జాయింట్‌ కలెక్టర్‌ పదవి రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం

  • ఫారెస్ట్‌ సెటిల్‌మెంట్‌ ఆఫీసర్లుగా అదనపు కలెక్టర్లు

తెలంగాణ రాష్ట్రంలో జాయింట్‌ కలెక్టర్‌ పదవిని రద్దు చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని జిల్లాల్లో అదనపు కలెక్టర్లను ఫారెస్ట్‌ సెటిల్‌మెంట్‌ ఆఫీసర్లుగా నియమించింది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. ఈ క్రమంలో అటవీ భూమి సర్వే, హకుల నిర్ధారణ, సెటిల్‌మెంట్‌ పనులు వీరి పరిధిలోకి వస్తాయి. 1967 ఫారెస్ట్‌ యాక్ట్‌ కింద ఈ ఉత్తర్వులు జారీచేసినట్టు పేర్కొంది. ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ పర్యవేక్షణలో దీనిని అమలు చేయనుంది. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లు, రెవెన్యూ అధికారులు తగిన చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీచేసింది. ఆర్డీవో ఆఫీసర్‌ హోదా కంటే తక్కువ కాని అధికారులు ఉమ్మడి రాష్ట్రంలోని జిల్లాల్లో అటవీ సెటిల్‌మెంట్‌ అధికారి విధులు నిర్వర్తిస్తున్నారని, హైదరాబాద్‌లోని అటవీ, పర్యావరణ శాఖలో నిర్దిష్ట పదవిని సృష్టించే వరకు జిల్లా అదనపు కలెక్టర్‌ (రెవెన్యూ)కు అటవీ సెటిల్‌మెంట్‌ ఆఫీసర్‌ పనిని అప్పగించడానికి రెవెన్యూశాఖకు ఎటువంటి అభ్యంతరం లేదని తెలిపింది. ఈ నేపథ్యంలో జాయింట్‌ కలెక్టర్‌ పదవిని రద్దు చేసి, అదనపు కలెక్టర్‌ పదవిని భర్తీ చేయాలనే ఉద్దేశంతో రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో అటవీ సెటిల్‌మెంట్‌ ఆఫీసర్లను ప్రభుత్వం నియమించింది. దీనిపై ఈ నెల 31 రాష్ట్ర ప్రభుత్వ గెజిట్‌లో ప్రచురించనున్నట్టు ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.

ఫారెస్ట్‌ సెటిల్‌మెంట్‌ ఆఫీసర్లు అటవీ భూముల హకులు, అటవీ ప్రాంతాల నిర్ధారణ చేపడతారు. వీరిని 1927 చట్టం ప్రకారం నియమిస్తారు. వీళ్లు భూముల వివరాలను పరిశీలించడం, అవకతవకలు ఉన్నవాటిపై విచారణ నిర్వహించడం, అటవీ భూములకు సంబంధించిన ప్రకటనలు జారీచేయడం వంటివి చేస్తారు. అటవీ ప్రాంతంలోకి ప్రవేశించే అధికారం వీరికి ఉంటుంది. అదనపు కలెక్టర్‌ పదవిలో ఉన్న అధికారులు కలెక్టర్‌కు సహాయంగా రెవెన్యూ కార్యకలాపాలు, భూముల కేటాయింపులు, పౌరసరఫరాలు, భూభారతి వంటి అంశాలను పర్యవేక్షిస్తారు. గ్రామ పంచాయతీలు, పురపాలక సంఘాల స్థానిక సంస్థల అభివృద్ధి ప్రణాళికలను చూసుకుంటారు. పరిశుభ్రత, పచ్చదనం వంటి ప్రత్యేక కార్యక్రమాలను అమలుచేయడంతోపాటు, వాటిని సమర్థంగా నిర్వహించడానికి అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తారు. వివిధ ప్రభుత్వ పథకాల అమలును పర్యవేక్షిస్తారు. క్షేత్రస్థాయిలో సమస్యలను పరిషరించడానికి కృషి చేస్తారు. కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్‌ తర్వాత వీరు ముఖ్యులుగా ఉంటారు.