పార్టీ పరంగా రిజర్వేషన్‌లకు ఒప్పుకోం : బీసీ జెఎసి చైర్మన్, రాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణయ్య

స్థానిక సంస్థల ఎన్నికలను పాత పద్ధతిలో నిర్వహిస్తామంటే ఒప్పుకునే ప్రసక్తే లేదని బిసి జెఎసి చైర్మన్, రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య అన్నారు. పార్టీ పరంగా రిజర్వేషన్‌ల అమలుకు అంగీకరించ బోమని ఆయన ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్‌లను పెంచుకోవచ్చని సుప్రీంకోర్టు చెప్పిందని ఆయనన్నారు. సరైన వాదనలు వినిపిస్తే కోర్టు స్టే ఎందుకు ఇస్తుందని కృష్ణయ్య ప్రశ్నించారు. బిసిల తరఫున హైకోర్టులో వాదనలు వినిపిస్తామని ఆయనన్నారు. అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్తామన్నారు. సంవత్సరం నుంచి ఎన్నికలు వాయిదా పడుతున్నాయని మరో రెండు నెలలు వాయిదా పడితే ఏమవుతుందన్నారు. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో ఎన్నికలు నాలుగేళ్లు వాయిదా పడ్డాయని గుర్తు చేశారు. బిసిలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం ప్రత్యేక తెలంగాణ ఉద్యమ ం తరహా ఉద్యమాలు చేస్తామని ఆర్.కృష్ణయ్య హెచ్చరించారు.