బాధిత కుటుంబాలను అన్ని విధాల ఆదుకుంటాం: మంత్రి జూపల్లి కృష్ణారావు

కర్నూలు జిల్లాలో జరిగిన ప్రైవేట్ ట్రావెల్ బస్సు ప్రమాదంలో మృతి చెందిన, గాయపడ్డ తెలంగాణ ప్రాంతానికి చెందిన బాధిత కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. శుక్రవారం ప్రమాద ఘటనా స్థలాన్ని జోగులాంబ గద్వాల జిల్లా అధికారులతో కలిసి మంత్రి జూపల్లి కృష్ణారావు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బస్సు ప్రమాద ఘటనలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఆరుగురు మృతి చెందారని, పదిమంది గాయాలతో బయటపడ్డారన్నారు. మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నామన్నారు. మృతి చెందిన తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారికి సీఎం రేవంత్ రెడ్డి రూ.5 లక్షలు, గాయపడ్డ వారికి రూ.2 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారన్నారు. ఈ ప్రమాదం బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంతో జరిగిందని, భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. మహబూబ్నగర్ జిల్లాలోనూ 2013లో పాలెం వద్ద జరిగిన ఘటనలో 48 మంది ప్రాణాలు కోల్పోయారన్నారు. ప్రైవేట్ బస్సుల యాజమాన్యాలు సుశిక్షకులైన డ్రైవర్లను నియమించుకునేలా, రవాణా శాఖ నియమ, నిబంధనలను కచ్చితంగా పాటించేలా ఆదేశాలు జారీ చేస్తామన్నారు. మంత్రితోపాటు తెలంగాణ జెన్కో సిఎండి హరీష్, అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు, జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ బి. ఎం. సంతోష్, ఎస్పీ శ్రీనివాసరావు, డీఎస్పీ మొగిలయ్య. ఆర్డీవో అలివేలు, ఉండవెల్లి ఎమ్మార్వో ప్రభాకర్, తదితరులున్నారు.