రిజిస్ట్రేష‌న్ శాఖ‌లో కొత్త‌గా 14 మంది స‌బ్ రిజిస్ట్రార్లు: మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి

  • కాంగ్రెస్ హయాంలోనే యువ‌త‌కు ఉద్యోగాలు
  • నిజాయితీ, నిబ‌ద్ద‌త‌, క్ర‌మ‌శిక్ష‌ణ‌తో ప‌నిచేయండి

హైద‌రాబాద్ : నీళ్లు.. నిధులు.. నియామ‌కాల ప్రాతిపదిక‌న ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్ర‌భుత్వ హ‌యాంలోనే యువ‌త‌కు ఉద్యోగావ‌కాశాలు ల‌భిస్తున్నాయ‌ని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి అన్నారు. ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మీష‌న్ ద్వారా గ్రూప్‌-2 నియామ‌కాల‌లో ఎంపికై స్టాంప్స్ & రిజిస్ట్రేష‌న్ శాఖ‌లో స‌బ్ రిజిస్ట్రార్‌లుగా నియ‌మితులైన 14 మంది అధికారులు గురువారం రాష్ట్ర స‌చివాల‌యంలోని మంత్రి పొంగులేటిని మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిసి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. వారిని మంత్రి అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి కొత్తగా నియమితులైన సబ్ రిజిస్టర్లకు ఇండియన్ స్టాంప్ యాక్ట్ బుక్ లను అందజేశారు. మంత్రి మాట్లాడుతూ గ‌త ద‌శాబ్ద కాలంలో నిరుద్యోగ యువ‌త క‌న్న‌క‌ల‌లు క‌ల్ల‌లై పోయాయ‌ని కొత్త ఉద్యోగాల‌ను సృష్టించ‌డం మాట అలా ఉంచితే , ఉద్యోగాల నియామ‌క ప్ర‌క్రియ‌ల‌లో గ‌త ప్ర‌భుత్వం చూపించిన అల‌సత్వం, నిర్లక్ష్యం కార‌ణంగా నిరుద్యోగ యువ‌త ఆశ‌లు అడుగంటిపోయాయ‌ని విమ‌ర్శించారు. ఆనాటి ప్ర‌భుత్వం చేప‌ట్టిన అర‌కొర ఉద్యోగ నియామ‌క ప్ర‌క్రియ‌ల‌లో చోటు చేసుకున్న అక్ర‌మాలు, పేప‌ర్ లీకేజీలు, అస‌మ‌ర్ద ప‌రీక్షా నిర్వ‌హ‌ణ వ‌ల్ల అర్హులైన యువ‌త‌కు ఉద్యోగాలు రాని ప‌రిస్ధితి దాపురించింద‌న్నారు.

ఈ ప‌రిస్ధితుల‌లో ఇందిర‌మ్మ ప్ర‌భుత్వం ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన హామీల మేరకు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి నాయ‌క‌త్వంలో ఉద్యోగాల భ‌ర్తీ ప్ర‌క్రియ‌కు అత్యంత ప్రాధాన్య‌త ఇచ్చింద‌న్నారు. అందువ‌ల్లే గ‌త 20 నెల‌ల పాల‌నా కాలంలో ఇప్ప‌టి వ‌ర‌కు సుమారు 70 వేల‌కు పైగా ఉద్యోగాల భ‌ర్తీ జ‌రిగింద‌ని వివ‌రించారు. అంతేగాక నిరుద్యోగ యువ‌త‌కు స్వ‌యం ఉపాధి క‌ల్పించాల‌న్న ఆలోచ‌న మేర‌కు వివిధ శాఖ‌ల త‌ర‌పున కార్యాచ‌ర‌ణ‌ను విస్తృతం చేశామ‌ని మంత్రి పొంగులేటి చెప్పారు. తాను ప్రాతినిధ్యం వ‌హిస్తున్న రెవెన్యూ శాఖ‌లో జీపీవోల నియామ‌కం, హౌసింగ్ విభాగంలో అవుట్ సోర్సింగ్ ప‌ద్ద‌తిలో దాదాపు 350 మంది ఇంజ‌నీర్లు, స‌ర్వే విభాగంలో 3465 మంది లైసెన్స్‌డ్ స‌ర్వేయ‌ర్ల‌కు ఉపాధి అవ‌కాశాలు క‌ల్పించామ‌ని వివ‌రించారు. కొత్త‌గా ఉద్యోగాల‌లో చేరే అధికారులు సామాన్య ప్ర‌జ‌లే ల‌క్ష్యంగా సేవ‌లు అందించాల‌ని, త‌ద్వారా ఉద్యోగానికి న్యాయం చేసి ప్ర‌భుత్వానికి పేరు ప్ర‌తిష్ట‌లు తేవాల‌ని సూచించారు. స్టాంప్స్ & రిజిస్ట్రేష‌న్ శాఖ చాలా జాగ్ర‌త్త‌గా ప‌నిచేయాల్సి ఉంటుంద‌ని, ఎటువంటి ప్ర‌లోభాల‌కు త‌లొగ్గ‌కుండా నిజాయితీ, నిబ‌ద్ద‌త అంకిత‌భావం, క్ర‌మ‌శిక్ష‌ణ‌తో ప‌నిచేసి ప్ర‌భుత్వ పేరు ప్ర‌తిష్ట‌ల‌ను ఇనుమ‌డింప‌జేయాల‌ని అన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో రంగారెడ్డి జిల్లా రిజిస్ట్రార్ సంతోష్ రెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు.