి నాయ‌క‌త్వంలో రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన ఇందిర‌మ్మ ఇండ్ల నిర్మాణం గ్రామీణ ప్రాంతాలలో శర వేగంగా సాగుతున్న నేపథ్యంలో పట్టణ ప్రాంతాలలో కూడా ఇందిర‌మ్మ ఇండ్ల నిర్మాణంపై దృష్టి సారించామ‌ని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి తెలిపారు. ఇందిర‌మ్మ ఇండ్ల పై బుధవారం నాడు మంత్రిగారు సచివాలయంలోని తన కార్యాలయంలో హౌసింగ్ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో ఇరుకు స్థలాల్లో నివసిస్తున్న పేద ప్రజలకు పక్కా ఇంటి వసతిని కల్పించేలా ఇందిరమ్మ పథకాన్ని వర్తింప చేస్తున్నామని అన్నారు. కనీసం 30 చదరపు మీటర్ల విస్తీర్ణంలో జి ప్లస్ 1 తరహాలో ఇంటిని నిర్మించుకునేందుకు అవకాశం కల్పిస్తున్నామని వెల్లడించారు. గ్రౌండ్ ఫ్లోర్లో 200 చదరపు అడుగులు మొదటి అంతస్తులో మరో 200 చదరపు అడుగులు నిర్మించుకునేలా ఈ మేరకు జీవో ఎంస్ నె 69 ద్వారా ఉత్తర్వులు జారీ చేసినట్లు వెల్లడించారు. పట్టణ ప్రాంతాల్లో పేదలకు పక్కా ఇంటి వసతిని కల్పించాలన్న లక్ష్యంతో పాటు, స్థలాల కొరత ను దృష్టిలో ఉంచుకుని కొన్ని సడలింపులు ఇచ్చామని తెలిపారు.

పట్టణ ప్రాంతాల్లోని పేదలకు పక్కా ఇంటి వసతి కోసం కొద్ది కాలంగా పట్టణ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలపై అధ్యయనం చేశాామని తెలిపారు. రాష్ట్రంలోని అనేక పట్టణాలు, నగరాల్లోని పేదలు సొంత ఇంటిని నిర్మించుకోడానికి తగిన స్థలం లేక , అరకొర వసతులతో తాత్కాలిక ఏర్పాట్లు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని అటువంటి వారి కోసం ఇందిరమ్మ ఇండ్ల ను నిర్మించి ఇవ్వడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. అనేక మంది 60 చదరపు గజాల కంటే తక్కువ విస్తీర్ణంలోని రేకుల షెడ్లు, ఇతరత్రా తాత్కాలిక ఏర్పాట్లుతో జీవిస్తున్నారు. వీరికి ఆర్ సిసి స్లాబుతో పక్కా ఇంటిని నిర్మించాలంటే తగిన స్థలం అందుబాటులో లేదు. ఈ సమస్యను అధిగమించడానికి పట్టణ ప్రాంతాల్లో జి ప్లస్ 1 నిర్మాణాలకు అనుమతినిస్తూ, ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా అందచేస్తున్న రూ .5 లక్షల ఆర్ధిక సహాయాన్ని దశల వారీగా నిర్మాణపు పనుల స్థాయిని బట్టి లబ్ధిదారులకు అందజేస్తామన్నారు.

పట్టణ ప్రాంతాల్లో ఇంటి నిర్మాణం ఎలా ఉండాలంటే.. జి+1 విధానంలో పట్టణ ప్రాంతాల్లోని లబ్ధిదారులు 96 చదరపు అడుగుల విస్తీర్ణంలో , 70 అడుగుల విస్తీర్ణంలో వేర్వేరుగా రెండు గదులతోపాటు, కనీసం 35.5 చదరపు అడుగుల్లో వంటగదిని నిర్మించుకోవాలి, ప్రతి ఇంటికి ప్రత్యేకంగా టాయిలెట్, బాత్ రూంలు తప్పనిసరిగా ఉండాలని,
ఈ ఇంటి నిర్మాణం ఆర్ సిసి స్లాబ్ తో ఉండాలని, ఇందుకు సంబంధించిన స్ట్రక్చరల్ డిజైన్లకు డిఇఇ (హౌసింగ్)అనుమతి తీసుకోవాలని స్పష్టం చేశారు.

నాలుగు దశల్లో రూ.5 లక్షలు చెల్లింపు…మొదటి అంతస్తు – రూఫ్ లెవల్ వరకు నిర్మాణం అయితే రూ. 1 లక్ష , అటు తరువాత గ్రౌండ్ ఫ్లోర్ – రూఫ్ వేసిన తరువాత రూ.1 లక్ష, ఆపైన ఫస్ట్ ఫ్లోర్ లో కాలమ్స్, స్లాబ్, గోడల నిర్మాణాలు పూర్తి అయిన పిదప రూ.2 లక్షలను, ఇంటి నిర్మాణపు పూర్తి అయిన తరువాత మరో లక్ష రూపాయలను విడుదల చేస్తామన్నారు. దేశంలో ఏ రాష్ట్ర ప్ర‌భుత్వం కూడా పేద‌వాళ్ల ఇంటికోసం ఐదు ల‌క్ష‌ల రూపాయిలు ఖ‌ర్చు చేయ‌డం లేద‌ని, ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీ మేర‌కు రాష్ట్రంలో అర్హులైన ప్ర‌తి ఒక్క‌రికీ ఇందిర‌మ్మ ఇండ్లు నిర్మించి ఇవ్వ‌డ‌మే ఈ ప్ర‌భుత్వ ల‌క్ష్యమ‌ని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం ఒక ఎత్తు అయితే, పట్టణ ప్రాంతాల్లో మరో ఎత్తు అని, ఇది ప్రభుత్వానికి ఒక సవాల్ అని దీనిని దృష్టిలో ఉంచుకుని, పట్టణ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంపై ప్రధానంగా దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు.