- యువ ఆవిష్కర్తలు దూసుకు వెళ్తున్నారు
- ప్రపంచస్థాయి వ్యవస్థల రూపకల్పనకు కేంద్రంగా తెలంగాణ
- పరిశోధనా సంస్థలు, పెట్టుబడిదారులకు స్వాగతం
- ప్రపంచ స్థాయి మౌలిక వసతుల కల్పనకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉంది
- ప్రకృతిని మించి పోవడం కాదు దాని నుంచి నేర్చుకోవడం మన కర్తవ్యం
- Jrc కన్వెన్షన్ లో జరుగుతున్న bioinspired frontiers 2025 అంతర్జాతీయ సదస్సులో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
పండిట్ జవహర్లాల్ నెహ్రూ కాలం నుంచి హైదరాబాద్ సైన్స్ మరియు ఆవిష్కరణలకు కేంద్రంగా విరాజిల్లుతోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. బుధవారం jrc కన్వెన్షన్ లో నిర్వహించిన Bioinspire ఫ్రాంటియర్స్ 2025 – ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ స్పేస్ ఎకానమీ, బయోమిమిక్రి & ఎక్స్‌ట్రాటెరెస్ట్రియల్ రిసోర్స్ సదస్సులో ముఖ్యఅతిథిగా డిప్యూటీ సీఎం ప్రసంగించారు. ప్రపంచ స్థాయి వ్యవస్థల రూపకల్పనకు కేంద్రంగా తెలంగాణ నిలిచింది అన్నారు. హైదరాబాద్ కు ప్రపంచ స్థాయి పరిశోధన సంస్థలు, పెట్టుబడిదారులు, ఆవిష్కర్తలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన ఆహ్వానం పలుకుతున్నామని తెలిపారు. ప్రపంచ స్థాయి మౌలిక వసతుల కల్పనకు సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉంది అన్నారు. హైదరాబాదు నగరానికి ప్రపంచ నలుమూలల నుంచి విచ్చేసిన శాస్త్రవేత్తలు, పరిశ్రమ నాయకులు, ఆవిష్కర్తలకు ఆయన స్వాగతం తెలిపారు.శాస్త్ర సున్నితత్వం మరియు కల్పనాత్మకత కవిత్వం కలిసిన ఈ నగరం ఎప్పుడూ సృజనాత్మకతకు నిలయంగా నిలిచింది అన్నారు.
బయోఇన్స్పైర్డ్ ఫ్రాంటియర్స్ 2025—జీవశాస్త్రం, సాంకేతికత, అంతరిక్ష అన్వేషణల మధ్య జరుగుతున్న ఈ ప్రపంచ స్థాయి సంభాషన భారత శాస్త్రీయ గమ్యాన్ని అర్థ శతాబ్దానికి పైగా నిశ్శబ్దంగా మలిచిన ఈ నగరంలో జరుగుతుండటం గర్వకారణం అన్నారు. హైదరాబాద్‌కు సైన్స్ తో ఉన్న అనుబంధం లోతైనది మరియు చిరకాల మైనది అన్నారు. భారత తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ నాయకత్వంలో ఈ నగరంలో అనేక శాస్త్రీయ సంస్థలు పునాది వేసుకున్నాయి అని వివరించారు. నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (NRSC)—మునుపటి NRSA—హైదరాబాద్‌ను భారతదేశపు “ఆకాశనేత్రం”గా మార్చింది. ఉపగ్రహ చిత్రాలను వ్యవసాయం, నీటి వనరులు, విపత్తు నిర్వహణలో వినియోగిస్తూ మార్గదర్శిగా నిలిచిందని తెలిపారు. రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ (DRDO) ఇక్కడ DRDL, DMRL, RCI వంటి ప్రతిష్ఠాత్మక ప్రయోగశాలలను స్థాపించి, దేశానికి క్షిపణి, పదార్థ సైన్స్ లో నైపుణ్యాన్ని అందించిన తరతరాల శాస్త్రవేత్తలను తీర్చిదిద్ది ఘనత హైదరాబాద్ కు సొంతం అన్నారు. ఇవే కాకుండా భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (BDL), మిశ్ర ధాతు నిగమ్ (MIDHANI), ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL) వంటి పబ్లిక్ రంగ సంస్థలు కూడా ఇక్కడే ఎదిగి, దేశానికి విమానయాన, లోహశాస్త్రం, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో బలమైన పునాది వేశాయి అని తెలిపారు. ఈ దశాబ్దాల ప్రజా పెట్టుబడి, శాస్త్రీయ స్పూర్తి కలయికతో రూపుదిద్దుకున్న ఈ పరిసర వ్యవస్థే హైదరాబాద్‌కు ప్రత్యేకమైన “సైన్స్ డీఎన్‌ఏని ఇచ్చింది,అది క్రమశిక్షణతో కూడినది, సృజనాత్మకమైనది, నిశ్శబ్దంగా కానీ స్పష్టమైన ఆశయాలతో కూడింది అన్నారు. ఈ వారసత్వాన్ని నేటి యువ ఆవిష్కర్తలు కొత్త ఉత్సాహంతో ముందుకు తీసుకెళ్తున్నారని డిప్యూటీ సీఎం ఆనందం వ్యక్తం చేశారు. స్కైరూట్ ఏరోస్పేస్, ఇక్కడే హైదరాబాద్‌లో జన్మించి, భారతదేశంలోనే ప్రైవేట్ రంగం ద్వారా రాకెట్ ప్రయోగాలు సాధ్యమని నిరూపించింది. వారి విజయం కేవలం ఉత్పత్తి కాదు, ఒక కొత్త ఎకోసిస్టమ్‌ను సృష్టించింది: ప్రొపల్షన్ ఇంజనీర్లు, కాంపోజిట్ నిపుణులు, స్పేస్ సరఫరాదారులు అనే కొత్త తరాన్ని పెంచింది అని వివరించారు.
ధ్రువ స్పేస్, మరో హైదరాబాద్ ఆధారిత సంస్థ, ఉపగ్రహ రూపకల్పన నుండి తయారీ, ప్రయోగం, గ్రౌండ్ స్టేషన్‌ల వరకు సంపూర్ణ పరిష్కారాలను చూపుతుంది, మనం ప్రపంచ స్థాయి వ్యవస్థలను మన రాష్ట్రంలోనే రూపకల్పన చేయగలమని చూపిస్తోంది అని తెలిపారు.
ఇవన్నీ చుట్టూ రోబోటిక్స్, పదార్థ శాస్త్రం, 3D ప్రింటింగ్ రంగాల్లో కొత్తగా ఎదుగుతున్న సంస్థలు కలిసి భారత అంతరిక్ష ఆర్థిక వ్యవస్థకు కొత్త రూపాన్ని ఇస్తున్నాయి అన్నారు. ఇవి ఒంటరిగా పని చేయడం లేదు. ఇవి హైదరాబాద్‌లోని IIT Hyderabad, IIIT Hyderabad, BITS Pilani, University of Hyderabad, T-Works వంటి సంస్థలతో బలమైన అనుసంధానం కలిగి ఉన్నాయి అని తెలిపారు. ఇదే తెలంగాణా మోడల్ ఆఫ్ ఇన్నోవేషన్, ప్రభుత్వ సంస్థలు పునాది వేస్తాయి, స్టార్టప్‌లు దానిపై నిర్మిస్తాయి, విశ్వవిద్యాలయాలు ప్రతిభను పెంపొందిస్తాయి అని వివరించారు. ఈరోజు హైదరాబాద్ భారతదేశంలోని అత్యంత విభిన్న సాంకేతిక ఎకోసిస్టమ్‌లలో ఒకటిగా నిలిచింది—IT, లైఫ్ సైన్సెస్, ఎలక్ట్రానిక్స్, రక్షణ, ఇప్పుడు అంతరిక్ష సాంకేతికతలో ప్రపంచ నాయకులకు ఆతిథ్యం ఇస్తోంది అన్నారు.
అదిబట్లలో ఏరోస్పేస్ మాన్యుఫాక్చరింగ్,
• ఈ-సిటీలో ఎలక్ట్రానిక్స్,
• జీనోమ్ వ్యాలీలో ఫార్మా,
• మరియు షంషాబాద్ సమీపంలోని మొబిలిటీ వ్యాలీలో రవాణా సాంకేతికతలు.
ప్రతి క్లస్టర్‌లో మూడు విలువలు ప్రధానంగా ఉంటాయి. ఆవిష్కరణ,
తయారీ, సుస్థిరత అని వివరించారు. ISRO అనుబంధ సౌకర్యాలు, టెలీమెట్రీ కేంద్రాలు, ఇన్క్యూబేషన్ స్థలాలు హైదరాబాద్‌ను భవిష్యత్తు అంతరిక్ష మిషన్లకు ప్రధాన కేంద్రంగా నిలిపాయి అని డిప్యూటీ సీఎం తెలిపారు. అవి చంద్రయానం కావొచ్చు, భూమి పరిశీలన కావొచ్చు, లేదా అంతరిక్ష వనరుల వినియోగం కావొచ్చు అన్నారు. ఈ కాన్ఫరెన్స్ థీమ్—“బయోఇన్స్పైర్డ్ ఫ్రాంటియర్స్”—మనకు ఒక లోతైన విషయం గుర్తు చేస్తుంది:
ప్రకృతే అసలు ఇంజనీర్ అని డిప్యూటీ సీఎం విశ్లేషించారు. అత్యంత అందమైన రెక్కలు, కవచాలు, న్యూరల్ నెట్వర్క్స వంటివి ప్రకృతిలో ఇమిడి ఉన్నాయి అన్నారు. మన కర్తవ్యం ప్రకృతిని మించి పోవడం కాదు, దానినుంచి నేర్చుకోవడం అని వివరించారు. తెలంగాణా ప్రభుత్వం ఈ తత్త్వాన్ని తన అభివృద్ధి దృక్పథంలో భాగం చేస్తోంది, బయోమిమెటిక్ డిజైన్, గ్రీన్ బిల్డింగ్ కోడ్స్, నీటి నిర్వహణ, శుద్ధ ఇంధనం రంగాల్లో దీన్ని ప్రోత్సహిస్తోంది అని వివరించారు. అంతరిక్షంలోకి విస్తరించేప్పుడు కూడా మనం ఈ వినయాన్ని తీసుకెళ్లాలి, ఆవిష్కరణ, సంరక్షణ రెండూ కలిసి రెండు కాళ్ళ మాదిరిగా నడవాలి అన్నారు. భారత అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ రాబోయే దశాబ్దంలో విపరీతంగా పెరగబోతోంది. ఆ వృద్ధికి తెలంగాణా లాంచ్‌ప్యాడ్‌గా ఉండాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది అన్నారు. ప్రపంచంలోని పరిశోధనా సంస్థలు, పెట్టుబడిదారులు, ఆవిష్కర్తలను హైదరాబాద్‌కి ఆహ్వానిస్తున్నాము అన్నారు. సహాయక విధాన వాతావరణం, ఇన్క్యూబేషన్ సపోర్ట్, ప్రపంచ స్థాయి మౌలిక వసతులు అందించడానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉంది అన్నారు. హైదరాబాద్ ఈరోజు కేవలం ఒక గమ్యం కాదు, ఒక మనస్తత్వం: విచారణాత్మకమైనది, ఆత్మవిశ్వాసంతో కూడినది అన్నారు. ఈ రోజు ఇక్కడ మొదలైన చర్చలు భవిష్యత్తులో భూమి మీదా, అంతరిక్షంలోనూ మంచిని నిర్మించే భాగస్వామ్యాలుగా మారాలని కోరుకుంటున్నాను అన్నారు. తెలంగాణా ఎల్లప్పుడూ ప్రభుత్వ సంస్థలను ప్రేరేపించే, స్టార్టప్‌లు ఆవిష్కరించే, ప్రపంచ శాస్త్రం కలిసే ప్రదేశంగా ఉంటుందని స్పష్టం చేశారు. జ్ఞానం మరియు అన్వేషణ మధ్య వంతెనగా, భూమి మరియు ఆకాశం మధ్య సేతువుగా హైదరాబాద్ మహానగరం ఎప్పటికీ నిలవాలని డిప్యూటీ సీఎం ఆకాంక్షించారు. సమావేశంలో ట్రాన్స్కో సిఎండి కృష్ణ భాస్కర్, GEOPAQ సీఈవో ఎం అబ్బాస్, లీడ్ స్పాన్సర్ సుజిత్ తదితరులు పాల్గొన్నారు.
