- పొనికి విత్తనాల జెర్మినేషన్ లో ములుగు అటవీ కళాశాల స్కాలర్ విజయం
హైదరాబాద్ : ప్రపంచంచంలో ప్రఖ్యాతి గాంచిన నిర్మల్ బొమ్మల తయారీకి “పొనికి” చెట్టు చెక్కలను ఉపయోగిస్తారు. అయితే, ఈ అత్యంత అరుదైన వృక్ష జాతి ” పొనికి ” చెట్టు, దీనికి శాస్త్రీయ నామం గీవోటియా రొట్లేరిఫార్మీస్, కలప మృదువుగాను, తేలికగా ఉంటుంది. ఈ పొనికి కలపతో నిర్మల్ బొమ్మలు, సాంప్రదాయ కళాఖండాలు తయారీచేస్తారు. అయితే, ఈ జాతి వృక్షం నిరాదరణకు గురికావడం, పేలవమైన పునరుత్పత్తి,, విత్తనాల నాణ్యత లోపించడం, సరైన భూసారం లేకపోవడంతో అంతరించే జాతిగా ఈ పొనికి చెట్టు చేరింది. కాగా, ములుగు లోని అటవీ కళాశాల, రీసర్చ్ ఇనిస్టిట్యూట్ ఈ పొనికి చెట్ల విత్తనాల అంకురోత్పత్తి, పొనికి చెట్ల పునరుత్పత్తిలో గణనీయమైన విజయాన్ని సాధించింది. FCRI కి చెందిన ట్రీ బ్రీడింగ్, ఇంప్రూవ్మెంట్ విభాగానికి చెందిన ఎమ్మేసి రీసర్చ్ స్కాలర్ మాలోతు మౌనిక ఈ విజయాన్ని సాధించింది. ఇదే విభాగానికి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. రీజా సుందరం గైడెన్స్ లో చేపట్టిన ఈ పొనికి విత్తనాల జెర్మినేషన్ రేటు 80 శాతం వరకు వచ్చేలా విజయం సాధించారు. వీరు ఇటీవల చేపట్టిన ఈ సీడ్ జెర్మినేషన్ ప్రోటోకాల్ కు పేటెంట్ పొందేదుకై ప్రతిపాదనలు పంపామని ములుగు అటవీ అకళాశాల డీన్ వీ. కృష్ణ వెల్లడించారు. అటవీ ఆధారిత పరిశ్రమలు, సామాజిక ఆర్థిక పురోభివృద్ధికి దోహదపడే పొనికి వృక్ష జాతి పునరుద్దరణకు అటవీ కళాశాల పరిశోధకులు చేపట్టిన ఈ సీడ్ జెర్మినేషన్ విజయవంతం కావడం ఒక చారిత్రిక అంశమని అన్నారు. దీనిద్వారా, పెద్ద ఎత్తున పొనికి చెట్ల పెంపకం చేపట్టడమే కాకుండా,పర్యావరణ పరిరక్షణ, హస్తకళల ఆధారిత ఆర్థిక పురోగతి కి ఈ పరిశోధన దోహదపడుతోంది. నిర్మల్ హస్తకళల అభివృద్ధికి గాను ఈ పొనికి మొక్కల పెంపకానికి విత్తనాలను అటవీ శాఖకు అందచేయడం ద్వారా అంతరించి పోతున్న పొనికి చెట్ల అభివృద్ధికి తద్వారా నిర్మల్ ఝాస్తకళల పరిశ్రమకు ములుగు అటవీ కళాశాల, రీసర్చ్ ఇనిస్టిట్యూట్ సరికొత్త మార్గం చూపించింది.